శ్రీనివాస్ రెడ్డి ‘జంబలకిడి పంబ’ మూవీ రివ్యూ-రేటింగ్

సినిమా : జంబ‌ల‌కిడి పంబ‌
నటీనటులు : శ్రీనివాస్‌రెడ్డి, సిద్ధి ఇద్నాని, పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిశోర్‌, త‌దిత‌రులు
ర‌చ‌న‌ – ద‌ర్శ‌క‌త్వం: జె.బి. ముర‌ళీకృష్ణ (మ‌ను)
నిర్మాణం : ర‌వి, జోజో జోస్‌, శ్రీనివాస్‌రెడ్డి.ఎన్
సంగీతం : గోపీసుంద‌ర్
ఛాయాగ్ర‌హ‌ణం : స‌తీశ్ ముత్యాల‌
సంస్థ‌ : శివ‌మ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడ‌క్ష‌న్స్
విడుద‌ల ‌: 22-06-2018

ఒకవైపు కమెడియన్‌గా కొనసాగుతూనే, కథానాయకుడిగా సినిమాలు చేస్తున్న శ్రీనివాస్‌రెడ్డి.. తాజాగా ‘జంబలకిడి పంబ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సీనియర్ నరేష్ చేసిన పాత సినిమా టైటిలే కావడంతోపాటు కథానేపథ్యం కూడా దాదాపు అదే కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. ప్రోమోలు కూడా హిలేరియస్‌గా ఉండటంతో.. పాత సినిమా మ్యాజిక్‌నే ఈ చిత్రం రిపీట్ చేస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. మరి.. వాటిని అందుకోవడంలో ఈ చిత్రం సఫలమైందా? లేదా? రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం!

కథ :
సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ అయిన వరుణ్‌ (శ్రీనివాస్ రెడ్డి), ఫ్యాషన్‌ డిజైనర్‌ అయిన పల్లవి (సిద్ధి ఇద్నానీ)లు ప్రేమించుకుని పె్ళి చేసుకుంటారు. కొంతకాలం వరకు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతుంది. ఆ తర్వాత ఇద్దరిమధ్య మనస్పర్థలు వస్తాయి. తరచూ గొడవలు జరుగుతుండడంతో.. ఇద్దరూ విడిపోవాలని ఓ నిర్ణయానికి వస్తారు. విడాకుల కోసం న్యాయవాది హరిశ్చంద్ర ప్రసాద్‌(పోసాని కృష్ణమురళి)ని వాళ్ళిద్దరూ సంప్రదిస్తారు. అప్పటికే 99 జంటలకు విడాకులిప్పించిన ఘనత ఉన్న హరిశ్చంద్ర.. ఆ జంటకి కూడా విడాకులిప్పించి, సెంచరీ కొట్టి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చేరాలని సంబరపడతాడు.

ఇంతలోనే హరిశ్చంద్ర ప్రసాద్‌ తన భార్యతో కలిసి గోవా టూర్‌కి వెళ్తాడు. అయితే.. మార్గమధ్యంలో ఓ ప్రమాదంలో వాళ్ళు చనిపోతారు. పైకి వెళ్లాక దేవుడు హరిశ్చంద్రను రానివ్వడు. ఇదేంటని ప్రశ్నిస్తే.. ‘నువ్వు విడగొట్టాలనుకున్న వందో జంటను కలిపితేనే నీ భార్య వద్దకు పంపుతాన’ని దేవుడు హరిశ్చంద్రని ఆదేశిస్తాడు. దీంతో.. అతను ఆత్మరూపంలో భువిలోకి దిగొస్తాడు. అప్పట్నుంచి వరుణ్, పల్లవిలను కలిపేందుకు నానాతంటాలు పడతాడు. అవన్నీ వర్కౌట్ కాకపోవడంతో చివరికి జంబలకిడి పంబ మంత్రం వేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ మంత్రం ఆ జంటపై ఎలాంటి ప్రభావం చూపింది? విడిపోవాలనుకున్న వరుణ్, పల్లవిలు తిరిగి ఒక్కటవుతారా? హరిశ్చంద్రని దేవుడు తిరిగి తన భార్య వద్దకు పంపుతాడా? వంటి విషయాల చుట్టూ ఈ సినిమా నడుస్తుంది.

విశ్లేషణ :
ప్రోమోలతోనే ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు. ఇక ప్రోమోలతో ఇదో హిలేరియస్ ఎంటర్టైనర్‌గా నిలుస్తుందనే ఆశలు రేకెత్తించారు. మంచి స్ర్కిప్ట్ ఎంచుకునే టేస్ట్ శ్రీనివాస్ రెడ్డికి ఉంది కాబట్టి.. ఈ మూవీ ఖచ్చితంగా ఎంగేజ్ చేస్తుందనే అంచనాలు జనాలు పెట్టుకున్నారు. తీరా సినిమా చూశాక ఆ ఆశలన్నీ నీరుగారిపోయాయి. కాన్సెప్ట్ వరకూ బాగానే ఉంది. అబ్బాయిల బాధలను అమ్మాయిలకి, అమ్మాయి బాధలేంటో అబ్బాయిలకు తెలియాలనే ఆలోచనతో దర్శకుడు ఈ కథను సిద్ధం చేసుకున్న తీరు బాగుంది కానీ.. దాన్ని తెరపై పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దడంలో విఫలమయ్యాడు.

ఫస్టాఫ్‌లో వినోదాన్ని బాగానే పండించాడు. వరుణ్‌, పల్లవిల గొడవల నేపథ్యంతో తొలి సగభాగాన్ని నడిపించి.. ప్రేక్షకుల్ని ఒకింత నవ్వించగలిగాడు. ఇతర కమెడియన్ల ఎపిసోడ్స్ కూడా నవ్వులు పూయించాయి. కానీ.. ఆ తర్వాతే కథ ఎంతకీ ముందుకు సాగదు. వచ్చే ప్రతి కామెడీ సీన్ బలవంతంగా నవ్వించడం కోసమే ఇరికించినట్లు అనిపిస్తుంది. అసలు ‘జంబలకిడి పంబ’ మంత్రమే ఇక్కడ తేడా కొట్టేసింది. దేహాలు మారాక శ్రీనివాస్ తనవంతు నవ్వించేందుకు ప్రయత్నించాడు కానీ.. చూస్తూ చూస్తూ ఒకానొక టైంలో ఆయన నటన విసుగు తెప్పించేస్తుంది. హీరోయిన్ చుట్టూ రాసుకున్న హీరోయిక్ సీన్లు కూడా ఓవర్‌గా ఉన్నాయి.

సరే.. వీటితో ఎలాగైనా బండి లాక్కొచ్చాడు కదా.. పతాక సన్నివేశాల్లోనైనా బలం చూపిస్తాడనుకుంటే.. అక్కడ కూడా దర్శకుడు తేలిపోయాడు. చాలా నాటకీయంగా ఆ సీన్లను చిత్రీకరించి.. సినిమాని సిల్లీగా చేసిపడేశాడు. కొత్తదనం చూపించకుండా రొటీన్‌గా సినిమాని నడిపించి.. జనాల అసహనాన్ని పరీక్షించాడు. ఈసారి ‘జంబలకిడి పంబ’ మంత్రం వర్కౌట్ అవ్వలేదు.

నటీనటుల పెర్ఫార్మెన్స్ :
శ్రీనివాస్ రెడ్డి తనవంతు ప్రతిభ చాటుకోవడానికి ప్రయత్నించాడు కానీ.. కథలో బలం లేకపోవడంతో అతని నటన తేలిపోయింది. కొన్ని చోట్ల అతని యాక్టింగ్ విసుగు తెప్పించేస్తుంది. కథానాయిక సిద్ధి ఇద్నానీకి ఇదే తొలి తెలుగు చిత్రమే అయినా.. చక్కటి అభినయంతో ఆకట్టుకుంది. అబ్బాయి హావభావాలతో కన్పించే సన్నివేశాల్లోనూ కాన్ఫిడెంట్‌గా నటించింది. పోసాని, వెన్నెల కిశోర్‌ పాత్రలు సినిమా మొత్తం కనిపించినా.. పూర్తిస్థాయి వినోదం పండించలేకపోయారు. ఇతర కమెడియన్ల పాత్రలు కూడా చాలావరకు తేలిపోయాయి.

సాంకేతిక ప్రతిభ :
స‌తీశ్ ముత్యాల‌ సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం కూడా బాగానే కుదిరింది. ఎడిటింగ్ విషయంలో ఇంకొంచెం దృష్టి పెట్టుంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు విషయానికొస్తే.. కాన్సెప్ట్ బాగానే ఎంచుకున్నా, కథ-కథనాన్ని రొటీన్‌గా రాసుకుని ఫెయిల్ అయ్యాడు. రుచిలేని సీన్లతో సినిమాని అల్లేసి.. ప్రేక్షకులకు చిరాకు తెప్పించేశాడు. అటు వినోదంలోనూ, ఇటు భావోద్వేగాల విషయంలోనూ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు.

చివరగా : ఈసారి ‘జంబలకిడి పంబ’ మంత్రం వర్కౌట్ అవ్వలేదు.
రేటింగ్ : 2.25/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.