అమెజాన్‌కి కేక పుట్టించిన Mr.166

Delhi man duped Amazon 166 times

అమెజాన్.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థల్లో ఇది ఒకటి. ముఖ్యంగా.. ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో తిరుగులేని రారాజుగా ఇది గొప్ప పేరు సంపాదించింది. అలాంటి ఈ సంస్థ.. ఒక వ్యక్తి చేతిలో దారుణంగా మోసపోయింది. ఎన్నో భద్రతాచర్యలు పాటిస్తున్నప్పటికీ.. ఆ మోసగాడి పనుల్ని పసిగట్టలేక ఏకంగా 166 సార్లు మోసపోయి.. ఏకంగా రూ.52 లక్షలు నష్టపోయింది. చివరికి జరుగుతున్న మోసాన్ని పసిగట్టిన ఈ సంస్థ.. ఎట్టకేలకు ఆ వ్యక్తికి పట్టుకోగలిగింది. పదండి.. మొత్తం వివరాలేంటో మేటర్‌లోకి వెళ్లి తెలుసుకుందాం.

ఆన్‌లైన్ స్టోర్ల నుంచి ఏదైన వస్తువు ఆర్డర్ చేసినప్పుడు ఒక్కోసారి ఇంటికి ఖాళీ బాక్సులు వస్తుంటాయి. అప్పుడు తమకందాల్సిన వస్తువు రాలేదంటూ ఫిర్యాదులు చేయడం జరుగుతుంది. అలా కంప్లయింట్స్ వచ్చినప్పుడు ఆ సంస్థ స్పందించి.. ఫిర్యాదుదారుడికి తిరిగి ఆర్డర్ చేసిన వస్తువు పంపించడమో లేదా డబ్బులు వెనక్కి ఇవ్వడమో చేస్తాయి. దీన్ని ఆసరాగా చేసుకుని.. న్యూఢిల్లీకి చెందిన శివం చోప్రా అమెజాన్‌ని ఏకంగా 166 సార్లు బురిడీ కొట్టించాడు. ఆర్డ‌ర్ చేసిన ఫోన్ రాలేదని అబ‌ద్ధాలు చెప్పి ఏకంగా రూ.52 ల‌క్ష‌లు సంపాదించాడు.

మొదటగా ఈ ఏడాది మార్చిలో అమెజాన్ నుంచి రెండు ఫోన్ల‌కు ఆర్డ‌ర్ ఇచ్చాడు. అతనికి సరిగ్గానే ఫోన్లు అందించినప్పటికీ.. ఖాళీ బాక్సులు వ‌చ్చాయంటూ ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ సంస్థ డ‌బ్బుల‌ను వెన‌క్కి తిరిగి ఇచ్చేసింది. ఇక తన దగ్గరున్న ఆ రెండు ఫోన్లను అమ్మి.. డబ్బులు పోగేసుకున్నాడు. తను వేసిన ప్లాన్ వర్కౌట్ అవ్వడంతో.. డబ్బుల సంపాదనకు ఆ దారినే ఎంచుకున్నాడు. ఖ‌రీదైన ఫోన్ల‌కు ఆర్డ‌ర్ ఇవ్వ‌డం.. ఖాళీ బాక్సులు వ‌చ్చాయంటూ ఫిర్యాదులు చేయ‌డం.. డ‌బ్బులు తిరిగి తీసుకోవ‌డం.. ఆయా ఫోన్లను తిరిగి అమ్మడం.. ఇలా చేస్తూ ఏకంగా రూ. 52 ల‌క్ష‌లు సంపాదించాడు.

తన మీద ఏమాత్రం అనుమానం రాకుండా అమెజాన్ ప్ర‌తినిధులకు వేర్వేరు ఫోన్ నెంబ‌ర్లు, అడ్ర‌స్‌లు ఇచ్చేవాడు. ఇందుకోసం ఓ వ్యాపారి దగ్గర నుంచి 141 సిమ్‌కార్డులను ప్రూఫ్‌లు లేకుండా తీసుకున్నాడు. ఫోన్ ఆర్డ‌ర్ చేసిన‌పుడు త‌ప్పుడు అడ్ర‌స్ ఇచ్చేవాడు. ఇలా 166 సార్లు చేశాడు. ఎప్పుడూ లేనంతగా ఫిర్యాదులు రావడంతో.. అమెజాన్ సంస్థకి అనుమానం వచ్చి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసును ద‌ర్యాఫ్తు చేసి శివ‌మ్‌ను అరెస్ట్ చేశారు. అతనితోపాటు అక్ర‌మంగా సిమ్‌లు అంద‌జేసిన వ్యాపారిని కూడా అరెస్ట్ చేశారు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.