‘భరత్ అనే నేను’ మూవీ రివ్యూ-రేటింగ్

సినిమా : భరత్ అనే నేను
నటీనటులు : మహేష్ బాబు, కైరా అద్వానీ, ప్రకాష్ రాజ్, రావు రమేష్, తదితరులు
రచన-దర్శకత్వం : కొరటాల శివ
నిర్మాత : డివివి దానయ్య
సినిమాటోగ్రఫీ : రవి కె.చందర్, తిరు
ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్
సంగీతం : దేవిశ్రీప్రసాద్
బ్యానర్ : డివివి ఎంటర్టైన్‌మెంట్
విడుదల తేదీ : 20-04-2018

మహేష్, కొరటాల కాంబినేషన్‌లో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘భరత్ అనే నేను’. కైరా అద్వానీ కథానాయికగా నటించిన ఈ మూవీపై ముందునుంచే భారీ అంచనాలున్నాయి. ‘శ్రీమంతుడు’లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మళ్ళీ మహేష్, కొరటాల జతకట్టడం.. రాజకీయ నేపథ్యంలో మూవీ రూపొందడం.. ప్రోమోలన్నీ ఆసక్తి రేకెత్తించడంతో ‘భరత్ అనే నేను’పై విపరీతమైన క్రేజ్ నెలకొంది. మరి.. వాటిని ఈ చిత్రం అందుకుందా? మళ్ళీ మహేష్, కొరటాల కాంబో ‘శ్రీమంతుడు’ మ్యాజిక్‌ని రిపీట్ చేసిందా? ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగిందా? రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం పదండి…

కథ :
భరత్‌రామ్‌(మహేష్‌బాబు) లండన్‌ కేంబ్రిడ్జ్‌లో చదువుతుంటాడు. అతని తండ్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (శరత్ కుమార్) హఠాన్మరణం చెందడంతో.. భరత్ లండన్ నుంచి ఇంటికి వస్తాడు. అప్పుడు పార్టీ వాళ్ళంతా కలిసి భరత్‌ని అతని తండ్రి స్థానంలో ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక భరత్‌కి ఎన్నో అవాంతరాలు ఎదురవుతాయి. అతడ్ని సీఎం గద్దె నుంచి కిందకు దింపేందుకు రాజకీయ కుట్రలు కూడా జరుగుతాయి. వాటిని భరత్ ఎలా ఎదుర్కొన్నాడు? అసలు వసుమతి (కైరా అద్వానీ) ఎవరు? ఆమె భరత్ లైఫ్‌లోకి ఎందుకొస్తుంది? చివరకు భరత్‌ తన గమ్యాన్ని ఎలా చేరుకున్నాడు? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా సాగుతుంది.

విశ్లేషణ :
ప్రేక్షకుల నాడిని బాగా పసిగట్టిన దర్శకుడిగా కొరటాల శివ ఆల్రెడీ తన తొలి మూడు చిత్రాలతో నిరూపించుకున్నాడు. ఇప్పుడు ‘భరత్ అనే నేను’ చిత్రంతోనూ మరోసారి తన స్టామినా చాటిచెప్పాడు. కమర్షియల్ ఎలిమెంట్స్‌కి ఒక మంచి మెసేజ్ జోడించి.. ఆడియెన్స్‌కి కావాల్సిన విందు భోజనాన్ని పుష్కలంగా వడ్డించాడు. ఎక్కడా బోర్ కొట్టించకుండా.. మొదట్నుంచి చివరకు వరకు చాలా ఆసక్తికరంగా సినిమాని నడిపించి.. ప్రేక్షకుల నుంచి పాస్ మార్కులు వేయించుకున్నాడు.

ఫస్టాఫ్ గురించి మాట్లాడుకుంటే.. తొలి 10 నిముషాలు మహేష్ ఇంట్రొడక్షన్ సీన్స్‌తో సాధారణంగా సాగుతుంది. ఇక ఎప్పుడైతే హీరో సీఎంగా ఛార్జ్ తీసుకుంటాడో.. అప్పట్నుంచి సినిమా వేగంగా పుంజుకుంటుంది. సీఎం అయ్యాక ఎలా నడుచుకోవాలో నేర్చుకున్నాక భరత్ తీసుకునే నిర్ణయాలు.. ఆ తర్వాత జరిగే పరిణామాలు.. వంటి సీన్లతో ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. సీఎంగా అతను తీసుకునే నిర్ణయాలు షాకింగ్‌గా అనిపిస్తాయి. భరత్‌ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. ప్రీ-ఇంటర్వెల్ సీన్‌లో హీరో ఎలివేషన్ సీన్ హైలైట్. అక్కడ ఆడియెన్స్‌కి గూస్‌బంప్స్ రావడం పక్కా. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా అదిరింది. హీరోయిన్ కైరా అద్వానీతో నడిచే రొమాంటిక్ ట్రాక్ కూడా బాగుంది. ‘ఐ డోంట్ నో’, ‘భరత్ అనే నేను’ సాంగ్స్ సందర్భానుకూలంగా కుదిరాయి.

ఇక సెకండాఫ్ విషయానికొస్తే.. ఫస్టాఫ్ కంటే అదిరిపోయింది. మాస్ ఎలిమెంట్స్‌తో రొమాలు నిక్కబొడుచుకునేలా నడిపించాడు కొరటాల. పాటలను, పోరాట దృశ్యాల్ని, మాస్‌ ఎలిమెంట్స్‌ని రాజకీయాల్ని, చక్కగా బ్యాలెన్స్‌ చేస్తూ ద్వితీయార్ధం సాగిపోతుంది. రాయలసీమ దుర్గమహల్ ఫైట్ సీక్వెన్స్ కేక. మాస్ ఆడియెన్స్‌కి కావాల్సిన డోస్‌తో బాగా పండించాడు కొరటాల. ‘వచ్చాడయ్యో సామీ’ పిక్చరైజేషన్ చాలా బాగుంది. ఎడ్యుకేషన్ సమస్యని బాగా హైలైట్ చేశారు. ప్రీ-క్లైమాక్స్‌లో ప్రెస్‌మీట్ సీన్ కూడా సూపర్బ్. ఆ ఎపిసోడ్ మొత్తం క్లాప్స్‌ కొట్టిస్తుంది. అయితే.. సీఎంగా భరత్ రిజైన్ చేసి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయడం మరీ నాటకీయంగా అనిపిస్తుంది. దీన్ని మరింత డ్రాగ్ చేయకుండా సింపుల్ క్లైమాక్స్‌తో సినిమాని ముగించాడు దర్శకుడు.

ఓవరాల్‌గా చూసుకుంటే.. అక్కడక్కడ కొన్ని లాజిక్స్ మిస్ అయినా, కొన్ని సీన్లు పెద్దగా కిక్ ఇవ్వకపోయినా.. గ్రాఫ్ తగ్గకుండా ఎంటర్టైన్ చేసింది. ఇలాంటి సీఎం మన రియల్ లైఫ్‌లోనూ ఉంటే ఎంతో బాగుంటుందో కదా! అనే ఫీలింగ్‌తో థియేటర్ల నుంచి ప్రేక్షకులు బయటికొస్తారు.

నటీనటుల ప్రతిభ :
సీఎంగా మహేష్ బాబు ఇరగదీశాడు. తన ఇంటెన్స్ నటనతో కట్టిపడేశాడు. అతని కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్‌లలో ఇదో మైల్‌స్టోన్‌‌గా నిలిచిపోతుంది. స్టైలింగ్‌, లుక్స్‌ అన్ని ఆకట్టుకుంటాయి. సంభాషణలు పలికే విధానంలో మహేష్‌ కొత్తగా అనిపిస్తాడు. అక్కడక్కడా తన తండ్రి ‘సూపర్‌స్టార్‌’ కృష్ణని గుర్తుకు తెస్తాడు. ఎమోషనల్‌ సన్నివేశాలు, ఎంటర్‌టైన్‌మెంట్‌ పంచేటప్పుడు మరోసారి తనదైన మార్కు వేసి చెలరేగిపోయాడు. మహేష్‌ పక్కన హీరోయిన్‌గా నటించిన కైరా అద్వానీ చాలా అందంగా కనిపించడంతోపాటు అభినయంతోనూ అలరించింది. బ్రహ్మాజీ ఉన్నది కాసేపైనా నవ్వులు పండించాడు. ప్రకాష్‌రాజ్‌ మరోసారి తనకు అలవాటైన పాత్రలో అల్లుకుపోయాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం అందించారు.

టెక్నికల్ ప్రతిభ :
రవి కె.చంద్రన్‌, తిరుల కెమెరా పనితనానికి హ్యాట్సాఫ్ చెప్పుకోవచ్చు. తమ ప్రతిభతో వీళ్ళిద్దరూ ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్ళారు. దేవిశ్రీప్రసాద్ పాటలు ఆల్రెడీ సూపర్‌హిట్ అయ్యాయి. వాటిని పిక్చరైజ్ చేసిన విధానం కూడా బాగుంది. ఇక నేపథ్య సంగీతాన్ని దేవిశ్రీ ఇరగదీశాడు. ముఖ్యంగా ఎలివేషన్ సీన్ల దగ్గర కుమ్మేశారు. శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌, సెల్వరాజన్‌ ఆర్ట్‌ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయి. దానయ్య డివివి నిర్మాణ విలువలు చాలా ల్యావిష్‌గా వున్నాయి. ఇక కొరటాల శివ మరోసారి తన సత్తా చాటాడు. కథకుడిగా, దర్శకుడిగా ఫుల్ మార్కులు కొట్టేశాడు. ఎప్పట్లాగే ఒక మంచి పాయింట్‌ను కమర్షియల్‌ హంగులు జోడించి.. మళ్ళీ విజయవంతమయ్యాడు.

చివరగా : ప్రామిస్.. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది
రేటింగ్ : 3.75/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.