నటరుద్ర ఎన్టీఆర్ ‘జై లవకుశ’ రివ్యూ, రేటింగ్ & అనాలసిస్

jai lava kusa telugu movie review rating

సినిమా : జై లవకుశ
నటీనటులు : ఎన్టీఆర్, రాశీఖన్నా, నివేథా థామస్, సాయికుమార్, రోనిత్ రాయ్, తదితరులు
డైరెక్టర్ : కె.ఎస్ రవీంద్ర (బాబీ)
నిర్మాత : నందమూరి కళ్యాణ్‌రామ్
బ్యానర్ : ఎన్టీఆర్ ఆర్ట్స్
మ్యూజిక్ : దేవిశ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ : ఛోటా కే నాయుడు
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు

నటరుద్ర ఎన్టీఆర్ లేటెస్ట్ ఫిల్మ్ ‘జై లవకుశ’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తారక్ త్రిపాత్రిభినయం పోషించడం, ‘జై’ క్యారెక్టర్ వీరోచిత లెవెల్‌లో వుండటంతో ఈ చిత్రానికి విపరీతమైన క్రేజ్ వచ్చిపడింది. పైగా.. హ్యాట్రిక్ హిట్స్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని, ఎన్నో జాగ్రత్తలు వహించి తారక్ తీసిన చిత్రం కావడంతో ఆ చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరి.. అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రంతో తారక్ ఆడియెన్స్‌ని అలరించాడా? లేదా? రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం..

కథ :
జై, లవ, కుశలు చిన్నప్పుడే తండ్రిని కోల్పోవడంతో తమ మేనమామ దగ్గర ఆ ముగ్గురు పెరుగుతారు. ఓరోజు జరిగే ఫైర్ యాక్సిడెంట్ కారణంగా ముగ్గురూ విడిపోతారు. 20 సంవత్సరాల తర్వాత.. లవ బ్యాంక్ మేనేజర్‌గా పని చేస్తుంటాడు. అతడు అమాయకుడు కావడంతో ఆఫీస్‌వాళ్లు అతడ్ని ఆట పట్టిస్తుంటారు. మరోవైపు కుశ.. తుంటరి పనులు చేస్తూ డబ్బులు కొట్టేస్తుంటాడు. ఇక జోధ్‌పూర్‌లో వున్న జై రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఇతను రావణుడిలా చాలా క్రూరంగా వుంటాడు.

కట్ చేస్తే.. కుశ యూఎస్‌కి వెళ్ళాలనే ఆకాంక్షతో రూ.25 లక్షలు కొట్టేసి, ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్‌తో ఒప్పందం కుదుర్చుకుంటాడు. కట్ చేస్తే.. అదేరోజు ఇండియాలో నోట్ బ్యాన్ అవుతాయి. దాంతో.. ఆఫీసర్ ఆ డబ్బులు తీసుకోడు. దీంతో.. యూఎస్‌కి వెళ్ళాలన్న తన ప్లాన్ బెడిసికొట్టిందనే బాధతో కుశ పీకల్లోతు తాగి రోడ్డు మీదకి రాగా.. అతనికి యాక్సిడెంట్ అవుతుంది. తీరా చూస్తే.. ఆ యాక్సిడెంట్ ‘లవ’నే చేస్తాడు. అలా ఆ ప్రమాదంతో లవ, కుశలు కలుస్తారు. లవ తన ప్రాబ్లమ్ గురించి కుశకి చెప్పగా.. అతని ప్లేస్‌లో బ్యాంక్‌కి వెళ్ళి ఆఫీస్‌వాళ్లకి బుద్ధి చెప్తానని కుశ చెప్తాడు. దానికి లవ తలూపుతాడు. కట్ చేస్తే.. బ్యాంకులో రూ.25 లక్షలు పోతాయి. ఆ డబ్బుల్ని లవ తీశాడని బ్యాంక్‌వాళ్లు అనుకుంటుండగా.. వాటిని తన ప్లేస్‌కి మేనేజర్‌గా వెళ్లిన కుశ తీసి వుంటాడని అవ అనుకుంటాడు. దీనిపై ఇద్దరూ మాట్లాడుకుంటుండగా.. ఇంతలో ఎవరో వ్యక్తులు వాళ్లని కిడ్నాప్ చేస్తారు.

ఇంతకీ లవ, కుశని కిడ్నాప్ చేసిందెవరు? బ్యాంక్ నుంచి ఆ డబ్బులు కొట్టేసిందెవరు? అసలు జై రావణుడిలా క్రూరిడిగా ఎందుకు మారుతాడు? చివర్లో అతడు మంచోడిగా మారుతాడా? లేదా? చిన్నప్పుడు విడిపోయిన జై, లవ, కుశలు మళ్ళీ కలుస్తారా? లేదా? అసలు నివేథా థామస్ ఎవరు? ఇలా ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా సాగుతుంది.

విశ్లేషణ:
ఫస్టాఫ్ గురించి మాట్లాడుకుంటే.. మొదట్లో కాసేపు సోసోగా సాగే చిత్రం 15 నిముషాల తర్వాత ఊపందుకుంటుంది. లవ, కుశ ఎపిసోడ్‌లతో ఎంటర్టైనింగ్‌గా సాగిపోతుంది. ఓవైపు లవ తన ప్రియురాలితో రొమాన్స్ చేసుకంటుంటే, మరోవైపు కుశ అతని ప్లేస్‌లో బ్యాంకులో ఎంటర్ అయ్యి నానా హంగామా చేశాడు. ఇలా ప్రీ-ఇంటర్వెల్ ఎపిసోడ్ వరకు సరదాగా సాగే ఈ చిత్రం.. జై ఎంట్రీ మరో స్థాయికి వెళ్తుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మైండ్‌బ్లోయింగ్. అసలు దీన్ని ట్విస్టులకే బాప్‌గా చెప్పుకోవచ్చు.

ఇక సెకండాఫ్ మొత్తం జై క్యారెక్టర్ చుట్టే అల్లుకుని సాగుతుంది. రాజకీయాల్లోకి తన సత్తా చాటుకోవాలనుకున్న జై.. అందుకు వేసిన ఎత్తుగడలు, తన అపొజిషన్లను ఎదుర్కొనేందుకు వేసే ప్లాన్స్ బాగున్నాయి. ముగ్గురు జై, లవ, కుశలు వేసే ఒక పౌరాణిక డ్రామా అదిరిపోయింది. వీరిమధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కట్టి పడేస్తాయి. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఆడియెన్స్‌ని కట్టిపడేస్తుంది. అందరి అంచనాలకు భిన్నంగా ఒక ఎమోషనల్ ఎపిసోడ్‌తో దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని ముగించాడు. చివర్లో.. జై క్యారెక్టర్‌లోనూ ఒక ట్విస్ట్ వుంది.

ఓవరాల్‌ చూస్తే.. ఫస్ట్‌లో నడిచే కొంచెం బోరింగ్ ఎపిసోడ్, సెకండాఫ్‌లోని కొన్ని సాగదీసిన సీన్లను మినహా మిగతాదంతా అదిరిపోయింది. ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ అదుర్స్ అనిపించాయి. తారక్ తన భుజాలపై ఈ చిత్రాన్ని నడిపించి.. మెప్పించాడు.

నటీనటుల పెర్ఫార్మెన్స్:
తారక్ ఒక గొప్ప నటుడన్న విషయం అందరికీ తెలుసు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా.. దాన్ని చీల్చి చెండాడేస్తాడు. ‘జై లవ కుశ’లో అయితే మరింత రెచ్చిపోయింది. ఒక్కో పాత్రకి తన నటనతో జీవం పోసేశాడు. అమాయకుడైన లవకుమార్‌గా, తుంటరి పనులు చేసే కుశగా, నవయుగ రావణుడిలా జైగా ఇరగదీసేశాడు. ప్రతి పాత్రకి అతను చూపిన వేరియేషన్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. జైగా తారక్ చేసిన నటనకు ముగ్ధులైపోతారు. మొత్తంగా.. ఈ చిత్రాన్ని భుజాలపై మోసుకుని నడిపించాడు. మ్యారేజ్ బ్రోకర్‌గా రాశీఖన్నా అందంగా కనిపించడంతోపాటు ఉన్నంతలో బాగా నటించింది. అలాగే నివేథా థామస్ తన నేచురల్ యాక్టింగ్‌తో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కట్టిపడేసింది. విలన్‌గా రోనిత్ రాయ్ చాలా బాగా నటించాడు. సాయికుమార్ ఎప్పట్లాగే తన మార్క్ యాక్టింగ్‌తో మెప్పించారు. మిగతా నటీనటులు మామూలే.

టెక్నికల్ పెర్ఫార్మెన్స్:
ఛోటా కే నాయుడు అందించిన సినిమాటోగ్రఫీ అమోఘం. ప్రతి సన్నివేశాన్ని గ్రాండ్‌గా చూపించాడు. హీరో ఎలివేషన్ సీన్ల దగ్గర అతని కెమెరాపనితనం ఆకట్టుకుంటాయి. దేవిశ్రీ అందించిన పాటలు ఆల్రెడీ హిట్ అయ్యాయి. విజువల్‌గానూ బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చించి అవతల పారేశాడంతే. ఎడిటింగ్, ఆర్ట్ వర్క్స్ బాగున్నాయి. తొలిసారి తన తమ్ముడితో సినిమా చేసిన కళ్యాణ్‌రామ్.. నిర్మాణ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీగా ఖర్చుపెట్టాడు. ఇక డైరెక్టర్ బాబీ గురించి మాట్లాడుకుంటే.. అతను ఎంచుకున్న స్టోరీలైన్, తీసిన విధానం బాగున్నాయి. సెకండాఫ్‌లో మరింత శ్రద్ధ పెట్టాల్సింది. ఓవరాల్‌గా.. దర్శకునిగా తన ప్రతిభ చాటుకున్నాడు.

చివరగా : జై లవకుశ – తారక్ వన్ మ్యాన్ షో
రేటింగ్ : 3.25/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.