‘అజ్ఞాతవాసి’ మూవీ రివ్యూ-రేటింగ్

సినిమా : అజ్ఞాతవాసి
నటీనటులు : పవన్ కళ్యాణ్, ఖుష్బూ, ఆది పినిశెట్టి, కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయెల్, తదితరులు
కథ-స్ర్కీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత : ఎస్.రాధాకృష్ణ
సంగీతం : అనిరుధ్
సినిమాటోగ్రఫీ : మనికందన్
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు
బ్యానర్ : హారికా అండ్ హాసినీ క్రియేషన్స్
రిలీజ్ డేట్ : 10-01-2017

టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘అజ్ఞాతవాసి’ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి తెరకెక్కడంతో దీనిపై జనాలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రోమోలు తెచ్చిపెట్టిన క్రేజ్ మాటేమోగానీ.. ఈ జంటే ఈ చిత్రానికి హైలైట్. త్రివిక్రమ్ పెన్, పవన్ కళ్యాణ్ పవర్ మీదున్న నమ్మకంతో ఈ చిత్రం ప్రేక్షకుల్ని పిచ్చపిచ్చగా ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నారు. మరి.. ఆ అంచనాల్ని అందుకోవడంలో ‘అజ్ఞాతవాసి’ సక్సెస్ అయ్యిందా? లేదా? పదండి రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :
‘ఏబీ’ సంస్థ‌ల‌కు అధిప‌తి అయిన గోవింద్ భార్గ‌వ్ (బొమ‌న్ ఇరానీ)ని, అతని కొడుకుని వ్యాపార లావాదేవీల కారణంగా కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు చంపేస్తారు. దాంతో గోవింద్ భార్య ఇంద్రాణి బిజినెస్ వ్యవహారాల పర్యవేక్షణ కోసం అస్సాం నుంచి బాలసుబ్ర‌మ‌ణ్యం(ప‌వ‌న్ క‌ల్యాణ్‌)ని రప్పించి.. అతనిని మేనేజ‌ర్‌గా నియమిస్తుంది. బాల‌సుబ్ర‌మ‌ణ్యం మేనేజ‌ర్‌గా అన్ని పనులు చూసుకుంటూనే.. గోవింద్ హత్యకు కారకులెవరనే విషయంపై ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు.

ఇంత‌కు గోవింద్‌ని, అతని కొడుకుని హత్య చేసింది ఎవరు? అస‌లు బాల‌సుబ్ర‌మ‌ణ్య‌ం ఎవరు? ఇంద్రాణి అతడినే ఎందుకు ఏబీ సంస్థలకి మేనేజర్‌గా నియమిస్తుంది? బాలసుబ్రమణ్యంకి, ఆ ఫ్యామిలీకి లింక్ ఏంటి? ఈ కథలో సీతారామ్‌(ఆదిపినిశెట్టి) ఎవ‌రు? సీతారామ్‌కి, గోవింద్‌కి ఎటువంటి సంబంధాలున్నాయి? అనే ఆసక్తికరమైన అంశాల చుట్టూ ఈ సినిమా నడుస్తుంది.

విశ్లేషణ :
త్రివిక్రమ్ సినిమాలు అనగానే.. మైండ్‌బ్లోయింగ్ డైలాగ్స్, కడుపుబ్బా నవ్వించే కామెడీని కలిపి ఆసక్తికరమైన డ్రామాని చూపిస్తాడనే విషయం అందరికీ తెలుసు. ‘అజ్ఞాతవాసి’లోనూ అదే మసాలా వడ్డించాడని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఈసారి త్రివిక్రమ్ అనే చింత చెట్టులో చింతకాయలు పెద్దగా రాలలేదు.. రాలిన కాయలు పెద్దగా పులుపు కూడా లేవు. అలాగని సినిమా మరీ బోరింగ్‌గానూ, రొటీన్ రొడ్డకొట్టుకుడు కాదు.. ప్రేక్షకుల్ని కన్వీన్స్ చేసే విధంగానే చిత్రాన్ని రూపొందించాడు కానీ కోరుకున్న మసాలాని మాత్రం పెద్దగా దట్టించలేకపోయాడంతే!

ఫస్టాఫ్ విషయానికొస్తే.. ఒక సీరియస్ సన్నివేశంతో సినిమా చాలా ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అవుతుంది. ఇక పవన్ ఎంట్రీని ఎలా కోరుకుంటారో, అంతకుమించిన భారీతనంతో త్రివిక్రమ్ ఆయన ఎంట్రీని రక్తికట్టించాడు. ఆ తర్వాత సినిమా మొత్తం సరదాగానే సాగుతుంది. హీరోయిన్లతో రొమాన్స్, మనస్ఫూర్తిగా నవ్వుకునే కామెడీ ఎపిసోడ్స్‌తో ఫన్నీగా సాగుతుంది. అక్కడక్కడ త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ బాగానే పేలాయి. పాటలు సీన్లకు తగ్గట్టుగానే బాగా కుదిరాయి. వాటి పిక్చరైజేషన్ అద్భుతంగా ఉంది. ఒకానొక దశలో చిత్రం కాస్త సీరియస్‌గా టర్న్ తీసుకుంటుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ట్విస్ట్‌కా బాప్‌తో మరో మలుపు తిరుగుతుంది.

ఇక సెకండాఫ్‌ నుంచి అసలు కథ మొదలవుతుంది. గోవింద్ హత్యకి కారకులెవరో తెలుసుకునేందుకు పవన్ వేసే ఎత్తుగడలు, వాటిని త్రివిక్రమ్ ప్రెజెంట్ చేసిన విధానాలు ఆకట్టుకున్నాయి. ఓ 25 నిముషాల కామెడీ ఎపిసోడ్‌తో జనాల్ని కడుపుబ్బా ఎంటర్టైన్ చేశాడు. ఇక ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ రొటీన్‌గానే ఉన్నప్పటికీ.. త్రివిక్రమ్ తన మార్క్ స్టైల్‌లో చూపించాడు. అక్కడక్కడ కాస్త సాగదీతగా అనిపించినా.. తర్వాతి సీన్లతో త్రివిక్రమ్ కన్వీన్స్ చేయగలిగాడు. ఇక క్లైమాక్స్ విషయానికొస్తే.. ఎప్పట్లాగే త్రివిక్రమ్ తనదైన శైలిలో సినిమాని ముగించాడు.

ఓవరాల్‌గా చూస్తే.. ఇది రొటీన్ రివేంజ్ డ్రామానే అయినా త్రివిక్రమ్ భిన్నమైన స్ర్కీన్‌ప్లే చాలా ఆసక్తికరంగా ఓ ఫ్యామిలీ డ్రామాని తీర్చిదిద్దాడు. కాకపోతే.. త్రివిక్రమ్ మార్క్ మిస్ ఫైర్ అయితే.. పవన్ మాత్రం తన పవర్ చూపించాడు.

నటీనటుల ప్రతిభ :
త్రివిక్రమ్ చెప్పినట్లుగానే పవన్ కళ్యాణ్ తన నటవిశ్వరూపంతో సినిమాని వన్ మ్యాన్ షోగా నడిపించాడు. బాలసుబ్రహ్మణ్యం, అభిషిక్త భార్గవగా పవన్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. డైలాగులు, యాక్షన్‌ సన్నివేశాల్లో తనదైన మార్క్‌తో పవన్ కట్టిపడేశాడు. ‘స్టాలిన్‌’ తర్వాత ఖుష్బుకు మరో మంచి పాత్ర దక్కిందని చెప్పుకోవచ్చు. తన పాత్రకి పూర్తి న్యాయం చేస్తూ తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆది పినిశెట్టి ఇప్పటికే తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఈ చిత్రంలోనూ తన మార్క్ యాక్టింగ్‌తో అదరహో అనిపించాడు. మురళీశర్మ, రావు రమేష్‌లు ఇందులో తమలోని కొత్త కోణం చూపించాడు. తమ కామెడీ టైమింగ్‌తో బాగా నవ్వించారు. వెన్నెల కిషోర్ కూడా నవ్వించడానికి ప్రయత్నించాడు. కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయెల్‌ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ.. గ్లామర్ విషయంలో ఇద్దరూ కుమ్మేశారు. మిగతా నటీనటులు మామూలే!

సాంకేతిక ప్రతిభ :
మనికందన్ అందించిన సినిమాటోగ్రపీ కనులవిందుగా ఉంది. యాక్షన్ సన్నివేశాలను ముఖ్యంగా బల్గేరియాలో ఛేజింగ్‌ సన్నివేశాలను చిత్రీకరించిన విధానం బాగుంది. అనిరుధ్ పాటలు ఆల్రెడీ హిట్టయ్యాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ దుమ్ము దులిపేశాడు. పవన్‌ని ఎలివేట్ చేసే సీన్ల దగ్గర అతనిచ్చిన బీజీఎమ్ రొమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. ఎడిటింగ్ బాగానే ఉంది కానీ సెకండాఫ్‌లో కాస్త జాగ్రత్త వహించాల్సింది. ఆర్ట్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు అదిరిపోయాయి.. ఎక్కడా వంక పెట్టడానికి లేదు. ఇక త్రివిక్రమ్ విషయానికొస్తే.. ఈసారి ఆయన మార్క్ మిస్ అయ్యింది. క‌థ‌, క‌థ‌నాల‌పై మ‌రింత దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. దర్శకుడిగా తిరుగులేని ఇమేజ్ సాధించిన ఆయన నుంచి ఏదైతే ఆశిస్తామో అది లేకపోవడం వెలితిగా అనిపిస్తుంది. మిగతాదంతా ఓకే!

ప్లస్ పాయింట్స్ :
* పవన్ కళ్యాణ్ ‘వన్ మ్యాన్ షో’
* భారీ నిర్మాణ విలువలు
* ఇంటర్వెల్‌ బ్యాంగ్
* సెకండాఫ్‌లో కామెడీ సీన్స్
* పాటల పిక్చరైజేషన్

మైనస్ పాయింట్స్ :
* త్రివిక్రమ్ మార్క్ మిస్ అయ్యింది
* హీరోయిన్ల పాత్రల్లో బలం లేకపోవడం
* కొన్ని సాగదీత సన్నివేశాలు

చివరగా : ‘త్రివిక్రమ్’ అనే చింత చెట్టులో పులుపు తగ్గితే.. ‘పవన్’ అనే సముద్రంలో అలలు చెలరేగాయి
రేటింగ్ : 3.25/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.