తన తండ్రి, నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవిత కథ ఆధారంగా ఓ బయోపిక్ చిత్రం చేయబోతున్నానని బాలయ్య గతేడాదిలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని హడావిడిగా చేయబోనని, సమగ్ర సమాచారం సేకరించి, పటిష్టమైన కంటెంట్ రెడీ, ఆ తర్వాతే సెట్స్ మీదకి తీసుకెళ్తానని ఆయనన్నారు. దీంతో.. ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వడానికి చాలా సమయమే పడుతుందని సినీజనాలు అనుకున్నారు. కానీ.. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ చిత్రాన్ని త్వరగా కంప్లీట్ చేయాలని బాలయ్య ఉబలాటపడుతున్నారు. ఆ దిశగా ఆయన ఆల్రెడీ పావులు కదిపినట్టు సమాచారం. నిన్నటివరకు ఈ ప్రాజెక్ట్‌పై మెల్లగా పావులు కదిపిన బాలయ్య.. ఇప్పుడు మాత్రం హడావిడి చేస్తున్నారు. ఇందుకు కారణం.. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మనే!
బాలయ్య తన తండ్రి బయోపిక్ మూవీ ప్రకటన చేసిన కొన్నాళ్ల తర్వాత సడెన్‌గా తానూ ఎన్టీఆర్ మీద ఓ చిత్రం తెరకెక్కిస్తున్నానని వర్మ సంచలన అనౌన్స్మెంట్ చేశాడు. ఈ ప్రకటన విని.. బాలయ్య-వర్మ ఈ బయోపిక్‌కి చేతులు కలిపారేమోనని అంతా భావించారు. కానీ.. ఇద్దరూ వేర్వేరుగా ఈ మూవీలు తీస్తున్నారని క్లారిటీ వచ్చేసింది. ట్విస్ట్ ఏంటంటే.. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంటరైనప్పటి నుంచి జరిగిన తతంగాన్ని కథగా మార్చి వర్మ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అంటే.. ఇందులో వివాదాస్పద అంశాలు కచ్ఛితంగా వుంటాయి. వర్మ కంపల్సరీ తన చిత్రాల్లో అలాంటివి చూపించకుండా వుండలేడు. ఇక వర్మ జెడ్ స్పీడ్ గురించి అందరికీ తెలిసిందే. ఎప్పుడు సెట్స్ మీదకి తీసుకెళ్తాడో, ఎలా కంప్లీట్ చేస్తాడో తెలీదు కానీ.. ఠక్కుమని రిలీజ్ డేట్ ప్రకటించేస్తాడు. ఈసారి అలా కాకుండా ఇతగాడు ఫిబ్రవరి నుంచి చిత్రాన్ని మొదలుపెడతానని ప్రకటించాడు. కానీ రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు.
ఒకవేళ వర్మ తీయబోయే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం మొదట రిలీజ్ అయితే.. బాలయ్య చేయబోయే బయోపిక్ మూవీకి పెద్దగా క్రేజ్ వుండదు. పైగా.. వర్మ తన చిత్రంలో ఎన్టీఆర్ నెగెటివ్ కోణం చూపించే ఛాన్స్ కూడా వుంది. అందుకే.. వర్మ మూవీ రావడం కంటే ముందే తాను తీయబోయే బయోపిక్ చిత్రం రిలీజ్ చేయాలని బాలయ్య ఫిక్సయ్యారు. అందుకే.. సినిమా పనులు శరవేగంగా స్టార్ట్ చేశారు. దర్శకుడు తేజ తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని వర్మకంటే ఒక నెల ముందే అంటే జనవరిలోనే సెట్స్ మీదకి తీసుకెళ్లాలని ప్లాన్. మరి.. వర్మ తన చిత్రాన్ని ముందుగా రిలీజ్ చేస్తాడా? లేదా బాలయ్యనా? తెలియాలంటే వేచి చూడాల్సిందే.