‘మహానటి’ మూవీ రివ్యూ-రేటింగ్

సినిమా : మహానటి
నటీనటులు : కీర్తిసురేష్‌, దుల్కర్‌ సల్మాన్‌, సమంత, విజయ్‌ దేవరకొండ, మాళవికా నాయర్‌, కాజల్‌ అగర్వాల్‌, షాలిని పాండే, అవసరాల శ్రీనివాస్, జాగర్లమూడి కృష్ణ, మోహన్‌బాబు, నాని, నాగచైతన్య, ప్రకాష్ రాజ్, తదితరులు
దర్శకత్వం: నాగ్‌ అశ్విన్‌
నిర్మాత: స్వప్నాదత్‌, ప్రియాంక దత్‌
సంగీతం : మిక్కీ జె. మేయర్‌
ఛాయాగ్రహణం : డానీ శాంచెజ్‌ లోపెజ్‌
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు
బ్యానర్ ‌: వైజయంతీ మూవీస్‌, స్వప్న మూవీస్‌
రిలీజ్ డేట్ : 09-05-2018

లెజెండరీ నటి సావిత్రి నిజజీవితం ఆధారంగా రూపొందిన ‘మహానటి’ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. కీర్తి సురేష్ టైటిల్ రోల్‌లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై ముందునుంచే తారాస్థాయి అంచనాలున్నాయి. గొప్ప నటి లైఫ్ స్టోరీ ఆధారంగా రూపొందిన చిత్రం కావడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. మరి.. వాటిని అందుకోవడంలో ఈ మూవీ సక్సెస్ అయ్యిందా? లేదా? రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ :
బెంగుళూరులోని ఓ హోటల్‌లో ఉన్న సావిత్రి (కీర్తి సురేష్) తీవ్ర అనారోగ్యం పాలై కోమాలోకి వెళ్లిపోతుంది. ఆమెని ఆసుపత్రిలో చేర్చగా.. దాదాపు ఏడాదిపాటు కోమాలోనే ఉండిపోతుంది. అదే టైంలో ప్రజావాణి పత్రికలో విలేకరిగా చేరిన వాణి(సమంత)కి సావిత్రి కథ రాసే బాధ్యతను అప్పగిస్తారు. ఫొటో జర్నలిస్ట్‌ విజయ్‌ ఆంటోనీ(విజయ్‌ దేవరకొండ)తో కలిసి సావిత్రి గురించి వాణి పరిశోధన మొదలు పెడుతుంది. అసలు సావిత్రి పుట్టుపూర్వోత్తరాలు ఏంటి? గొప్ప నటిగా పేరుగాంచిన ఆమెకు ఎందుకు కష్టాలొచ్చాయి? బెంగళూరులో శంకరయ్యను కలవడానికి వచ్చిన సావిత్రికి ఏం జరిగింది? ఆమె కోమాలోకి వెళ్లడానికి కారణాలేంటి? అసలు శంకరయ్య ఎవరు? వంటి విషయాల్ని వాణి వెలుగులోకి తీసుకొచ్చే అంశాలతోనే ఈ సినిమా నడుస్తుంది.

విశ్లేషణ :
ఒక బయోపిక్ సినిమా తీయాలంటే మామూలు విషయం కాదు. చరిత్రని ఏమాత్రం వక్రీకరించకుండా.. ఎంతో పరిశోధన చేసి, జరిగిన వాస్తవాల్నే పర్ఫెక్ట్‌గా చూపించాలి. పైగా.. వినోదాన్ని కూడా సముపాళ్ళలో పండించాలి. ఎక్కడా గాడి తప్పకుండా వాస్తవికత ఉట్టిపడేలా డ్రామాని తెరపై పక్కాగా తెరకెక్కించాలి. ఈ విషయంలో దర్శకుడు నాగ్ అశ్విన్ నూటికి నూరుపాళ్లు విజయం సాధించాడు. సావిత్రి జీవితాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్ది.. తన ప్రతిభ చాటుకున్నాడు. ప్రేక్షకులు కోరుకునే వినోదాన్ని కూడా పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేసి.. తరతరాలు గుర్తుండిపోయేలా ఈ చిత్రాన్ని రూపొందించాడు. సావిత్రి బాల్యం మొదలుకొని, ఏ దశను వదిలి పెట్టకుండా జీవితం మొత్తాన్ని తెరపై ఎంతో చక్కగా చూపించాడు.

ఫస్టాఫ్ విషయానికొస్తే.. సావిత్రి బాల్యం, ఆమె నాటకజీవితం, సినిమా ఛాన్సుల కోసం చేసిన ప్రయత్నాలు, నటిగా ఎదిగిన క్రమ, ప్రేమ-పెళ్లి వ్యవహారాలతో నడుస్తుంది. ఈ సన్నివేశాల్ని నాగ్ అశ్విన్ వినోదం పంచుతూ ఎంతో చక్కగా తెరకెక్కించాడు. అక్కడక్కడ సెంటిమెంట్ సీన్లతో ఎమోషనల్ కూడా చేశాడు. ఎక్కడా బోర్ కొట్టించుకుండా మొదట్నుంచి ఇంటర్వెల్ దాకా ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా తీర్చిదిద్దాడు. ఇక సెకండాఫ్‌.. జెమినీ గణేశన్‌తో పెళ్లి, ఆ తర్వాత కూడా నటిగా ఆమె ఓ వెలుగు వెలగడం, అనంతరం భర్తతో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యసనాలు వంటి విషయాలతో సాగుతుంది. ఈ విషయాలన్నింటినీ దర్శకుడు తీర్చిదిద్దిన విధానం అమోఘం. పతాక సన్నివేశాలు ప్రతి ప్రేక్షకుడ్ని కట్టి పడేస్తాయి. మొత్తంగా సావిత్రి జీవితానికి గొప్ప నివాళిలా నిలిచే చిత్రమిది.

నటీనటుల ప్రతిభ :
సావిత్రిగా నటించిన కీర్తి సురేష్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! ఆమె ఇందులో నటించిందని చెప్పడం కంటే.. సావిత్రిగా జీవించేశారని చెప్పుకోవచ్చు. లుక్ పరంగా సావిత్రినే తలపించిన కీర్తి.. ఆమెలాగే అద్భుత నటన కనబరిచి, మైమరిపించేసింది. బహుశా ఆమె తప్ప ఈ పాత్రకి మరెవ్వరూ న్యాయం చేయలేరేమో అనేంతగా సావిత్రి పాత్రకు ప్రాణం పోసింది. జెమినీ గణేశన్‌గా దుల్కర్‌ సల్మాన్‌ చాలా బాగా నటించాడు. ఆయన శైలిలోనే హావభావాలను ప్రదర్శించాడు. సావిత్రి పెదనాన్న పాత్రలో రాజేంద్రప్రసాద్‌ నటన అమోఘం. జర్నలిస్ట్‌గా సమంత, ఫొటో జర్నలిస్ట్‌‌గా విజయ్ దేవరకొండ ఇద్దరూ తమ నటనాప్రతిభతో ఆకట్టుకున్నారు. ఎస్వీ రంగారావుగా మోహన్‌బాబు కనిపించేది కొన్ని సన్నివేశాల్లోనైనా.. ఆయన్నే తలపించేలా మోహన్‌బాబు నటన ప్రేక్షకులపై ప్రభావం చూపుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. సావిత్రి జీవితాన్ని ప్రభావితం చేసిన నిన్నటితరం సినీ ప్రముఖుల పాత్రలన్నీ తెరపై చూపించిన విధానం బాగుంది.

సాంకేతిక ప్రతిభ :
నటీనటుల్లాగే సాంకేతిక వర్గం ఈ మూవీకి జీవం పోసింది. ముఖ్యంగా.. ఆనాటి వాతావరణాన్ని తలపించేలా వేసిన సెట్టింగ్స్ అమోఘం. ఆకాలం నాటి నేపథ్యాన్ని సహజంగా మలిచిన ఆర్ట్ వర్క్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే! ఇక అందుకు జీవం పోసిన డానీ కెమెరా పనితనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! బ్లాక్‌ అండ్‌ వైట్‌ సన్నివేశాల్ని, ఆరోజులను గుర్తు చేసేలా రీల్‌ కెమెరాతో కొన్ని సీన్స్ తీర్చిదిద్దిన విధానం అదిరింది. మిక్కీ జె.మేయర్‌ అందించిన పాటలు, నేపథ్య సంగీతం కూడా అదిరిపోయాయి. నిర్మాణ విలువలకు ఎక్కడా వంక పెట్టడానికి లేదు. సాయిమాధవ్‌ బుర్రా రాసిన మాటలు ప్రేక్షకులతో చప్పట్లు కొట్టిస్తాయి. ఇక నాగ్‌ అశ్విన్‌ గురించి మాట్లాడుకుంటే.. కథను అల్లిన విధానం, దాన్ని తెరపై తీర్చిదిద్దిన తీరు అతని దర్శకత్వ ప్రతిభకు అద్దం పడతాయి.

చివరగా : మహానటి – ఇది సినిమా కాదు జీవితం
రేటింగ్ : 4/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.