నితిన్, మేఘ ఆకాష్‌ల ‘ఛల్‌ మోహన్‌ రంగ’ మూవీ రివ్యూ-రేటింగ్

సినిమా : ఛల్‌ మోహన్‌ రంగ
నటీనటులు : నితిన్‌, మేఘా ఆకాశ్‌, రావు రమేశ్‌, తదితరులు
రచన, దర్శకత్వం : కృష్ణ చైతన్య
నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, పవన్‌ కల్యాణ్‌
సంగీతం: ఎస్‌.ఎస్‌ తమన్‌
నిర్మాణ సంస్థలు: శ్రేష్ఠ్‌ మూవీస్‌, పీకే క్రియేటివ్‌ వర్క్స్‌
విడుదల తేదీ : 05-04-2018

నిర్మాత సుధాకర్ రెడ్డితో కలిసి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ సంయుక్తంగా ‘ఛల్ మోహన్ రంగ’ని నిర్మించడంతోనే ఈ మూవీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. పైగా.. నితిన్‌కి ఇది ల్యాండ్ మార్క్ 25వ చిత్రం కావడం మరో ప్లస్ పాయింట్. ఇక విడుదలైన ప్రోమోలు మాంచి కామెడి పండించడంతో.. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుందనే అంచనాలు అందరిలో నెలకొన్నాయి. మరి.. వాటిని అందుకోవడంలో ఈ మూవీ సక్సెస్ అయ్యిందా? లేదా? రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం…

కథ :
మోహన్ రంగ (నితిన్)కి చిన్నప్పటినుంచే అమెరికాలో ఉద్యోగం చేయాలని కోరిక వుంటుంది. దాన్ని సాకారం చేసుకోవడం మనోడు విశ్వప్రయత్నాలు చేసినా.. మూడుసార్లు వీసా రిజెక్ట్ అవుతుంది. ఇలాంటి టైంలో మోహన్ రంగకి టెంపరరీ వీసాపై అమెరికా వెళ్ళే అవకాశం దొరుకుతుంది. ఒక రోడ్ జర్నీలో భాగంగా అక్కడ రంగకి మేఘ (మేఘ ఆఖాష్) పరిచయం అవుతుంది. రానురాను అది ప్రేమగా మారుతుంది.

కానీ.. సరిగ్గా ప్రపోజ్ చేసుకునే టైంలో ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత మేఘ ఫ్యామిలీ ఊటీకి షిఫ్ట్ అయిపోతుంది. అక్కడ ఆమెకి మరో అబ్బాయితో పెళ్ళి ఫిక్స్ అవుతుంది. అసలు మేఘ, రంగ ఎందుకు విడిపోయారు? మరో అబ్బాయితో పెళ్ళి చేసుకోవడానికి రెడీ అయిన మేఘని రంగ ఎలా దక్కించుకున్నాడు? చివర్లో ఈ ఇద్దరూ మళ్ళీ ఒక్కటవుతారా? లేదా? అనే అంశాలతోనే ఈ సినిమా సాగుతుంది.

విశ్లేషణ :
త్రివిక్రమ్ రాసిన ఈ సినిమా కథ కొత్తదేమీ కాదు. ఈ తరహా కథతో ఇప్పటికే ఎన్నో సినిమాలొచ్చాయి. అనుకోకుండా హీరో-హీరోయిన్లు కలుసుకోవడం.. ఓ కారణం వల్ల విడిపోవడం.. చివర్లో మళ్ళీ కలుసుకోవడం.. అనే అంశాల చుట్టే ఈ చిత్రం సాగుతుంది. కాకపోతే.. దర్శకుడు కృష్ణ చైతన్య ఈ కథలో ‘కామెడీ’ని బాగా మిక్స్ చేశాడు. ఫ్లాట్ నరేషన్‌తోనే కథని నడిపించినా.. సరదా సన్నివేశాలతో ఎంటర్టైన్ చేయగలిగాడు. అంతేకాదు.. ఈ కథలో త్రివిక్రమ్ తన మార్క్ ట్రాక్స్‌తోనూ అలరించాడు. కామెడీ, పంచ్ డైలాగులతో మెప్పించగలిగాడు.

ఫస్టాఫ్ విషయానికొస్తే.. కథేమీ లేకపోయినా సరదా సీన్లతో దర్శకుడు నడిపించాడు. అమెరికాకి వెళ్ళేందుకు అతడు పడే పాట్లు.. టెంపరరీ వీసాతో అక్కడికెళ్లిన హీరో ‘హెచ్‌1బీ’ వీసా కోసం చేసే ప్రయత్నాలు.. రంగ, మేఘ మధ్య నడిచే జర్నీ.. తదితర ట్రాక్స్‌తో ఎంటర్టైనింగ్‌గా కొనసాగించాడు. ఈ సీన్లు ప్రేక్షకుల్ని పూర్తిగా సంతృప్తి పరుస్తాయి. ఎక్కడా పెద్దగా ట్విస్టులు లేకపోయినా.. వినోదంతోనే ఫస్టాఫ్ టైమ్‌పాస్ అయిపోతుంది. కానీ.. సెకండాఫ్ మాత్రం కొంచెం నెమ్మదిగా సాగుతుంది. మేఘని వెతుక్కుంటూ రంగ వెళ్ళే ట్రాక్ బోర్ కొట్టించేస్తుంది. కానీ.. హీరో ఊటిలో ల్యాండ్ అయ్యాక సినిమా మళ్ళీ వేగం పుంజుకుంటుంది. అక్కడ దర్శకుడు మళ్లీ కడుపుబ్బా నవ్వించే కామెడీ ట్రాక్‌తో ప్రేక్షకుల్ని పడేశాడు.

ఏమాత్రం బోర్ కొట్టకుండా ఫుల్ కామెడీ డోస్‌తో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తూ మూవీ సాగిపోతుంది. ఒక పార్టీ ఎపిసోడ్ అయితే.. మూవీకే హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ఇక క్లైమాక్స్ విషయానికొస్తే.. ఇది పరమ రొటీన్ అయినప్పటికీ ఈ కథకి తగ్గట్టు అనిపిస్తుంది. దర్శకుడు సరైన ముగింపే ఇచ్చాడనిపిస్తుంది. ఓవరాల్‌గా ఈ చిత్రం ఫుల్ వినోదం పంచింది కానీ.. కథ రొటీన్ కావడమే పెద్ద మైనస్. ఎక్కడా ట్విస్టులు కూడా వుండవు. వాటిని పక్కనపెడితే.. వినోదం కోసం ఈ మూవీని చూడొచ్చు.

నటీనటుల ప్రతిభ :
ఈసారి నితిన్ కామెడీ ఓరియెంటెడ్ రోల్‌లో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. మోహన్ రంగ పాత్రలో బాగా ఒదిగిపోయి.. తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అంతేకాదు.. అతని కామిక్ టైమింగ్ కూడా అదిరింది. ఇక స్టెప్పులు కూడా ఇరగదీశాడు. మేఘా ఆకాష్ అందంగా కనిపించడంతోపాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. రావు రమేశ్‌, నరేశ్‌, మధునందన్‌, నర్రా శ్రీనివాస్‌కు కీలక పాత్రలు దక్కాయి. చాలా కాలం తర్వాత తెరపై కనిపించిన నటి లిజి కూడా బాగానే నటించింది.

టెక్నికల్ పెర్ఫార్మెన్స్ :
నట్టి సినిమాటోగ్రఫీ ఈ మూవీకి మేజర్ ఎసెట్‌గా చెప్పుకోవచ్చు. ప్రతి లొకేషన్‌ని చాలా అందంగా చూపించాడు. అతని కెమెరా పనితనానికి మెచ్చుకోవాల్సిందే! ఎస్ఎస్ తమన్ అందించిన సంగీతం ఆల్రెడీ సూపర్ హిట్ అయ్యింది. విజువల్‌గానూ బాగానే ప్రెజెంట్ చేశాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లోనూ తమ మార్క్ చూపించాడు. పీకే క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ట్ మూవీస్ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌కి వంక పెట్టడానికి లేదు. దర్శకుడు కృష్ణ చైతన్య తన తొలి చిత్రం ‘రౌడీ ఫెలో’లాగా తన మార్క్ చూపించలేకపోయాడు కానీ.. వినోదంతో తన రైటింగ్ ప్రతిభ చాటుకున్నాడు.

చివరగా : ‘ఛల్’ అంటూ వినోదం పంచిన ‘మోహన్ రంగ’
రేటింగ్ : 2.75/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.