‘జనతా గ్యారేజ్’పై హాట్ కామెంట్

Hot Comment On Janatha Garage Movie

Hot Comment On Janatha Garage Movie. Tollywood and sensational news updates Neticinema is one among the best. Experience the unique presentation of articles for the film industry latest updates and trending news.

‘మిర్చి’, ‘శ్రీమంతుడు’.. ఈ రెండు సినిమాల కథలు పాతవే అయినా దర్శకుడు కొరటాల శివ వాటిలో ఆహ్లాదకరమైన సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్‌ని జోడించి ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యేలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఎక్కడ బోర్ కొట్టించకుండా రొటీన్ కథల్ని చాలా భిన్నంగా రూపొందించాడు. దీంతో.. కొరటాలకి ‘కమర్షియల్ సినిమాలకు అప్‌డేట్ వెర్షన్’ అని పేరొచ్చింది. అలాంటి ఈయన దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ చిత్రం వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాని కూడా… ఆ రెండు మూవీలను ఎలా తెరకెక్కించాడో, ఇది కూడా అలాగే ఉంటుందని అనుకున్నారు. కానీ.. ఆ అంచనాల్ని ఇది పూర్తిగా అందుకోలేకపోయింది.

అలాగని ఈ సినిమా బాగోలేదని కాదు.. ఇందులోనూ ఆసక్తికరమైన సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్, ఎన్టీఆర్ మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్, కొరటాల మార్కు డైలాగులు,  కనువిందు చేసే ఛాయాగ్రహణం, ఉత్తేజం కలిగించే సంగీతం అన్నీ బాగానే కుదిరాయి. ముఖ్యంగా.. కొరటాల ఎంచుకున్న రెండు అంశాలు ఈ చిత్రానికి ఎసెట్. అవే.. మొక్కలను సంరక్షించాలని, ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకోవడం. కానీ.. నిలకడ లేని కథనమే ‘గ్యారేజ్’ అంచనాల్ని దెబ్బతీసింది. ఫస్టాఫే కాస్త నిరాశపరిచింది. చూడ్డానికి మొదటిభాగం చాలా రీఫ్రెషింగ్‌గానే ఉంది కానీ.. పతాకస్థాయి సీన్లైతే లేవు. మోహన్‌లాల్, ఎన్టీఆర్ ఇంట్రొడక్షన్ అయిపోయాక సినిమా స్లోగా సాగుతుంది. హీరో, హీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్ కూడా అంతగా ఆసక్తికరంగా లేదు.

పాటలైతే చాలా బాగున్నాయి. విజువల్ పరంగా చాలా గ్రాండ్‌గా తెరకెక్కించాడు కొరటాల. కానీ.. కథనే చాలా స్లోగా నడిపాడు. టేకాఫ్ విషయంలో మరీ ఎక్కువ టైం తీసుకున్నాడు. ఇక ఎన్టీఆర్ ఒక రీసెర్చ్ కోసం ఎప్పుడైతే హైదరాబాద్‌కి వస్తాడో.. అప్పటినుంచి స్టోరీ ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. అప్పుడొచ్చే ఓ ఫైట్ ఆడియెన్స్‌కి కిక్ ఇస్తుంది. అనంతరం అతను మోహన్‌లాల్‌ని కలిసే సీన్ అందరినీ ఉత్తేజపరుస్తుంది. ఈ సన్నివేశం సినిమా ‘గ్యారేజ్’ ట్రాక్ మీదికి వచ్చిన భావన కలిగిస్తుంది. ఇక్కడితో ఇంటర్వెల్ ముగుస్తుంది. మొత్తంగా.. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు, డైలాగులు, పాటలు బాగానే ఉన్నాయి కానీ.. ఆసక్తికరమైన సన్నివేశాలైతే పడలేదు.

ఇక ఇంటర్వెల్ తర్వాత అసలైన కథ స్టార్ట్ అవుతుంది. అప్పటివరకు నార్మల్‌గా సాగిన సినిమా.. ఒక్కసారిగా చాలా ఆసక్తికరంగా మారుతుంది. సెకండాఫ్ స్టార్ట్ అయిన మొదటినుంచే ఇంట్రెస్టింగ్ మోడ్ టర్న్ తీసుకుంటుంది. మొదటి 40 నిముషాల కథనం సినిమాని మరో స్థాయికి తీసుకెళ్తుంది. ముఖ్యంగా.. రాజీవ్ కనకాల చుట్టూ తిరిగే ఎపిసోడ్ ఈ మూవీకి మేజర్ హైలైట్. దీన్ని కొరటాల ఎంత బాగా రాశాడో.. అంతే అద్భుతంగా తీశాడు. ఆ ఎపిసోడ్‌లో ఎన్టీఆర్ కూడా తన అద్భుత అభినయంతో ఇరగదీశాడు. ఈ సీన్ తర్వాత వచ్చే టైటిల్ సాంగ్ కూడా చక్కగా కుదిరింది. అయితే.. దీని తర్వాత స్టోరీ మళ్ళీ నెమ్మదించడంతో ఆ హైప్ తగ్గిపోతుంది.

మళ్ళీ రొటీన్ ట్రాక్‌కే కొరటాల నడిపించడంతో.. ఆడియెన్స్ బోర్‌గా అయితే ఫీలవ్వరు కానీ, మొదట్లో పొందిన జోష్‌ని కాస్త మిస్ అవుతారు. ప్రీ-క్లైమాక్స్ వరకు సినిమా ఇలాగే సాగుతుంది. మధ్యలో వచ్చే ఎమోషనల్ సీన్స్ హార్ట్ టచింగ్‌గా ఉన్నాయి. ఇక పక్కా లోకల్ సాంగ్‌ని విజువల్ పరంగా చూస్తున్నప్పుడు ఎవ్వరైనా జోష్‌తో ఊగిపోతారు. మొదట్లో ఈ పాటకి అంతగా రెస్పాన్స్ రాలేదు కానీ.. సినిమాలో చూస్తే మాత్రం దీనికి దాసోహమైతారు. కాజల్ తన అందాల్ని ఆరబోయడంతోపాటు డ్యాన్స్ ఇరగదీసింది. ఎన్టీఆర్‌ స్పీడ్‌ని అందుకుంది. థియేటర్‌లో ఈ పాటకి ఆడియెన్స్ కూడా స్టెప్పులేశారు. అంతలా ఊరించింది ఈ పాట.

అయితే.. సినిమాను ముగించడంలో కొరటాల కాస్త తడబడ్డాడు. క్లైమాక్స్ ఎపిసోడ్‌ బాగానే ఉంది కానీ.. ఆశించినంత స్థాయిలో కొరటాల తీయలేదు. ఈ చిత్రానికి మేజర్‌గా నిలవాల్సిన విలనిజం చాలా వీక్‌గా ఉండడం మైనస్ పాయింటే. హీరోలకు.. విలన్లకు మధ్య వైరం కన్విన్సింగ్‌గా లేదు. కొరటాల బ్యాలెన్స్ చేయడానికి చాలానే ప్రయత్నాలు చేశాడు కానీ.. ఎక్కడో తేడా కొడుతున్నట్లు మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. అయితే.. ఈ మైనస్ పాయింట్ సినిమా మీద అంతగా ప్రభావం చూపదు. ఎందుకంటే.. యాక్షన్ సీన్లతో కొరటాల వాటిని బాగానే బ్యాలెన్స్ చేశాడు. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఓ రేంజులో యాక్షన్ పండించాడు. ఈ సీన్స్ మాస్ ఆడియెన్స్‌ని ఖచ్చితంగా ఉర్రూతలూగిస్తాయి. ఓవరాల్‌గా ఈ సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. అంతా బాగుంది కానీ కొరటాల మార్క్ మిస్ అయ్యింది.

ఇక సినిమాలోని ప్రధాన పాత్రల గురించి మాట్లాడుకుందాం. ముందుగా మోహన్‌లాల్ గురించి చెప్పుకుంటే.. ‘సర్కార్’ తరహాలో నడిచే ఆయన పాత్ర మామూలుగానే అనిపిస్తుంది. ఇలాంటి క్యారెక్టర్లు ఇదివరకటి సినిమాల్లో చూశాం. కానీ.. ఆయన తన నటనతో ఆ పాత్రకు ప్రత్యేకత తీసుకొచ్చారు. తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఇక ఎన్టీఆర్ గురించి మాట్లాడితే.. తన భుజాలపై ఈ చిత్రాన్ని నడిపించాడు. మొదటి భాగంలో ఎన్టీఆర్ రోల్ చిన్నదే అయినా.. అతను కనిపించినపుడల్లా ప్రేక్షకుల్లో ఉత్తేజం వస్తుంది. తన మార్క్ స్టైల్‌తో ఈ సినిమాని నడిపించాడు. ఎమోషనల్, డ్యాన్స్, యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీశాడంతే.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.