బాలయ్య, నయనతారల ‘జై సింహా’ మూవీ రివ్యూ-రేటింగ్

jai simha movie review rating

చిత్రం : జైసింహా
నటీనటులు : బాలకృష్ణ, నయనతార, నటాషాదోషి, హరిప్రియ, ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, తదితరులు
కథ, మాటలు: ఎం.రత్నం
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : కె.ఎస్‌.రవికుమర్‌
నిర్మాత : సి.కల్యాణ్‌
సంగీతం : చిరంతన్‌ భట్‌
ఎడిటింగ్‌ : ప్రవీణ్‌ ఆంటోని
ఛాయాగ్రహణం : సి.రామ్‌ ప్రసాద్‌
బ్యానర్‌ : సీకే ఎంటర్‌టైన్‌మెంట్‌
విడుదల తేదీ : 12-01-2018

ఆరుపదుల వయసు దగ్గరపడుతున్నకొద్దీ నేటి యంగ్ హీరోలకు ధీటుగా వరుస సినిమాలతో దూసుకుపోతున్న బాలయ్య.. లేటెస్ట్‌గా తన 102వ చిత్రం ‘జై సింహా’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో నయనతార ప్రధాన హీరోయిన్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మించారు. నటాషా దోసి, హరిప్రియలు మరో ఇద్దరు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం డిఫరెంట్ ప్రోమోలు, విపరీతమైన ప్రమోషన్ కార్యక్రమాలతో క్రేజ్ పెంచుకుంటూ వచ్చింది. అలాగే.. బాలయ్యకి సంక్రాంతి సెంటిమెంట్ కూడా ఉండడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి.. ఆ సెంటిమెంట్‌ని ఈ చిత్రం రిపీట్ చేయగలిగిందా? బాలయ్య మళ్ళీ ఆకట్టుకోగలిగారా? లేదా? రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం పదండి..

కథ :
నరసింహ(బాలకృష్ణ) ఒక అబ్బాయిని తీసుకుని విశాఖపట్నం నుంచి కుంభకోణం చేరుకుంటాడు. అక్కడి ఆలయ ధర్మకర్త(మురళీమోహన్‌) ఇంట్లో డ్రైవర్‌గా పనిలో చేరతాడు. కట్ చేస్తే.. ఓరోజు ఆలయ ధర్మకర్త కుమార్తె ధాన్య(నటాషా దోషి) చేసిన ఓ పరిణామం కారణంగా నరసింహ చిక్కుల్లో ఇరుక్కుంటాడు. దాంతో అతనికి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. అతనిపై శతృవుల దాడి ఎక్కువైపోయింది. చివరికి.. ఏసీపీని కూడా నరసింహ ఎదురించడంతో అతనికి కూడా శత్రువుగా మారతాడు. ఇలా సమస్యలు పెరుగుతుండడంతో.. అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నరసింహ బయలుదేరుతాడు.

సరిగ్గా అదే టైంలో నరసింహ తీసుకుని వచ్చిన బాబుని వెతుక్కుంటూ గౌరి (నయనతార) కుంభకోణం చేరుకుంటుంది? ఆ తర్వాత నరసింహకి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అసలు బాలయ్య ఎత్తుకుని వచ్చిన ఆ అబ్బాయి ఎవరు? ఆ బాబు కోసం గౌరి ఎందుకు వెతుక్కుంటూ వచ్చింది? ఇంతకీ గౌరికి, నరసింహకి సంబంధం ఏంటి? నరసింహ ఆ బాబుని తీసుకుని కుంభకోణం ఎందుకు రావాల్సి వచ్చింది? ఇంతకీ ఆలయ్య ధర్మకర్త కుమార్తె ధాన్య చేసిన ఆ పరిణామం ఏంటి? ఇంతకీ హరిప్రియ ఎవరు? ఆమెని నరసింహ ఎందుకు పెళ్ళి చేసుకుంటాడు? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా సాగుతుంది.

విశ్లేషణ :
బాలయ్య రెగ్యులర్‌గా చేసే మాస్ కమర్షియల్ ఎంటర్టైజనర్ జోనర్‌కి సంబంధించిన సినిమానే ‘జై సింహా’. బాలయ్య నుంచి అభిమానులు ఏం కోరుకుంటారో.. అదే చూపిస్తూ ఈ చిత్రాన్ని చాలా బాగా హ్యాండిల్ చేశాడు దర్శకుడు కెఎస్ రవికుమార్. భారీ యాక్షన్ డోస్‌తో చూపిస్తూ.. అక్కడక్కడ సెంటిమెంట్‌తో మనసుల్ని కరిగించేసి, మధ్యలో కథ చెప్తూ మూవీని నడిపించాడు. 90 స్టైల్ కనిపించినా.. ఫ్యాన్స్ కోరుకునే విధంగా తీర్చిదిద్ది ఎంటర్టైన్ చేయగలిగాడు.

ఫస్టాఫ్ గురించి మాట్లాడితే.. ఇదంతా కుంభకోణం నేపథ్యంలోనే సాగుతుంది. విచిత్రం ఏంటంటే.. సాధారణంగా బాలయ్య ఎంట్రీ ఏ భారీ యాక్షన్ ఎపిసోడ్‌తోనే ఉంటుంది. కానీ ఇందులో మాత్రం చాలా క్లాస్‌గా పరిచయం చేశాడు. కొద్దిసేపు కథ సాఫీగా సాగాక.. ఆ తర్వాత వీరోచిత యాక్షన్ ఎపిసోడ్స్, బాలయ్య భారీ డైలాగ్స్, కామెడీ ఎపిసోడ్స్‌తో సినిమాని నడిపించాడు. ఫ్యాన్స్‌ని ఆకట్టుకునేలా సీన్లను బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా.. పురోహితుల గొప్పతనం గురించి చెప్పే సీన్‌లో బాలకృష్ణ మార్కు డైలాగ్‌లు, నటన రొమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయి. ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్‌తో, మైండ్‌బ్లోయింగ్ ట్విస్ట్‌తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది.

ఇక సెకండాఫ్ మొత్తం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ మీదే ఆధారపడి ఉంటుంది. నయనతార, బాలయ్యకి మధ్య సంబంధం ఏంటనే నేపథ్యంలో ఫ్లాష్‌బ్యాక్ నడుస్తుంది. ఇక్కడ సెంటిమెంట్‌ని పండించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కాకపోతే.. సినిమా నడిచేకొద్దీ నమ్మదించినట్లు అనిపిస్తుంది. సాగదీత సీన్లు, ప్రేక్షకులని కాస్త అహనానికి గురిచేస్తాయి. ఇక్కడ కొన్ని సీన్లను కత్తిరించి ఉంటే బాగుండనిపిస్తుంది. అయితే ప్రీక్లైమాక్స్ వద్ద సినిమా వేగం పుంజుకుంటుంది. ఇక ఎప్పట్లాగే ఒక అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్‌తో చిత్రం ముగుస్తుంది.

డిజప్పాయింట్‌మెంట్ ఏంటంటే.. ఈ సినిమా కథ చాలా పాతది. కథనం కూడా 90 స్టైల్లో ఉంటుంది. కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అక్కడక్కడ మాత్రమే కొన్ని ఫన్నీ సీన్స్ పండాయి. నయనతార తప్ప మిగతా హీరోయిన్లు తేలిపోయారు. కొన్ని సీన్లు బాగా బోర్ కొట్టించేశాయి. ఇవి మినహా.. మిగతాదంతా ఓకే. క్లాస్ ఆడియెన్స్‌కి రుచించకపోవచ్చు గానీ.. మాస్ ఆడియెన్స్‌కి మాత్రం ఇదో ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు.

నటీనటుల ప్రతిభ :
బాలయ్య నటవిశ్వరూపం ఏంటో అందరికీ తెలుసు. ఏ పాత్ర ఇచ్చినా సరే.. దాంట్లో పూర్తిగా ఒదిగిపోయే తన బెస్ట్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేస్తాడు. ‘జై సింహా’లోనూ రెండు కోణాల్లో అలరించాడు. సి.కళ్యాణ్ ఓ ప్రెస్‌మీట్‌లో చెప్పినట్లుగానే బాలయ్య అదిరిపోయే స్టెప్పులతో ఉర్రూతలూగించాడు. ఇక యాక్షన్ ఎపిసోడ్స్‌లో రప్ఫాడించేశాడు. ఒక్కమాటలో చెప్పాలంటే.. సినిమా మొత్తాన్ని తన భుజం మీద నడిపించాడు. ఇక నయనతార పాత్రకి చాలా ప్రాధాన్యం ఉంది. ఆమె అందంగా కనిపిస్తూనే, తన నటనా ప్రతిభతో కట్టిపడేసింది. నటాషా దోషి, హరిప్రియ పాత్రలు తేలిపోయినా.. తమవంతు బాగానే ఆకట్టుకున్నారు. నటాషా గ్లామర్‌ ఒలికిస్తే.. హరిప్రియ కాస్త అల్లరి చేసింది. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం పూర్తి నిడివి ఉన్న పాత్రలో కనిపించారు. కానీ.. ఆశించిన స్థాయిలో కామెడీ పండించలేకపోయాడు. ఇక విలన్లు గురించి చెప్పాలంటే.. చాలామందే ఉన్నారు. అందరూ తమతమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. మిగతా నటీనటులు మామూలే.

టెక్నికల్ ప్రతిభ :
సి.రామ్‌ ప్రసాద్‌ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. చిరంతన్ భట్ పాటల్లో ‘అమ్మకుట్టి’ మాస్‌ని అలరిస్తే.. మిగిలినవి ఫర్వాలేదనిపించాయి. అయితే నేపథ్య సంగీతం మాత్రం ఇరగదీశాడు. కొన్నిచోట్ల పసలేనట్లుగా అనిపించినా.. యాక్షన్ ఎపిసోడ్స్ దగ్గర మాత్రం చితక్కొట్టేశాడు. ఎడిటింగ్ విషయంలో సెకండాఫ్‌లో జాగ్రత్త తీసుకోవాల్సింది. సి.కళ్యాణ్ నిర్మాణ విలువలకు ఎక్కడా వంక పెట్టడానికి లేదు. దర్శకుడు కెఎస్ రవికుమార్ గురించి మాట్లాడితే.. ఆయన ఎంచుకున్న కథ చాలా పాతది. ఫస్టాఫ్ కథనం స్పీడ్‌గా రాసుకున్నాడు కానీ.. సెకండాఫ్‌లో కాస్త తడబడ్డాడు. అయితే.. బాలయ్యని ఎలా చూపించాలో అలా ప్రెజెంట్ చేసి.. ఫ్యాన్స్ మనసుల్ని గెలుచుకున్నాడు.

చివరగా : అదే ‘సింహా’ గర్జన.. ‘జై’ అంటున్న ఫ్యాన్స్
రేటింగ్ : 3/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.