‘ఈ నగరానికి ఏమైంది?’ మూవీ రివ్యూ-రేటింగ్

సినిమా : ఈ నగరానికి ఏమైంది?
నటీనటులు : విశ్వక్సేన్‌ నాయుడు, సుశాంత్‌రెడ్డి, అభివన్‌ గోమతం, వెంకటేష్‌ కాకుమాను, అనిషా ఆంబ్రోస్‌, సిమ్రన్‌ చౌదరి, తదితరులు
రచన-దర్శకత్వం: తరుణ్‌ భాస్కర్‌
నిర్మాత : డి.సురేష్‌బాబు
సంగీతం : వివేక్‌ సాగర్‌
సినిమాటోగ్రఫీ : నికిత్‌ బొమ్మి
బ్యానర్‌ : సురేష్‌ ప్రొడక్షన్స్‌
విడుదల తేదీ : 29-06-2018

తొలిచిత్రం ‘పెళ్ళిచూపులు’తోనే ప్రత్యేక గుర్తింపు సంపాదించిన తరుణ్ భాస్కర్.. ఇప్పుడు ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. యూత్‌‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌‌గా రూపొందిన ఈ చిత్రాన్ని సురేష్‌బాబు నిర్మించారు. పోస్టర్లు, ట్రైలర్‌లతో ఈ చిత్రాన్ని చాలా డిఫరెంట్‌గానే ప్రమోట్ చేయడంతో ఈ మూవీపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి.. వాటిని అందుకోవడంలో ఇది సక్సెస్ అయ్యిందా? లేదా? రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ :
వివేక్ ‌(విశ్వక్సేన్‌ నాయుడు), కార్తీక్‌ (సుశాంత్‌రెడ్డి), కౌశిక్‌ (అభినవ్‌గో మతం), ఉపేంద్ర (వెంకటేశ్‌ కాకుమాను) నలుగురు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఒక్కొక్కరికీ ఒక్కో గోల్ కలిగిన వీళ్ళందరూ కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటారు. తమ ట్యాలెంట్ ఏంటో చాటిచెప్పాలని ఫిక్స్ అవుతారు. అయితే.. ఈ గ్యాంగ్‌లో ఒకడైన వివేక్‌కి చాలా కోపం. అందునా లవ్ ఫెయిల్యూర్ కాబట్టి తరచూ కోపాద్రిక్తుడవుతుంటాడు. దీంతో గ్యాంగ్‌లో తరచూ గొడవలు జరుగుతుంటాయి.

కట్ చేస్తే.. కార్తీక్ ఇక జీవితంలో సెటిల్ అవ్వాలని భావించి, పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకుంటాడు. ఈ సందర్భంగా తన ముగ్గురు స్నేహితులకు పార్టీ ఇస్తాడు. పబ్బులో చిత్తుగా తాగిన ఈ నలుగురు.. ఆ మత్తులో గోవాకి వెళ్లిపోతారు. అక్కడకు వెళ్లాక ఈ నలుగురూ ఏం చేశారు? తమ స్నేహాన్ని, జీవితాన్ని ఎలా సరిదిద్దుకున్నారు? అనేదే ఈ సినిమా కథ.

విశ్లేషణ :
‘పెళ్లిచూపులు’ చిత్రం అంత పెద్ద విజయం సాధించడానికి కారణం.. తరుణ్ దాన్ని అత్యంత సహజంగా తెరకెక్కించడమే! కాస్త కన్‌ఫ్యూజన్ పెట్టి, మాటల మేజిక్‌తో సీన్స్‌ని నేచురల్‌గా చూపించడం వల్లే జనాలు ఎంటర్టైన్ అవ్వగలిగారు. ఇప్పుడు ‘ఈ నగరానికి ఏమైంది’ విషయంలోనూ అదే మ్యాజిక్‌ని రిపీట్ చేశాడు భాస్కర్!

ఈసారి కూడా నలుగురి స్నేహితుల ప్రయాణాన్ని అందరికీ నచ్చేలా చాలా సహజంగా రూపొందించాడు. మనం రోజు మాట్లాడుకునే మాటలు, కుళ్ళు జోకులతోనే తరుణ్ మ్యాజిక్ చేయగలిగాడు. ఎక్కడా అనవసరమైన డ్రామా పండించకుండా, మనమే మాట్లాడుకుంటున్నామేమో అనేంతగా లీనమయ్యేటట్లు అత్యంత సహజత్వంతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఇక్కడే అతను వంద మార్కులు కొట్టేశాడు.

ఫస్టాఫ్ మొత్తం నలుగురు ఫ్రెండ్స్, పార్టీలు-పబ్బులు, వాళ్ళు చేసే అల్లరిచిల్లర పనులతోనే సాగుతుంది. ఇక సెకండాఫ్ మొత్తం గోవా నేపథ్యంలోనే సాగుతుంది. అక్కడ షార్ట్ ఫిల్మ్ కోసం ఆ నలుగురు చేసే ప్రయత్నం చుట్టే కథ ఎక్కువగా నడుస్తుంది. ఇది కొంచెం సాగదీతగా అనిపించినా.. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయగలిగింది. చివర్లో సినిమాని మరింత సహజంగా ముగించడమే మరో మేజర్ ప్లస్ పాయింట్!

క్లైమాక్స్ అంటే ఏదో డ్రామా ఉండాలి, ఎమోషన్ పండించాలన్నట్లుగా మేకర్స్ ఏవేవో ప్లాన్స్ వేస్తారు. కానీ.. తరుణ్ వాటి జోలికి వెళ్ళకుండా సహజత్వంతో నడిపించడమే ప్రేక్షకుల్ని మెప్పించింది. అలాగని ఈ చిత్రంలో మైనస్ పాయింట్స్ లేవని కావు. కథ బలంగా లేకపోవడం, పాత్రలు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడం ఎబ్బేట్టుగా అనిపిస్తాయి.

కాకపోతే.. యువతరానికి నచ్చే అంశాల్ని భాస్కర్ పుష్కలంగా పెట్టడంతో ఈ చిత్రం వాళ్ళని అలరించడంలో సక్సెస్ అయ్యింది. ఇన్నాళ్ళూ ప్రమోట్ చేసినట్లుగా.. ఒక గ్యాంగ్‌తో వెళ్ళి ఈ సినిమాని వీక్షించి, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి గ్రూప్‌ని ఎంటర్టైన్ చేయగలిగే స్టఫ్ ఇందులో బ్రహ్మాండంగా ఉంది.

నటీనటుల ప్రతిభ :
తెరపై కనిపించే నలుగురు హీరోలు కొత్తవారే అయినా.. వారినుంచి సహజ నటన రాబట్టడంలో తరుణ్ విజయం సాధించాడు. ‘పెళ్లిచూపులు’లోలాగానే ఇందులో కౌశిక్ పాత్ర బాగా హైలైట్ అయ్యింది. ఇందులోనూ ఆ పాత్ర ఆద్యంతం నవ్వించింది. ఇతర పాత్రలూ సహజంగా ఉండటంతో.. ఆ స్వభాలు కలిగిన వ్యక్తులు వెంటనే కనెక్ట్ అయిపోతారు. కథానాయికలు కూడా అందంగా కనిపిస్తూ.. తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక ప్రతిభ :
సినిమాటోగ్రఫీ, సెట్టింగ్‌లు కథకు తగ్గట్టు బాగానే కుదిరాయి. వివేక్‌ సాగర్‌ సంగీతం కూడా బాగుంది. యూత్‌కు తగ్గట్టు ట్రెండీగా నేపథ్య సంగీతం అందించాడు. ఎడిటింగ్ కూడా బాగానే కుదిరింది. నిర్మాణ విలువలు అదిరాయి. రచయితగా తరుణ్‌ భాస్కర్‌ మరోసారి తన సత్తా చాటాడు. కాకపోతే మరింత పటిష్టమైన కథను రాసుకుని ఉండుంటే బాగుండేదని అనిపిస్తుంది.

చివరగా : ప్రతి గ్యాంగ్‌ని అలరించే సినిమా!
రేటింగ్ : 3/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.