ఇంటిలిజెంట్ మూవీ రివ్యూ, రేటింగ్ & అనాలసిస్

మూవీ: ఇంటిలిజెంట్
నటీనటులు: సాయి ధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠీ తదితరులు
సినిమాటోగ్రాఫర్: ఎస్.వి.విశ్వేశ్వర్
మ్యూజిక్ డైరెక్టర్: థమన్
నిర్మాత: సి.కళ్యాణ్
దర్శకుడు: వివి వినాయక్
రిలీజ్ డేట్: 09-02-2018

మెగా కాంపౌండ్ నుండి వచ్చి సుప్రీం హీరోగా ఎదిగిన సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం కెరీర్‌లో దారుణమైన స్టేజీలో ఉన్నాడు. వరుసబెట్టి తేజు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్స్‌గా మిగులుతుండటంతో ఎలాగైనా హిట్ కొట్టాలని వివి వినాయక్‌తో కలిసి ‘ఇంటిలిజెంట్’గా మనముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతో తేజు అనుకున్న హిట్ కొట్టాడా లేదా రివ్యూలో చూద్దాం.

కథ:
నందకిషోర్(నాజర్) వ్యక్తిగతంగా చాలా మంచివాడు. విజన్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీకి ఓనర్ అయిన నందకిషోర్, తన కంపెనీలోని ఉద్యోగుల పట్ల చాలా చక్కగా ఉంటాడు. అనాథలకు సహాయం చేసే నందకిషోర్ పుణ్యమా అని తేజు(సాయి ధరమ్ తేజ్) బాగా చదువుకుని అతడి కంపెనీలోనే ఉద్యోగం చేస్తుంటాడు. ఈ క్రమంలో ప్రత్యర్థి వర్గాలు నందకిషోర్ కంపెనీపై కన్నేస్తారు. దానిని ఎలాగైనా దక్కించుకోవాలని ట్రై చేస్తుంటారు.

కట్ చేస్తే ఒక మాఫియా డాన్ విక్కీ భాయ్(రాహుల్ దేవ్) పేరుపై తన కంపెనీని రాసేసి ఆత్మహత్య చేసుకుంటాడు నందకిషోర్. అదే సమయంలో తేజుపై అటాక్ జరుగుతుంది. ఈ అటాక్ ఎవరు చేశారు? నందకిషోర్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు? అది ఆత్మహత్యా లేక హత్యా? విక్కీ భాయ్‌తో నందకిషోర్ సంబంధం ఏమిటీ? అనే ప్రశ్నలకు సమాధానమే ఇంటిలిజెంట్ సినిమా కథ.

విశ్లేషణ:
నిజానికి సినిమాలో కొత్తగా ఏమీ లేదు. సాఫ్ట్‌వేర్ కంపెనీను దక్కించుకోవాలని చూసే మాఫియా డాన్, అతడిని అంతం చేసి కంపెనీని కాపాడడం కోసం హీరో చేసే ఫీట్లు ఇదే సినిమా. గతంలో సాయి ధరమ్ పూర్తిగా కమర్షియల్ చిత్రాల్లోనే నటించినప్పటికీ మంచి కథలనే ఎంచుకున్నాడు. అయితే ఇప్పుడు తేజుకి ఏమైంది అనే డౌట్ అందరికీ వస్తుంది. కేవలం వినాయక్ డైరెక్టర్ అనే కాన్ఫిడెన్స్‌తో కథ కూడా వినకుండా సినిమా చేశాడా..? అనే సందేహాలు కలుగుతాయి. వినాయక్ గత సినిమాల్లో కనిపించే బలమైన సీన్స్, ట్వీస్టులు ఇందులో ఒక్కటి కూడా లేవు. హీరో ఇంట్రొడక్షన్ మొదలుకొని ఇంటర్వల్ సీన్ వరకు ఏదీ ఆకట్టుకోదు.

పోనీ సెకండాఫ్‌లోనైనా ఏమైన కథ ఉందేమో అని చూసిన జనాలకు మరింత పిచ్చెక్కించాడు వినాయక్. సెకండాఫ్ మొత్తం రొటీన్ కమర్షియల్ సినిమాల్లో హీరో ఫ్యామిలీ, స్నేహితులు, ప్రేమించే అమ్మాయిని విలన్ కిడ్నాప్ చేయడం.. వారిని వెతుక్కుంటూ హీరో వచ్చి విలన్‌ను చంపి తన వారిని కాపాడుకోవడం.. ఇవే సన్నివేశాలను మరింత సాగదీసి చూపించి ప్రేక్షకులను బాగా విసిగించాడు దర్శకుడు. కామెడీ, రొమాన్స్ ఏ ఒక్క అంశం కూడా మనల్ని ఆకట్టుకోదు. ఇక హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ అస్సలు వర్కవుట్ కాలేదు. ఓవరాల్‌గా చూస్తే ఇంటిలిజెంట్ సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను అలరిస్తుందని చూసిన తేజుకి నిరాశను మిగిలించిందని చెప్పాలి.

నటీనటుల పర్ఫార్మెన్స్:
సాయి ధరమ్ తేజ్ తనదైన యాక్టింగ్‌తో సినిమాను నడిపించాడు. ఎమోషనల్ సీన్స్, యాక్షన్, డ్యాన్స్ ఇలా అన్ని అంశాల్లో మెగా హీరో ఆకట్టుకున్నాడు. కానీ తేజు ఒక్కడే సినిమాను హిట్ చేయలేడు కదా. హీరోయిన్ పాత్రలో లావణ్య త్రిపాఠీ ఎంతమాత్రం ఇంప్రెస్ చేయలేకపోయింది. అమ్మడికి యాక్టింగ్ స్కోప్ ఎక్కువగా లేకపోవడంతో హీరో కోసం ఒక హీరోయిన్ ఉండాలనే రీతిలో లావణ్య మనకు కనిపిస్తుంది. మిగతా నటీనటులు తమ పరిధిమేర బాగానే నటించారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
ముందుగా డైరెక్టర్ వివి వినాయక్ గురించి మాట్లాడుకోవాలి. మాస్ సినిమాలను తనదైన స్టయిల్లో తెరకెక్కించి హిట్స్ కొట్టిన వినాయక్ ఈ సినిమాను ఎందుకు తీసాడో అర్ధం కాలేదు. రొటీన్ కథను ప్రెజెంట్ చేసిన విధానం కూడా పరమరొటీన్‌గా ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకుడికి చిరాకు తెప్పిస్తుంది. ఇంట్రెస్టింగ్ కథనం, ఆసక్తిరేపే ట్విస్టుల ఎక్కడా లేకపోవడంతో ఈ సినిమా ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యిందని చెప్పాలి. ఆకుల శివ అందించి కథ పాతచింతకాయ పచ్చడికంటే కూడా పాతదిగా ఉండటంతో ఆకట్టుకోలేకపోయింది. విశ్వేశ్వర్ కెమెరా పనితనం పర్వాలేదనిపించింది. థమన్ అందించిన మ్యూజిక్ కూడా పెద్దగా చేసింది ఏమీ లేదు. రొటీన్ కొట్టుడు ఉండటంతో ఏ ఒక్క పాటకూడా ఆకట్టుకోలేకపోయింది. ఇక ‘‘ఛమక్ ఛమక్ ఛాం..’’ పాట ఒకరేంజులో ఉంటుందని వచ్చిన వారికి పెద్ద బిస్కెట్ తినిపించారు చిత్ర యూనిట్. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

చివరిగా: ‘ఇంటిలిజెంట్’ తెలివి అంతంతమాత్రమే!

నేటిసినిమా రేటింగ్: 3/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.