శ్రీవిష్ణు, సాట్నా టైటస్‌ల ‘నీదీ నాదీ ఒకే కథ’ మూవీ రివ్యూ-రేటింగ్

సినిమా : నీదీ నాదీ ఒకే కథ
నటీనటులు : శ్రీ విష్ణు, సత్నా టిటస్‌, దేవీ ప్రసాద్‌, తదితరులు
కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం : వేణు వూడుగుల
నిర్మాత : ప్రశాంతి, కృష్ణ విజయ్‌
మ్యూజిక్ : సురేష్‌ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ : రాజ్‌ తోట, పర్వీజ్‌ కె
ఎడిటర్ : బి.నాగేశ్వరరెడ్డి
బ్యానర్‌ : ఆరాన్‌ మీడియా వర్క్స్‌, శ్రీ వైష్ణవి క్రియేషన్స్‌
విడుదల తేదీ: 23-03-2018

విభిన్న సినిమాలతో ప్రేక్షకుల మనుసుల్ని గెలుచుకున్న హీరో శ్రీవిష్ణు.. ఈసారి ‘నీదీ నాదీ ఒకే కథ’ సినిమాతో మనముందుకొచ్చాడు. ఇప్పటివరకు రిలీజైన ప్రోమోలతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాదు.. రిలీజ్‌కి ముందు డిఫరెంట్ ప్రమోషన్ కార్యక్రమాలతో ఈ మూవీపై మరింత అంచనాల్ని పెంచేశారు యూనిట్. ‘‘హీరో ఇంట్రడక్షన్‌, ఇంటర్వెట్‌ ట్విస్ట్‌లు, క్లైమాక్స్‌ ఫైట్లు, ఆఖరికి రాహుల్‌ ద్రవిడ్‌ యాడ్‌ కూడా లేని ఒక సామాన్యుడి కథ.. ఇది మా కథ.. మీ కథ’’ అంటూ గమనిక పెట్టిమరీ ప్రచారం చేయడం మరింత ప్లస్ అయ్యింది. మరి.. ఈ విభిన్న ప్రయత్నం ఎలా ఉంది ప్రేక్షకుల్ని మెప్పించిందా? ప్రచారం చేసినట్లు ఇది మనందరి కథేనా? శ్రీవిష్ణు మళ్ళీ జనాల్ని ఆకట్టుకోగలిగాడా? పదండి.. రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం!

కథ :
రుద్రరాజు సాగర్‌ (శ్రీ విష్ణు).. మధ్య తరగతి కుటుంబానికి ఓ యువకుడు. ఇతని తండ్రి రుద్రరాజు దేవీ ప్రసాద్‌(దేవీ ప్రసాద్‌) నాలుగుసార్లు ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకుంటే.. మనోడు మాత్రం చదువుల్లో పరమ పూర్. నాన్చుతూ నాన్చుతూ డిగ్రీ పరీక్షలు తన చెల్లెలితో కలిసి రాస్తాడు. మనోడికి చదువు ఏమాత్రం ఎక్కదు.. పరీక్షలంటే ఎంతో భయం.

కానీ.. తండ్రి ఆనందం కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో తననితాను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవడంతోపాటు ఆ క్లాస్‌లకు వెళ్తుంటాడు. కానీ.. అవన్నీ విఫలమవుతాయి. అసలు సాగర్ సమస్య ఏంటి..? తననితాను మార్చుకునే ప్రయత్నంలో సాగర్ ఏం తెలుసుకున్నాడు? ఇందులో భాగంగా ఇతని లైఫ్‌లోకొచ్చే సాట్నా టైటస్ ఎవరు? చివరగా తన తండ్రికి నచ్చేటట్లు సాగర్ స్థిరపడతాడా? జీవితానికి అతనిచ్చిన నిర్వచనం ఏంటి? అనే అంశాలతో సాగేతే ఈ మూవీ స్టోరీ.

విశ్లేషణ :
అవును.. ప్రమోషన్స్ టైంలో హీరో శ్రీవిష్ణు పదేపదే చెప్పినట్లుగా ఇది మన కథ.. మనందరి కథ. జీవితంలో స్థిరపడాలంటే చదువొక్కటే మార్గం కాదని.. మనకు ఆనందాన్ని ఏ పనైనా చేయొచ్చని.. మనకు నచ్చిన పనిచేయడంలోనే ఆనందం వుందనే విషయాన్ని మనసుకు హత్తుకునేలా చూపించాడు దర్శకుడు. అసలు జీవితం అంటే ఏంటి? అనే పరమార్థాన్ని ప్రతి ఒక్కరి మనసుల్లోకి చొచ్చుకుపోయేలా ఎంతో సున్నితంగా ఎంటర్టైన్ చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించాడు. సినిమా చూస్తున్నంతసేపూ మన లైఫ్ స్టోరీనే చూస్తున్నామా? అనేంత సహజంగా ఈ ‘కథ’ సాగుతుంది.

ఫస్టాఫ్ నుంచే ఎలాంటి సోదీ లేకుండా డైరెక్ట్ పాయింట్‌లోకి వెళ్ళిపోయాడు దర్శకుడు. మధ్యమధ్యలో కామెడీ, కాస్త లవ్ ట్రాక్‌లతో ట్రాక్ తప్పించకుండా పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దాడు. ఈ మూవీ మెయిన్ పాయింట్ ‘జీవితం’ చుట్టే తిరుగుతుంది కాబట్టి.. ప్రతి సన్నివేశంలోనూ దాన్నే హైలైట్ చేస్తూ చూపించాడు దర్శకుడు. ఇక్కడే అతనికి నూటికి నూరు శాతం మార్కులు పడ్డాయి. ఏదో కమర్షియాలిటీ కోసమని కాకుండా రియాలిటీని తలపించే రీతిలో ప్రతి సీన్‌ని తీర్చిదిద్ది.. మన మనసుల్ని బలంగా ఆకట్టుకున్నాడు. జీవితంలో స్థిర పడటం అంటే ఏంటి? అనే పాయింట్‌ని టచ్ చేస్తూ… వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, విజ్ఞులు చెప్పే మాటలు అన్నీ శుద్ధ దండగ అనే తెల్చి చెప్తూ.. లైఫ్‌ని ఎలా మలుచుకోవాలని అనే పాయింట్‌ని బ్రహ్మాండంగా తెరపై చూపించాడు దర్శకుడు.

ఇక హీరో శ్రీవిష్ణు చేసిన సాగర్‌ అనే కుర్రాడి పాత్రని దర్శకుడు మలిచిన విధానం ఆకట్టుకుంటుంది. ఈతరం కుర్రకారుకి సరిగ్గా మ్యాచ్ అయ్యేలా చూపించాడు. అంతేకాదు.. ప్రతీ సీన్‌ని ఎంతో సహజంగా తీర్చిదిద్దాడు. పతాక సన్నివేశాలు ఈ చిత్రాన్ని మరింత బలం చేకూర్చాయి. విద్యార్థుల మనస్తత్వాలు.. తల్లిదండ్రుల ఆలోచలు మారాలని చెప్పే చిత్రమే ఇది. చిన్న చిన్న ఆనందాలను వదులుకుని.. భవిష్యత్‌లో ఏదో కావాలని వెంపర్లాడే ఈ తరానికి గట్టి సందేశాన్నింది ఈ మూవీ. అందుకే.. ఇది ‘మనందరి కథ’ అయ్యింది.

నటీనటుల ప్రతిభ :
హీరో శ్రీవిష్ణు ఇదివరకే తన న్యాచురల్ యాక్టింగ్‌తో తానేంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఇందులో అంతకుమించిన నటనతో ఆడియెన్స్ హృదయాల్ని పిండేశాడు. తెరపై చూస్తున్నంతసేపూ మనకు ‘సాగర్’ అనే పాత్రే కనిపిస్తుంది తప్ప.. శ్రీవిష్ణు కాదు. అంతలా ఒదిగిపోయి.. ఆ పాత్రకి ప్రాణం పోశాడు హీరో! హీరోయిన్ సాట్నా టైటస్ పాత్రకీ ఇందులో ప్రాధాన్యం వుంది. ఆమె కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. హీరో తండ్రి పాత్రలో నటించిన దేవీ ప్రసాద్‌… ఒక మధ్య తరగతి తండ్రిగా సహజంగా నటించాడు. మిగతా నటీనటులు సైతం తమ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ప్రయత్నించారు.

టెక్నికల్ పెర్ఫార్మెన్స్ :
రాజ్‌ తోట, పర్వీజ్‌‌‌ల సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మన రియల్ లైఫ్‌కి తగినట్లుగా విజువల్స్‌ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. సురేష్‌ బొబ్బిలి అందించిన సంగీతం ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్. సంగీతం, వాటిల్లోన అర్థవంతమైన పదాలు కళ్ళు తెరిపిస్తాయి. పెద్దగా ఆర్భాటం లేకుండా చాలా సహజంగా సినిమాని తీర్చిదిద్దడమే మరో మేజర్ ప్లస్ పాయింట్. ఎడిటింగ్, ఆర్ట్ వర్క్స్ అన్నీ బాగా కుదిరాయి. నిర్మాణ విలువలూ బాగున్నాయి. ఇక దర్శకుడు విషయానికొస్తే.. అతను ఎంచుకున్న పాయింట్ బాగుంది. ఏదైతే చెప్పాలనుకున్నాడో.. ఆ విషయాన్ని పక్కదారి పట్టించకుండా, దర్శకుడిగా తన ట్యాలెంట్ చాటిచెప్పాడు.

చివరగా : ఇది మనందరి కథ!
రేటింగ్ : 3.5/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.