నాని, ప్రశాంత్‌ల ‘అ!’ మూవీ రివ్యూ-రేటింగ్

సినిమా : అ!
నటీనటులు : కాజ‌ల్, నిత్యామీన‌న్, ఈషా రెబ్బ‌, రెజీనా, శ్రీ‌నివాస్‌ అవ‌స‌రాల‌, ముర‌ళీ శ‌ర్మ‌, ప్రియ‌ద‌ర్శి, దేవద‌ర్శిని, ప్ర‌గ‌తి, తదితరులు
రచన, దర్శకత్వం : ప‌్ర‌శాంత్ వ‌ర్మ‌
నిర్మాత : నాని, తిపిర్నేని ప్ర‌శాంతి
సంగీతం : మార్క్ కె.రాబిన్‌
ఛాయాగ్రహణం : కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని
ఎడిటింగ్ ‌: గౌత‌మ్ నెరుసు
బ్యానర్ ‌: వాల్ పోస్ట‌ర్ సినిమా
విడుదల తేదీ : 16-02-2018

‘అ!’.. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నానని చెప్పినప్పటికీ జనాల్లో దానిపై ఆసక్తి కలిగింది. ఇక క్యారెక్టర్లకు సంబంధించి విభిన్నమైన పోస్టర్స్, అలాగే ఆసక్తికరమైన ప్రోమోలు విడుదల చేయడంతో ఈ చిత్రంపై మరింత క్యూరియాసిటీ పెరిగింది. ‘‘అన్ని సినిమాల‌ యందు ‘అ!’ సినిమా వేర‌యా’’ అంటూ తెలుగులో ఇలాంటి సినిమా రాలేదని యూనిట్ ప్రచారం చేస్తూ వస్తుండడంతో ‘అ!’పై మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి.. వాటిని అందుకోవడంలో ఈ మూవీ సక్సెస్ అయ్యిందా? లేదా? రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం పదండి…

కథ :
విభిన్న నేపథ్యాలు కలిగిన వ్యక్తులందరూ ఒక రెస్టారెంట్‌లో కలుసుకుంటారు. తమ సమస్యలతో సతమతమవుతున్న వాళ్ళంతా.. ఎలా పరిష్కరించుకోవాలి అని అనుకుంటున్న తరుణంలో వాళ్ళందరి జీవితాలు కీలక మలుపు తిరుగుతాయి. ఇంతకీ ఆ మలుపు ఏంటి? అసలు వాళ్ళంతా ఎవరు? ఎందుకు అందరూ ఒకే రెస్టారెంట్‌కి వచ్చారు? వీళ్ళందరికి ఒకరికొకరితో సంబంధం ఉందా? చివరికి వీళ్ల జీవితాలకు ముగింపేంటి? అన్నదే ఈ మూవీ కథ.

విశ్లేషణ :
మొదటినుంచి ‘అ!’ చిత్రం చాలా భిన్నమైంది, ఇంతవరకు ఎప్పుడూ తెలుగులో రాలేదని యూనిట్ ప్రచారం చేయడం చూసి.. రిలీజ్‌కి ముందు ఎవ్వడైనా ఇలాగే సొంత డబ్బా కొట్టుకుంటాడని అంతా భావించారు. తీరా సినిమా చూస్తే.. అందరి ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. అవును.. టైటిల్‌కి తగినట్లే ఈ చిత్రం ‘అ!’ అనిపించేలా అద్భుతంగా ఉంది. కొత్త దర్శకుడు ప్రశాంత్ వర్మ నిజంగానే సరికొత్త స్టోరీతో వెండితెరపై అపురూప కళాఖండాన్ని చెక్కాడు. మొదటినుంచి చివరి వరకు ఎక్కడా గాడి తప్పకుండా.. సీన్‌ టు సీన్ ఆసక్తి రేకెత్తిస్తూ.. చివర్లో సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తాడీ దర్శకుడు.

మొదటి అర్థభాగం పాత్రల పరిచయంతోనే సాగిపోతుంది. కానీ.. ఆ పాత్రల పరిచయాల్ని కూడా దర్శకుడు ఎంతో ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు. ఒక్కొక్క క్యారెక్టర్‌కి ఒక్కొక్క ప్రత్యేకత జోడించి.. దానికంటూ ప్రాధాన్యతనిచ్చాడు. ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా థ్రిల్లింగ్‌గా సాగుతుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై మరింత ఆసక్తి పెంచుతుంది. సెకండాఫ్‌లోకి వచ్చేసరికి.. ప్రేమ, కొన్ని సోషల్ ఎలిమెంట్స్, హర్రర్ వంటి జానర్లను మిక్స్ చేసి కాస్త స్లోగా నడిపాడు దర్శకుడు. కానీ.. ప్రీ-క్లైమాక్స్ నుంచి కథ మరో స్థాయికి చేరుకుంటుంది. ఇక క్లైమాక్స్ అయితే మైండ్‌బ్లోయింగ్. ఎవ్వరూ ఊహించని రీతిలో దర్శకుడు ఈ చిత్రానికి ముగింపునిచ్చాడు.

చాలా సీరియస్‌గా అనిపించే ఈ కథలో అక్కడక్కడ వినోదం కూడా పంచాడు. నాని, రవితేజ వాయిస్‌లతో నడిచే చేప, చెట్టు పాత్రలే ఇందులో నవ్వులు పూయించాయి. వీళ్ల మాటలు వినిపిస్తున్నంతసేపూ ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు. అంతేకాదండోయ్.. వాటి ద్వారా ప్రకృతి, జంతువుల గురించి మంచి సందేశం కూడా ఇచ్చారు. సోషల్ మెసేజ్ కూడా ఇచ్చారు. లైంగిక వేధింపుల, స్వలింగ సంపర్కుల మానసిక స్థితి, అహం చూపించడం వల్ల కలిగే నష్టాల గురించి.. ఇలా పలు అంశాలపై చర్చిస్తూ మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశాడు ప్రశాంత్.

అంతా ఓకే గానీ.. ఈ చిత్రం అన్నివర్గాల వారికి ఏమాత్రం రుచించదు. కొత్తదనం కోరుకునే వాళ్ళకి మాత్రమే ఆకట్టుకుంటుంది. సినిమా చూస్తున్నంతసేపూ మెదడకు పని చెప్తూ వుండాలి. కాస్త సేద తీరితే.. చివర్లో క్లైమాక్స్ అర్థంపర్థం కాకుండా పోతుంది. ఓవరాల్‌గా మాత్రం.. ఈ చిత్రం ఆశ్చర్యంతో కూడిన ప్రత్యేక అనుభూతి కలిగించడం ఖాయం.

నటీనటుల ప్రతిభ :
ఈ చిత్రానికే ప్రధానమైన పాత్రలో నటించిన కాజల్ అగర్వాల్ జస్ట్ ఓకే అనిపించింది. మ‌గాడి లక్షణాలున్న అమ్మాయిగా నిత్యామీనన్ అదరగొట్టేసింది. అమ్మాయిగా ఈషా, డ్రగ్స్‌కి అలవాటుపడ్డ యువతిగా రెజీనా, అహంకారం ఉన్న మెజీషియ‌న్‌గా ముర‌ళీ శ‌ర్మ చాలా చ‌క్క‌గా న‌టించారు. వంటరాని వంటవాడి పాత్రలో ప్రియదర్శి మెప్పించాడు. సైంటిస్ట్ అవ్వాల‌నే వ్య‌క్తిగా శ్రీనివాస్ అవ‌స‌రాల‌, వీల్ ఛైర్‌లో ఉండిపోయినా దివ్యద‌ర్శిని కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఓవరాల్‌గా.. ప్రతిఒక్కరూ తమ పాత్రల్లో ఒదిగిపోయి, ప్రేక్షకుల్ని కట్టిపడేశారు.

టెక్నీషియన్స్ ప్రతిభ :
కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ, మార్క్ ఎ.రాబిన్ అందించిన నేపథ్య సంగీతం.. రెండూ ఈ చిత్రానికి చాలా బాగా కుదిరాయి. ఆర్ట్ వర్క్, ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల్లో ఎక్కడా వంక పెట్టడానికి లేదు. నాని-ప్రశాంతి ఇద్దరూ రాజీ పడకుండా బాగానే ఖర్చుపెట్టారు. ఇక దర్శకుడు ప్రశాంత్ విషయానికొస్తే.. తొలి చిత్రంతోనే తన ట్యాలెంట్ చాటుకున్నాడు. కొత్త కథతో చాలా డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేసి.. ప్రేక్షకుల్ని నిజంగానే ‘అ!’ అనిపించాడు.

చివరగా : ప్రేక్షకుల్ని నిజంగానే ‘అ!’శ్చర్యంలో ముంచెత్తే ప్రత్యేక చిత్రం.
రేటింగ్ : 3.5/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.