‘మెంటల్ మదిలో’ మూవీ రివ్యూ-రేటింగ్

mental madhilo movie review rating

సినిమా : మెంటల్ మదిలో
నటీనటులు : శ్రీ విష్ణు, నివేథా పెతురాజ్, అమృత, శివాజీ రాజా, తదితరులు
రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాత: రాజ్ కందుకూరి
సంగీతం : ప్రశాంత్ విహారి
ఛాయాగ్రహణం : వేదరామన్
రిలీజ్ డేట్ : 24-11-2017

చిన్న చిన్న పాత్రలతో తన కెరీర్ ప్రారంభించిన శ్రీవిష్ణు.. ఆ తర్వాత ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రంతో లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. అందులో తన నటనటో కట్టిపడేయడంతో అతనికి మంచి గుర్తింపు లభించింది. అలాగే.. ‘ఉన్నది ఒకటే జిందగీ’లోనూ హీరో ఫ్రెండ్‌గా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ‘మెంటల్ మదిలో’ సినిమాతో సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ‘పెళ్ళిచూపులు’ నిర్మాత రాజ్ కందుకూరి నిర్మాణంలో కొత్త దర్శకుడు ఆత్రేయ తెరకెక్కించిన ఈ చిత్రంపై ముందునుంచే పాజిటివ్ బజ్ ఉంది. ఆల్రెడీ డీసెంటో ప్రోమోలతో ఆకర్షించిన ఈ సినిమాని రిలీజ్‌కి ముందే ప్రీమియర్ షోస్ వేయగా.. మంచి రిపోర్ట్ వచ్చింది. మరి.. ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఆడియెన్స్‌నూ అలరించడంలో సక్సెస్ అయ్యిందా? లేదా? రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం..

కథ :
అరవింద్ కృష్ణ (శ్రీవిష్ణు).. ఇతను చిన్నప్పటి నుంచి ‘కన్ఫ్యూజన్’ అనే రోగంతో బాధపడుతుంటాడు. అంటే.. రెండింటిలో ఏదైనా ఒకటి ఎంచుకోమని చెప్తే, ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలీక సతమతమవుతుంటాడు. ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న అరవింద్‌కి స్వేచ్ఛ (నివేథా పెతురాజ్) అనే అమ్మాయితో పెళ్ళి చేయాలని పెద్దలు నిర్ణయించుకుంటారు. ఆ పెళ్లిచూపుల్లో సందర్భంగా ఏర్పడిన ఆ ఇద్దరి పరిచయం.. ప్రేమదాకా వెళ్తుంది.

ఇక పెళ్ళికి సిద్ధమవుతున్న తరుణంలో.. జాబ్ అసైన్మెంట్లో భాగంగా ఢిల్లీకి వెళ్తాడు. అక్కడ అతడికి రేణు (అమృత) అనే అమ్మాయి పరిచయమవుతుంది. అమృతకి కూడా అరవింద్ ఆకర్షితుడవ్వగా.. ఆమె కూడా అరవింద్‌ని ప్రేమిస్తుంది. ఇలా స్వేచ్ఛ, రేణు ఇద్దిరినీ ప్రేమించిన అరవింద్.. ఏ అమ్మాయిని ఎంచుకోవాలో తెలియక అయోమయానికి గురవుతాడు. మరి.. ఆ ఇద్దరి అమ్మాయిల్లో అరవింద్ ఎవరిని ఎంచుకున్నాడు? అనేదే ఈ సినిమా కథ.

విశ్లేషణ :
ప్రోమోలు వచ్చినప్పుడే ఈ చిత్రం ‘పెళ్లిచూపులు’ తరహాలోనే చాలా సహజంగా ఉంటుందనే అభిప్రాయాలు వెలువడినట్లుగానే దర్శకుడు చాలా క్లీన్‌గా, నీటుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. నిజానికి.. ఓ అంశం చుట్టే 2 గంటలపాటు కథని అల్లడం అంతా ఆషామాషీ విషయం కాదు. కానీ.. కొత్త దర్శకుడు ఆత్రేయ హీరోకి ‘కన్ఫ్యూజన్’ అనే సమస్య పెట్టి, దానిచుట్టే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సినిమాని వినోదాత్మకంగా తెరకెక్కించాడు. ఈ విషయంలో అతనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

ఇక సినిమా విషయానికొస్తే.. ఫస్టాఫ్ మొత్తం హీరో-హీరోయిన్ల డిఫరెంట్ రొమాంటిక్ ట్రాక్, కడుపుబ్బా నవ్వించే కామెడీ ఎపిసోడ్‌లతో చాలా సరదాగా నడిచిపోతుంది. మొదట హీరోలో ఉన్న కన్ఫ్యూజన్ లోపాన్ని వివరిస్తూ చూపించిన కొన్ని సీన్లు హైలైట్‌గా వున్నాయి. అలాగే.. పెళ్లిచూపుల సన్నివేశం కూడా హిలేరియస్‌గా ఉంది. హీరోయిన్ నివేథా రాకతో ఈ చిత్రం మరింత ఆహ్లాదకరంగా మారుతుంది. ఇక ఇంటర్వెల్ కొద్దిపాటి షాక్‌తో ముగుస్తుంది. మొత్తంగా.. ఫస్టాఫ్ వేగంగా సాగిపోతుంది. దీనిలాగే సెకండాఫ్ కూడా ఉంటుందనుకుంటే.. కాస్త నిరాశ పరిచింది.

ఫస్టాఫ్‌లో ఉన్న ఎంటర్టైన్‌మెంట్ ద్వితీయార్థంలో పెద్దగా లేదు. అలాగని సినిమా బోరింగ్‌గా సాగదు.. ఫర్వాలేదనిపించేలా సాగుతుంది. అక్కడక్కడ కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. అయితే ప్రీ-క్లైమాక్స్ నుంచి కథ మళ్ళీ వేగం పుంజుకుంది. ఎండింగ్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. చాలా సహజంగా సినిమాని తెరకెక్కించడంతో ప్రతి పాత్రకి ఈజీగా కనెక్ట్ అయిపోతాం. కొత్తదనం కోరుకునే వారికి ఈ సినిమా మంచి ఛాయిస్.

నటీనటుల ప్రతిభ :
కన్ఫ్యూజన్‌తో సమస్యతో బాధపడే కుర్రాడి పాత్రలో శ్రీవిష్ణు బ్రహ్మాండంగా నటించాడు. అసలు వెండితెర మీద చూస్తున్నంతసేపూ.. విష్ణుని కాకుండా అరవింద్ అనే వ్యక్తిని చూస్తున్నట్లుగా సహజమైన నటనతో కట్టిపడేశాడు. ఓవరాల్‌గా చెప్పాలంటే.. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటిలోకంటే ఇది అతని కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్‌గా చెప్పుకోవచ్చు. ఇతనిలాగే హీరోయిన్ నివేథా పెతురాజ్ కూడా సహజ నటనతో ఆకట్టుకుంది. సిట్యువేషన్‌కి తగ్గట్టు హావభావాలు పలికి మెప్పించింది. మరో హీరోయిన్ అమృత కూడా చాలా బాగా చేసింది. శివాజీ రాజా చాన్నాళ్ల తర్వాత మంచి పాత్ర చేశాడు. ఆయన పాత్ర మొదట్లో బాగా నవ్విస్తుంది. శ్రీవిష్ణుకి, ఈయన మధ్య మంచి ఫన్ జనరేట్ అయ్యింది. ఇక మిగతా నటీనటులు మామూలే!

టెక్నికల్ పనితీరు :
సినిమాటోగ్రఫర్ వేదరామన్ తన కెమెరా పనితనంతో సినిమాకు అందమైన లుక్ తీసుకొచ్చారు. ప్రశాంత్ విహారి చిత్రానికి తగ్గట్టు సోల్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. నేపథ్య సంగీతం కూడా కొత్తగా, ప్లెజెంట్‌గా అందించాడు. నిర్మాత రాజ్ కందుకూరినిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు వివేక్ ఆత్రేయ గురించి మాట్లాడితే.. తన తొలి ప్రయత్నంతోనే అతను మంచి మార్కులు కొట్టేశాడు. చిన్న పాయింట్ చుట్టూ అతను అల్లిన కథ-కథనాలు, వెండితెరపై తీర్చిదిద్దిన తీరు అమోఘంగా అనిపిస్తాయి.

చివరగా : ‘కన్ఫ్యూజన్’తో మాంచి కిక్కిచ్చే సినిమా!
రేటింగ్ : 3.5/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.