నాగశౌర్య, సాయిపల్లవిల ‘కణం’ మూవీ రివ్యూ-రేటింగ్

సినిమా : కణం
నటీనటులు : నాగశౌర్య, సాయిపల్లవి, ప్రియదర్శి, తదితరులు
దర్శకత్వం : ఏ.ఎల్‌.విజయ్‌
నిర్మాత : అలీరాజా సుభాష్‌కరణ్‌
సంగీతం : శామ్‌ సీఎస్‌
సినిమాటోగ్రఫీ : నీరవ్‌ షా
ఎడిటింగ్‌ : ఆంథోని
బ్యానర్‌: లైకా ప్రొడక్షన్స్‌
రిలీజ్ డేట్ : 27-04-18

నాగశౌర్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘కణం’ మూవీపై ముందునుంచే మంచి ఎక్స్‌పెక్టేషన్స్ వున్నాయి. హీరో-హీరోయిన్లిద్దరికీ మంచి గుర్తింపే వుండటం, సినిమా నేపథ్యం డిఫరెంట్ అయి వుండటంతో.. జనాల్లో దీనిపై ఓ ఆసక్తి నెలకొంది. పైగా డిఫరెంట్ చిత్రాలు తీయడంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందడంతో దీనికి మరింత క్రేజ్ వచ్చిపడింది. మరి.. ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా? లేదా? రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం!

కథ :
కృష్ణ(నాగశౌర్య), తులసి(సాయిపల్లవి) ఇద్దరూ చదువుకుంటున్న రోజుల్లో ప్రేమించుకుంటారు. తమ రొమాంటిక్ జీవితాన్ని హ్యాపీగా గడుపుతారు. ఈ క్రమంలోనే ఇద్దరూ తొందరపడతారు. దీంతో తులసి గర్భం దాల్చుతుంది. ఈ విషయం తెలుసుకున్న కృష్ణ, తులసిల కుటుంబాలు అప్పుడే వాళ్ళకి పెళ్ళి చేసేందుకు ఇష్టం ఉండదు. ఇంకా స్టూడెంట్ జీవితమే గడుపుతున్నారు కాబట్టి.. లైఫ్‌లో సెటిల్ అయ్యాక పెళ్ళి చేయాలని నిర్ణయించుకుంటారు. దీంతో.. తులసిని బలవంతం చేసి అబార్షన్ చేయిస్తారు. తనకు ఇష్టం లేకపోయినా.. పెద్దోళ్ళ ఒత్తిడి మేరకు తులసి అబార్షన్ చేయించుకుంటుంది. అప్పట్నుంచి తులసి ముభావంగానే వుంటుంది. అయిదేళ్ళవరకు కృష్ణని, తులసిని కలవకుండా ఉంచుతారు.

కట్ చేస్తే.. కృష్ణ చదువు పూర్తి చేసుకుని, మంచి ఉద్యోగంలో చేరిన తర్వాత ముందుగా ఇరుకుటుంబాలు నిర్ణయించుకున్నట్లుగానే అతనికి తులసిని ఇచ్చి పెళ్ళి చేస్తారు. పెళ్ళయ్యాక కూడా తులసి అయిదేళ్ళ కిందట కడుపులోనే చనిపోయిన పాప (దియా) గురించి ఆలోచిస్తుంటుంది. ఆమెని ఆ బాధ నుంచి బయటపడేసేందుకు కృష్ణ ప్రయత్నిస్తాడు. అంతా సాఫీగా సాగుతుందనుకుంటున్న తరుణంలో.. ఇంట్లో అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఓ చిన్న పాప ఆత్మ ఇంట్లో వాళ్ళని ఒక్కొక్కరిగా చంపుతూ వుంటుంది. ఇంతకీ ఆ ఆత్మ ఎవరిది? ఎందుకు తులసి, కృష్ణ కుటుంబాలపై ఆ ఆత్మ పగ తీర్చుకుంటుంటుంది? ఈ ఆత్మ గురించి తెలుసుకున్న తులసి ఏం చేసింది? ఆ ఆత్మ నుంచి తన భర్తని, ఫ్యామిలీని ఎలా కాపాడుకుంది? అనేదే ఈ సినిమా కథ.

విశ్లేషణ :
భ్రూణ హత్యలను పాయింట్‌గా తీసుకుని దర్శకుడు ఏఎల్ విజయ్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈరోజుల్లో కడుపులో వుండగానే ఎన్నో పిండాలు బలైపోతున్నాయి కాబట్టి.. అలా చేయకూడదని సందేశం ఇవ్వడం కోసమే ఈ మూవీని తెరకెక్కించాడని తెలుస్తోంది. కడుపులో వుండే పిండానికీ ప్రాణం వుంటుందని.. తల్లిని చూసేందుకు అది తహతహలాడుతుందనే దానిపై ఈ మూవీని తీసిన దర్శకుడ్ని పక్కాగా అభినందించాల్సిందే! ఇదివరకు ఈ అంశాన్ని లేవనెత్తుతూ హారర్ జానర్‌లో చాలా సినిమాలే వచ్చాయి కానీ.. ఇక్కడ ఏఎల్ దర్శకుడు మరో కోణంలో చిత్రాన్ని రూపొందించి ప్రేక్షకుల్ని కదిలించాడు. కడుపులో పిండానిది ఆత్మ కావడం.. అమ్మ పిలుపు కోసం అది పరితపిస్తుండడం.. దాని చుట్టే భయం, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ని సముపాళ్ళలో జోడించి దర్శఖుడు ఆకట్టుకున్నాడు.

ఫస్టాఫ్ గురించి మాట్లాడుకుంటే.. హీరో-హీరోయిన్ల లవ్ ట్రాక్, అనుకోకుండా హీరోయిన్ గర్భం దాల్చడం, ఇరుకుటుంబాలు దాన్ని తీయించడం చుట్టే నడుస్తుంది. వీటి మధ్య కాస్త హాస్యాన్ని కూడా పండించాడు. ఇంటర్వెల్ ఎపిసోడ్ అందరినీ కదిలిస్తుంది. ద్వితీయార్థం విషయానికొస్తే.. ప్రారంభంలో కథ కాస్త నెమ్మదిస్తుంది. దియా టార్గెట్‌ ఏంటో తెలిశాక కాస్త బోర్‌గా అనిపిస్తుంది. పోలీసు విచారణ మొదలయ్యాక కథలో వేగం పుంజుకుంటుంది. ఇక క్లైమాక్స్ ఎపిసోడ్‌ని దర్శకుడు అంతుపట్టని విధంగా రాసుకున్నాడు. అక్కడ కూడా తల్లీకూతుళ్ల మధ్య ఎమోషనల్‌ బాండింగ్‌ను హైలైట్ చేసి.. హృదయాల్ని కదిలించాడు. ఓవరాల్‌గా.. అక్కడక్కడ కొన్ని మైనస్ పాయింట్స్‌ని తీసేస్తే, ప్రేక్షకుల్ని కదిలించే సినిమా ఇది!

నటీనటుల ప్రతిభ :
ఎప్పుడూ సరదా పాత్రల్లోనే కనిపించిన నాగశౌర్య ఈసారి సీరియస్‌ క్యారెక్టర్‌లో కనిపించాడు. సాయిపల్లవి మరోసారి ఆకట్టుకుంది. తల్లిగా, భార్యగా తన ఎమోషన్‌తో కట్టిపడేసింది. దియాగా నటించిన పాప విరోనికా నటన మెప్పిస్తుంది. ఇందులో ప్రియదర్శి ఎస్సైగా కనిపిస్తాడు. మొదట్లో అతని పాత్ర కామెడీగా అనిపించినా.. చివర్లో సీరియస్‌నెస్ వుంటుంది. మిగిలిన వాళ్లు పరిధి మేరకు నటించారు.

సాంకేతిక ప్రతిభ :
నీరవ్‌ షా సినిమాటోగ్రఫీ బాగుంది. శ్యామ్ నేపథ్య సంగీతానికి మంచి మార్కులు పడతాయి. ఎడిటింగ్ ఫర్వాలేదు. తక్కువ బడ్జెట్‌లో తీసినా.. అలాంటి ఫీలింగ్ కలగకుండా చాలా చక్కగా తీర్చిదిద్దారు. ఇక దర్శకుడు ఏఎల్ విజయ్ గురించి మాట్లాడితే.. భ్రూణ హత్యల నేపథ్యంలో రాసుకున్న ఈ కథని ఎక్కడా గాడి తప్పించకుండా అద్భుతంగా రూపొందించాడు. దర్శకుడి ఆలోచనకు, అతని తీర్చిదద్దిన విధానానికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే.

చివరగా : ప్రేక్షకుల్ని కదిలించే ‘కణం’
రేటింగ్ : 3/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.