నాగశౌర్మ, రష్మికల ‘ఛలో’ మూవీ రివ్యూ-రేటింగ్

Chalo movie review rating

సినిమా : ఛలో
నటీనటులు : నాగశౌర్య, రష్మిక మందాన, నరేష్‌, వెన్నెల కిషోర్‌, పోసాని కృష్ణమురళి, తదితరులు
దర్శకత్వం : వెంకీ కుడుముల
నిర్మాత : ఉషా ముల్పూరి
సంగీతం : మహతి స్వర సాగర్‌
సినిమాటోగ్రఫీ : సాయి శ్రీరామ్‌
ఎడిటర్‌ : కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు
బ్యానర్‌ : ఐరా క్రియేషన్స్‌
రిలీజ్ డేట్ : 02-02-2018

కొంతకాలం నుంచి సరైన హిట్ లేక సతమతమవుతున్న లవర్‌బాయ్ నాగశౌర్య లేటెస్ట్‌గా నటించిన చిత్రం ‘ఛలో’. వెంకీ కుడుముల దర్శకత్వంలో హీరో తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మించిన ఈ చిత్రం మొదటినుంచి అంచనాలు పెంచుకుంటూ వస్తోంది. ప్రోమోలు, ఆడియో సాంగ్స్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ఇక రిలీజ్‌కి ముందు భారీ ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టి.. జనాల్లో ఈ చిత్రంపై ఆసక్తి రేకెత్తించారు. మరి.. ఈ చిత్రం ఆడియెన్స్‌ని మెప్పించగలిగిందా? నాగశౌర్యకి మంచి ఫలితాన్నే తెచ్చిపెట్టిందా? రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం పదండి..

కథ :
హరి(నాగశౌర్య)కి చిన్నప్పటి నుంచి గొడవలంటే ఎంతో ఇష్టం. ఎవరినైనా కొట్టాలన్నా లేదా కొట్టించుకోవాలన్నా ఇతనికి మహా సరదా! అయితే.. ఇదే అతని ఫ్యామిలీకి తెగ ఇబ్బందులు తెచ్చిపెడుతుంటుంది. చివరికి హరి తండ్రి (నరేష్) అతని పోరు భరించలేక.. తిరుప్పురం అనే ఊరుకి పంపించేస్తాడు. ఆ ప్రాంతం సరిగ్గా ఆంధ్రా, తమిళనాడు బోర్డర్‌లో ఉంటుంది. అటువైపున్న తమిళులకు, ఇటువైపున్న తెలుగువాళ్ళకి ఏమాత్రం పడదు. ఆ రెండు వర్గాల మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే వుంటాయి. హరి అదే ఊరి కళాశాలలో చేరుతాడు.

ట్విస్ట్ ఏంటంటే.. హరిని తమిళబ్బాయి అనుకుని, తమిళ బ్యాచ్ అతడ్ని తమ టీమ్‌లోకి చేర్చుకుంటుంది. అక్కడే అతను కార్తీక(రష్మిక)ను చూసి ఇష్టపడతాడు. అయితే.. కార్తీక మాత్రం ఒక తమిళ అమ్మాయి. గ్రామాల మధ్య వున్న తమిళ, తెలుగు పోరు తమ ప్రేమను అడ్డుగా వుంటుందని భావించి.. ఏకంగా ఆ రెండు ఊళ్లనే కలపాలని హరి ఫిక్స్ అవుతాడు. మరి.. హరి ఆ ప్రయత్నంలో విజయం సాధించగలుగుతాడా? అసలు ఆ రెండు ఊళ్ల మధ్య వున్న పగ ఏంటి? ఎందుకు నిత్యం గొడవు పడుతుంటాయి? చివరికి హరి తన ప్రేమని దక్కించుకుంటాడా? అనే అంశాల చుట్టే ఈ సినిమా కథ సాగుతుంది.

విశ్లేషణ :
రెండు ఊళ్లని కలిపి, తన ప్రేమను హీరో గెలిపించుకోవడమే ఈ సినిమా కథ. ఇక్కడే ఇది చాలా రొటీన్ స్టోరీ అని అర్థమైపోతుంది. కానీ.. దాన్ని వెండితెరపై దర్శకుడు వెంకీ కుడుముల తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. రెండు ఊళ్ల పగ మధ్య కామెడీ, ప్రేమ అనే ఎలిమెంట్స్ సరిగ్గా జోడించి.. ప్రేక్షకులకు వినోదం పండించడంలో సక్సెస్ అయ్యాడు. కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ అయినప్పటికీ.. కథలో భాగంగా అవి మైనస్‌గా అనిపించవు. అక్కడక్కడ కాస్త విసిగించే సన్నివేశాలున్నప్పటికీ.. ఓవరాల్‌గా మాత్ర ఈ చిత్రం సరికొత్త అనుభూతిని మిగిలిస్తుంది.

స్టోరీలైన్ చాలా చిన్నది కాబట్టి.. దర్శకుడు ఫస్టాఫ్ మొత్తాన్ని కామెడీ, లవ్ స్టోరీలతో సరదాగా నడిపించాడు. ఎక్కడా బోర్ కొట్టించకుండా నవ్వులు పూయించాడు. రఘుబాబు, సత్యల మధ్య వచ్చే కామెడీ ట్రాక్ భలే నవ్వించింది. కళాశాలలో వచ్చే కామెడీ ఎపిసోడ్స్ అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. సందర్భానుకూలంగా వచ్చే పాటలు కూడా బాగున్నాయి. ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ నుంచి అసలు కథ మొదలవుతుంది. ఆ రెండు ఊళ్లను హీరో కలపడం నేపథ్యం చుట్టే కథ సాగుతుంది. ఇక్కడ దర్శకుడు చేసిన ప్లస్ పాయింట్ ఏంటంటే.. కథని మరీ సీరియస్‌గా నడపకుండా వెన్నెల కిషోర్‌తో వినోదం పండించాడు. స్టోరీని ఏమాత్రం పక్కదారి పట్టించుకుండా ఒకవైపు హీరో లక్ష్యం, మరోవైపు కామెడీ ట్రాక్స్‌ని సరిగ్గా హ్యాండిల్ చేశాడు. వెన్నెల కిషోర్ పాత్ర చుట్టూ నడిచే ఎపిసోడ్స్ అన్ని చాలా గమ్మత్తుగా, ఫన్నీగా వుంటాయి.

ఇక్కడ వరకు బాగానే వుంది కానీ.. పతాక సన్నివేశాలే బలహీనంగా తయారయ్యాయి. సీరియస్‌గా, బలంగా పండాల్సిన ఎపిసోడ్స్‌ని కాస్త సిల్లీగా తీర్చిదిద్దడంతో కన్వీన్స్‌గా అనిపించదు. కాకపోతే దాన్ని కూడా కామెడీగా తీసుకుంటే మాత్రం.. పాస్ మార్కులు వేయొచ్చు. మేజర్ మైనస్ ఏంటంటే.. విలనిజం పెద్దగా పండకపోవడమే! ఫైనల్‌గా.. అక్కడక్కడ వున్న కొన్ని మైనస్ పాయింట్స్‌ని నెగ్లెట్ చేస్తే, ఆద్యంతం ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేయొచ్చు.

నటీనటుల ప్రతిభ :
నాగశౌర్య తన పాత్రని చాలా ఈజీగా చేశాడు. పెద్దగా కష్టపడకుండా చాలా జోవియల్‌గా నటించాడు. అతని నటించిన తీరు ఆడియెన్స్‌ని బాగా మెప్పిస్తుంది. హీరోయిన్ రష్మిక తన పాత్రలో పూర్తిగా ఇమిడిపోయింది. చక్కని హావభావాలతో ఆకట్టుకుంది. సత్య, వెన్నెల కిషోర్‌లు బాగా నవ్వించారు. మిగతా నటీనటులు తమతమ పాత్ర పరిధి బాగానే నటించారు.

సాంకేతిక ప్రతిభ :
సాయి శ్రీరామ్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాని చాలా అందంగా వెండితెరపై చూపించాడు. మహతి స్వరసాగర్ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సందర్భానుకూలంగా పాటల్ని ఇమిడ్చారు. నేపథ్య సంగీతం కూడా అదిరింది. కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజుల ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు అదిరిపోయాయి. దర్శకుడు వెంకీ కుడుముల రాసుకున్న స్టోరీ రొటీన్, చిన్నదే అయినా.. దాన్ని చాలా బాగా తీర్చిదిద్దాడు. ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. తొలి చిత్రమే అయినా ఎక్కడా తడబడకుండా దర్శకుడిగా తన ప్రతిభ చాటాడు.

చివరగా : ‘ఛలో’కి పరుగులు తీయాల్సిందే!
రేటింగ్ : 3.25/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.