రవితేజ ‘నేల టిక్కెట్టు’ రివ్యూ-రేటింగ్

సినిమా : నేల టిక్కెట్టు
నటీనటులు : రవితేజ, మాలవిక శర్మ, జగపతి బాబు, బ్రహ్మాంనందం, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు
కథ-మాటలు-దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ
నిర్మాత : రామ్ తళ్ళూరి
సంగీత దర్శకుడు : శక్తికాంత్ కార్తిక్
సినిమాటోగ్రఫీ : ముకేష్.జి
ఎడిటర్ : ఛోటా కే.ప్రసాద్
బ్యానర్ : ఎస్ఆర్టీ ఎంటర్టైన్‌మెంట్స్
రిలీజ్ డేట్ : 25-05-2018

మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘నేల టిక్కెట్టు’. తొలి రెండు క్లాస్ మూవీలతో మంచి విజయాలు అందుకున్న కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. మాస్, క్లాస్.. ఈ రెండు కాంబినేషన్‌లు కుదరడంతో.. ఈ చిత్రంపై మొదట్నుంచే ఒకింత అంచనాలు ఏర్పడ్డాయి. అయితే.. ప్రోమోలు పూర్తిగా సంతృప్తిపరచకపోయినా, కాంబో చాలా క్రేజీ కావడంతో ఏదో కొత్తగా ఉంటుందనే ఆసక్తి జనాల్లో నెలకొంది. మరి.. ఆ అంచనాల్ని రీచ్ అవ్వడంలో ఈ మూవీ సక్సెస్ అయ్యిందా? లేదా? రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ :
రవితేజ ఒక అనాథ. తన చుట్టూ ఉండే జనాలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలనేదే ఇతని నైజం! అందుకే.. తనకు చేతనైనంత వరకూ నలుగురికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. కట్ చేస్తే.. హోమ్ మినిష్టర్ ఆదిత్య భూపతి (జగపతి బాబు) ఒక అవినీతి పరుడు. లెక్కలేనంత డబ్బులు సంపాదించాలనేదే అతని ఆశయం! ఇందుకోసం తనకు అడ్డొచ్చిన వాళ్ళని చంపేస్తుంటాడు. చివరికి.. ఛారిటీ పనులకు ఎక్కువ డబ్బులు వెచ్చిస్తున్నాడనే కారణంతో తన తండ్రినే చంపేస్తాడు ఆదిత్య!

కట్ చేస్తే.. తన పొరుగువారి సామాజిక సమస్యల్ని పరిష్కరించేందుకు రవితేజ ప్రభుత్వ, ప్రైవేట్ అధికారుల సహకారం తీసుకుంటాడు. ఈ ప్రాసెస్‌లోనే అతనికి ఆదిత్య భూపతి గురించి తెలుస్తుంది. నలుగురికీ మంచి చేయాలనే తనకు పూర్తి వ్యతిరేక నైజం గల వ్యక్తి అయిన భూపతికి బుద్ధి చెప్పాలని రవితేజ నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? తనకు అడ్డొచ్చేవారిని చంపే ఆదిత్య భూపతిని రవితేజ ఎలా హ్యాండిల్ చేస్తాడు? ఇంతకీ మాలవిక ఎవరు? ఈమె ఎందుకు రవితేజ లైఫ్‌లోకి వస్తుంది? అనే అంశాలతోనే ఈ సినిమా సాగుతుంది.

విశ్లేషణ :
ప్రోమోల ద్వారానే ఇదో రొటీన్ కమర్షియల్ సినిమా అని అర్థమైపోయింది. నలుగురికి మంచి చేసే హీరో.. అవినీతిపరుడైన రాజకీయ నాయకుడ్ని ఎలా ఎదుర్కొన్నాడనేదే ఈ చిత్రం కథ! ఇలాంటి స్టోరీలతో కొన్ని వేల సినిమాలొచ్చాయి. అయితే.. ప్రెజెంటేషన్ డిఫరెంట్‌గా, ఆసక్తికరంగా వుంటే.. జనాలు పక్కాగా రిసీవ్ చేసుకుంటారు. కథ పాతదైనా.. ఎంటర్టైన్‌మెంట్ ఉంటే జనాలు పాస్ మార్కులు వేస్తారు. ఇప్పటికే రెండు హిట్స్ సాధించిన కళ్యాణ్‌కి ఈ విషయం తెలిసే ఉంటుంది. అయినా ఎందుకో.. ‘టిక్కెట్టు’కి పెట్టిన ఖర్చుకి కనీస న్యాయం కూడా చేయలేకపోయాడు.

అసలే కథ పరమ రొటీన్.. అలాంటప్పుడు కామెడీని బాగా దట్టించడమో, రెండు-మూడు అంశాలు ప్రత్యేకంగా పెట్టడమో చేయాలి. కానీ.. కళ్యాణ్ అలా చేయకపోగా పాత చింతకాయ పచ్చడితో తల బద్దలుకొట్టుకునేలా చేశాడు. మాస్ ఎలిమెంట్స్‌తో ఒక మెసేజ్ ఇద్దామని ట్రై చేశాడు కానీ.. అది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పటికే ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజ.. ఈ సినిమాలో ఏం నచ్చిందని ఒప్పుకున్నాడో కూడా అర్థం కాలేదు. ‘చుట్టూ ఉన్న జనాలకు మంచి చేయడం’ అనే కాన్సెప్ట్ బాగానే ఉన్నా.. దాన్ని పర్ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేయడంలో కళ్యాణ్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు.

కామెడీ ఎక్కడా పండలేదు.. ఆ సీన్లు చూస్తే కామెడీ కోసం బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తుంది. అక్కడక్కడ పేలినా.. ఆ తర్వాత సీన్లు తుస్సుమనడంతో ఇంట్రెస్ట్ పోతుంది. హీరో-హీరోయిన్‌ల రొమాంటిక్ ట్రాక్ కూడా పెద్దగా ఏం బాగోలేదు. అసలు వీరి జోడీనే సెట్ అవ్వలేదు. రవితేజ పక్కన చిన్న పిల్లలాగా కనిపిస్తుంది. మొదట్లో కొంచెం ట్రాక్ బాగానే నడిచినా.. ఆ తర్వాత కథ సా…గుతూ పోతుంది. ప్రీ-ఇంటర్వెల్ నుంచి కాస్త ఇంట్రెస్టింగ్ టర్న్ ఇచ్చుకుంది. ఇంటర్వెల్‌లో వచ్చే ఛేజింగ్ సీన్ అదుర్స్! దాన్ని చాలా ల్యావిష్‌గా చిత్రీకరించారు. కానీ.. సినిమా ఔట్‌పుట్ బాగోలేకపోవడంతో అది వేస్ట్ అయిపోయింది.

ఇక రాజకీయ అంశాల చుట్టూ నడిపిన సీన్లైతే లాజిక్స్ లేకుండా నడిచిపోయాయి. అసలు గ్రౌండ్ వర్క్ చేయకుండా.. తనకు నచ్చినట్లు ఆ సీన్లని కళ్యాణ్ రాసేసినట్లు అనిపిస్తుంది. ఇక పాటలైతే సినిమాకి స్పీడ్ బ్రేకర్లుగా మారాయి. వినడానికి బాగానే ఉన్నా.. అవి వచ్చే సందర్భాలూ, పిక్చరైజేషన్ ఏమాత్రం కుదరలేదు. ఇలాంటి రొటీన్ సినిమాల క్లైమాక్స్ ఎలా ఉంటుందో.. ఈజీగా ఊహించేసుకోవచ్చు. ఎక్కడా ట్విస్టులు లేకుండా చాలా ఫ్లాట్‌గా సాగిపోయే రొటీన్ సినిమానే ‘నేల టిక్కెట్టు’. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇది పూర్తిగా నిరాశపరిచేసింది.

నటీనటుల ప్రతిభ:
రవితేజ ఎనర్జీ, ట్యాలెంట్ ఏంటో అందరికీ తెలుసు! ఏ పాత్ర ఇచ్చినా.. అందులో పూర్తిగా ఇమిడిపోయి, దానికి వందశాతం పూర్తి న్యాయం చేస్తాడు. కానీ.. ఇందులో మాత్రం ఆ బెస్ట్ కనిపించలేదు. క్యారెక్టరైజేషన్ పూర్‌గా ఉండటంతో.. పరిమితిగా నటించాల్సి వచ్చింది. చివరికి ముఖ్యమైన సీన్లలోనూ సరిగ్గా డెలివర్ చేయలేకపోయాడు. హీరోయిన్ మాలవిక శర్మ గ్లామరసం బాగానే పండించింది కానీ.. ఆమె రోల్ మాత్రం వేస్ట్ అయిపోయింది. గొప్పగా చెప్పుకునేంత ఆమె రోల్ ఏమీ లేదు. రవితేజ పక్కన మరీ యంగ్‌గా కనిపించడం మరో మైనస్ పాయింట్. విలన్‌గా జగపతిబాబు మరోసారి తన సత్తా చాటాడు కానీ.. క్యారెక్టరైజేషనే తేడా కొట్టేసింది. ఒక స్పెషల్ రోల్‌లో శరత్ బాబు పర్వాలేదు. పోసాని, జెపి, పృథ్వి, బ్రహ్మానందం పాత్రలు పూర్తిగా వేస్ట్ అయ్యాయి. మిగిలిన పాత్రలు గురించి కూడా గొప్పగా చెప్పడానికి ఏం లేదు.

సాంకేతిక ప్రతిభ:
ముకేష్ జి సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్‌ని కలర్‌ఫుల్‌గా, గ్రాండ్‌గా చూపించగలిగాడు. శక్తికాంత్ పాటలు ఫర్వాలేదు కానీ.. విజువల్‌గా బోర్ కొట్టించేశాయి. ఎడిటింగ్‌ జస్ట్ ఓకే.. కొన్ని చోట్ల కత్తెర వేయాల్సింది. నిర్మాణ విలువలు చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. ఇక కళ్యాణ్ గురించి మాట్లాడితే.. మనోడు ఎంచుకున్న స్టోరీ చాలా అంటే చాలా పాతది. దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం కూడా బాగలేదు. కొత్తదనం లేకుండా పాత సినిమాని చూసినట్లు ఉంటుంది. తొలి రెండు చిత్రాలతో ఆకట్టుకున్న కళ్యాణ్.. ఈసారి పూర్తిగా డిజప్పాయింట్ చేశాడు.

ప్లస్ పాయింట్స్ :
* రవితేజ
* ఇంటర్వెల్ ఛేజ్ సీన్

మైనస్ పాయింట్స్ :
* కథ, కథనం
* పాటల ప్రెజెంటేషన్ బాగోలేదు
* చాలా పాత్రలు వేస్ట్
* లాజిక్స్ లేని చాలా సీన్స్
* ఎంటర్టైన్‌మెంట్ ఏమీ లేదు

చివరగా : ‘నేల’ నాకించేసిన ‘టిక్కెట్టు’
రేటింగ్ : 2.25/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.