అర్జున్ రెడ్డి మూవీ రివ్యూ, రేటింగ్ & అనాలసిస్

Arjun Reddy Movie Review

సినిమా: ‘అర్జున్‌ రెడ్డి’
నటీనటులు: విజయ్‌ దేవరకొండ, షాలిని పాండే, రాహుల్‌ రామకృష్ణ, సంజయ్‌ స్వరూప్‌, కమల్‌ కామరాజు
సంగీతం: రధన్‌
ఛాయాగ్రహణం: రాజు తోట
ఎడిటర్: శశాంక్‌
నిర్మాత: ప్రణయ్‌ రెడ్డి వంగా
దర్శకత్వం: సందీప్‌ రెడ్డి వంగా
విడుదల తేదీ: 25 ఆగస్టు 2017

పెళ్ళిచూపులు సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో స్టార్‌డమ్ సంపాదించుకున్న కుర్ర హీరో విజయ్‌ దేవరకొండ. ఇప్పుడు తాజాగా తన రఫ్ అండ్ టఫ్ లుక్‌తో పాటు ప్రెజెంట్ యూత్ ఎలా ఉంటారో తెలియజేస్తూ తీసిన తాజా చిత్రం అర్జున్ రెడ్డి. ఈ సినిమాపై మొదట్నుండీ మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఇటీవల ఈ సినిమాలోని ‘బూతు’ పాపులర్ కావడంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. దీనికి తోడు మనోడు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చూపించిన యాటిట్యూడ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. అర్జున్ రెడ్డి సినిమా విజయంపై విజయ్ దేవరకొండ చూపించిన కాన్ఫిడెన్స్ మరి ఫలించిందా లేదా అనే విషయం రివ్యూలో చూద్దాం.

కథ:
అర్జున్ రెడ్డి(విజయ్ దేవరకొండ) మెడికల్ కాలేజీలో స్టూడెంట్. తన ఈగో కారణంగా కాలేజీలో అతడికి అందరూ భయపడతుంటారు. ఇక అదే కాలేజీలో జూనియర్‌గా చేరిన ప్రీతి(షాలిని)ని ప్రేమిస్తాడు. వీరిద్దరి ప్రేమ చాలా దూరం వెళ్లిపోతుంది. ఇదే క్రమంలో విషయం తెలుసుకున్న ప్రీతి తండ్రి వారి ప్రేమకు నో చెబుతాడు. అయితే తన యాటిట్యూడ్‌ వల్ల ప్రీతిని వదులుకుంటాడు అర్జున్. ఆమెకు పెళ్లి అయిపోవడంతో మందు, డ్రగ్స్‌కు అలవాటు పడిపోతాడు. చివరకు అర్జున్ జీవితం ఎలా మలుపు తిరుగుతోంది? ప్రీతిని అతడు మర్చిపోతాడా లేదా అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

అనాలసిస్:
పెళ్లిచూపులు వంటి సాఫ్ట్ సినిమాతో హీరోగా అదరగొట్టిన విజయ్ దేవరకొండ ఈ సారి రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్‌లో వావ్ అనిపించేశాడు. ఈ క్యారెక్టర్‌లోని ఈగో ప్రెజెంట్ యూత్‌కు బాగా ఎక్కేయడంతో ఈ సినిమా చూసేందుకు జనాలు బారులు తీరారు. ఈ సినిమాలో ఒక స్టూడెంట్‌గా, ప్రేమలో విఫలమైన కుర్రాడిగా విజయ్ ఇరగదీశాడు. ముఖ్యంగా ఫస్ట్‌హాఫ్ మొత్తం అర్జున్ రెడ్డి మెరుపులు, సెన్సార్ చేసిన డైలాగులతో థియేటర్స్‌లో జనాలు విజిల్స్ వేస్తూ ఉన్నారు. ప్రస్తుత యూత్‌కి ప్రేమలో ఉన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్, ఎమోషన్స్ ఉంటాయో చిత్రంలో ఏమాత్రం దాచకుండా చూపించేశారు.

ఇక సెకండాఫ్‌లో ఫెయిల్యూర్‌గా మారిన అర్జున్ రెడ్డి ఎదుర్కొన్న పరిణామాలు అతడి జీవితాన్ని ఎలా మలుపు తిప్పాయో మనకు అద్భుతంగా చూపించాడు దర్శకుడు. ఈ సినిమాను ఒంటిచేత్తో లాక్కొచ్చాడు విజయ్ దేవరకొండ. ప్రీ-క్లైమాక్స్ సీన్స్ కొన్ని ఆడియెన్స్ సహనాన్ని పరీక్షించేందుకే పెట్టారా అనిపిస్తాయి. ఇక ఎవ్వరూ ఊహించని ట్విస్ట్‌తో క్లైమాక్స్ రావడంతో ఈ సినిమా మిగతా లవ్ స్టోరీల కంటే ఎందుకు స్పెషల్‌ అనేది తెలిస్తుంది. ఓవరాల్‌గా ఇప్పడున్న యూత్‌ను బేస్ చేసుకుని తీసిన అర్జున్ రెడ్డి కుర్రకారుకి పిచ్చపిచ్చగా ఎక్కేశాడు.

నటీనటుల పర్ఫార్మెన్స్:
అర్జున్ రెడ్డి పాత్రలో జీవించిన విజయ్ దేవరకొండ గురించి మనం ఎంత మాట్లాడిన తక్కువే అవుతుంది. ముఖ్యంగా బ్రేకప్‌స్టోరీకి కావాల్సిన అన్ని ఎమోషన్స్‌ను విజయ్ దేవరకొండ సినిమాలో అమోఘంగా చూపించాడు. కోపం, ఈగో వంటి యాటిట్యూడ్ చూపించిన అర్జున్ రెడ్డి ఇప్పటికే టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోవడంతో అంచనాలను ఏమాత్రం మిస్ కానివ్వకుండా చూసుకున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా మొత్తంలో మనకు విజయ్ దేవరకొండ మాత్రమే కనిపిస్తాడంటే అతడి డెడికేషన్ ఏ రేంజ్‌లో ఉందో అర్ధమవుతోంది. ఇక హీరోయిన్ షాలినికి ఇది ఫస్ట్ మూవీ అయినా అమ్మడు ఎక్కడా సిగ్గు పడకుండా పెదాలకు చాలా పని చెప్పింది. సినిమాలో లిప్‌లాక్‌లు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టడం కష్టమే. అందంతో పాటు అభినయంలోనూ షాలిని అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో మరో ముఖ్యమైన రోల్ రాహుల్ రామకృష్ణ(అర్జున్ రెడ్డి క్లోజ్ ఫ్రెండ్). కరీంనగర్ యాసలో అతడు చేసే కామెడీ థియేటర్స్‌లో నవ్వులు పూయించింది. మిగతా నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
ఈ సినిమా మొదలయినప్పటినుండీ కూడీ దర్శకుడు సంజయ్ రెడ్డి వంగ ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు. సెక్స్, డ్రగ్స్, బూతులు వంటి వివాదాలను తనకు అనుకూలంగా మార్చుకుని వాటితోనే సినిమాను నడిపించాడు. మొదటి సినిమాలోనే ఇలాంటి బోల్డ్ అటెంప్ట్స్‌తో టాలీవుడ్ జనాలకు అదిరిపోయే షాక్ ఇచ్చాడు. తాను ఎంచుకున్న సబ్జెక్ట్‌ను ఏమాత్రం మిస్ కాకుండా చూసుకోవడంలో డైరెక్టర్ పూర్తిగా సక్సెస్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి సన్నివేశాన్ని అందంగా చూపించారు. ఎడిటింగ్ పనితనం ఇంకాస్త బాగుండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. కొన్ని సీన్స్‌ చాలా రిచ్‌గా చూపించారు.

చివరిగా: ఈగో + యాటిట్యూడ్ = అర్జున్ రెడ్డి

Neticinema.com రేటింగ్ : 3/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.