మంచు మనోజ్ ‘ఒక్కడు మిగిలాడు’ మూవీ రివ్యూ-రేటింగ్

Okkadu Migiladu Movie Review Rating

చిత్రం : ‘ఒక్కడు మిగిలాడు’
నటీనటులు : మంచు మనోజ్, అనీషా ఆంబ్రోస్, సుహాసిని, పోసాని కృష్ణమురళి, తదితరులు
రచన, దర్శకత్వం : అజయ్ నూతక్కి
నిర్మాతలు : ఎస్‌ఎన్ రెడ్డి, లక్ష్మీకాంత్
మ్యూజిక్ : శివ నందిగాం
సినిమాటోగ్రఫీ : రామరాజు
రిలీజ్ డేట్ : 10-11-2017

రాకింగ్ స్టార్ మంచుమనోజ్ గతకొన్నాళ్ల నుంచి సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. ప్రస్తుత ట్రెండ్‌కి తగినట్లుగానే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీలు చేస్తున్నప్పటికీ.. పరాజయాలు చవిచూశాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ‘ఒక్కడు మిగిలాడు’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. శ్రీలంకలో తమిళుల పోరాటం నేపథ్యంలో అజయ్ ఆండ్రూస్ నూతక్కి రూపొందించిన ఈ చిత్రం.. ప్రోమోలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. మరి.. ఈ చిత్రం ఆడియెన్స్‌ని ఆకట్టుకోవడంలో సక్సెస్ సాధించిందా? లేదా? రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం..

కథ :
శ్రీలంక నుంచి వచ్చిన శరణార్థుల్లో సూర్య (మంచు మనోజ్) ఒకడు. అతను యూనివర్శిటీలో పీజీ చేస్తుంటాడు. అదే యూనివర్శిటీకి చెందిన ఒక ప్రొఫెసర్, మంత్రి కొడుకుల కారణంగా ముగ్గురు అమ్మాయిలు ప్రాణాలు కోల్పోతారు. వారికోసం సూర్య న్యాయపోరాటం మొదలుపెడతాడు. అతడి పోరాటాన్ని ఆపేందుకు ఆ బడాబాబులు తమ అధికారంతో సూర్య, అతని స్నేహితులపై డ్రగ్స్ కేసులో ఇరికించేస్తారు. అప్పటినుంచి పోలీసులు వాళ్లని చిత్రహింసలకు గురిచేస్తుంటారు.

అయితే.. నిజాయితీ గల ఒక కానిస్టేబుల్ శివ (పోసాని కృష్ణమురళి) సహాయంతో సూర్య వారి బారి నుంచి తప్పించుకుంటాడు. శివ అప్పుడు సూర్యకి అతని కథేంటో, తాను పసివాడిగా ఎలాంటి పరిస్థితుల్లో శ్రీలంక నుంచి ఇండియాకు వచ్చాడో మొత్తం చెప్తాడు. అసలు ఆ కథేంటీ? ఆ కథ సూర్యలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? ఇక వర్తమానంలో అతడి పోరాటం ఎంతవరకు వచ్చింది? సూర్య న్యాయపోరాటానికి ఫలితం దక్కిందా? లేదా? అనే అంశాలతోనే ఈ సినిమా సాగుతుంది.

విశ్లేషణ :
ఒక చిత్రాన్ని వినోదాత్మకంగా, ఆడియెన్స్‌ని ఆకుట్టుకునేలా తెరకెక్కించాలంటే.. అందులోని ఎలిమెంట్స్‌ని ఓ లిమిట్‌లో చూపించాల్సి ఉంటుంది. ఫలానా ఎపిసోడ్‌ వద్ద సదరు ఎమోషన్ పెడితేనే బాగా వర్కౌట్ అవుతుంది. అలాకాకుండా కాస్త డోస్ ఎక్కువైనా, తగ్గినా దాన్ని భరించడం కష్టమవుతుంది. ‘ఒక్కడు మిగిలాడు’లోనూ అదే జరిగింది. ఇందులో ఉన్న యాక్షన్, సెంటిమెంట్ అంశాల్ని మరీ హద్దులు దాటిపోయేలా చూపించడంతో.. ఈ చిత్రానికి సరిగ్గా కనెక్ట్ అవ్వలేం.

నిజానికి.. దర్శకుడు నూతక్కి ఎంచుకున్న కథ, తాను చెప్పాలనుకున్న ఉద్దేశం మంచివే కానీ.. దాన్ని వెండితెరపై సరిగ్గా తీర్చిదిద్దలేకపోయాడు. ఒక జాతి పోరాటాన్ని, వారి కష్టాల్ని మరింత లోతుగా చూపించకపోగా.. కాల్పుల మోతతో, ఓవర్‌డోస్ సెంటిమెంట్‌తో ప్రేక్షకుల్ని ఇబ్బందికి గురిచేశాడు. శ్రీలంక నేపథ్యంలో సాగే ప్రథమార్ధంలో అసలు సమస్యను పెద్దగా చర్చించింది లేదు. శ్రీలంక సైన్యం వారిపై కాల్పులు జరపడం.. తమిళ టైగర్లు వారిని ఎదుర్కోవడం.. వంటి యాక్షన్ ఎపిసోడ్లతోనే దర్శకుడు నడిపించేశాడు. దీంతోపాటు సముద్ర ప్రయాణం నేపథ్యంలో సాగే ఎపిసోడ్ కూడా పెద్దగా కనెక్ట్ కాలేదు. కొన్ని సీన్లు హృదయాల్ని పిండేసినా.. మరీ 45 నిమిషాలపాటు ఆ కష్టాల్ని చూపించడంతో భరించడం కష్టమైపోతుంది. ఈ ఎపిసోడ్ ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురుచూసే పరిస్థితి వచ్చేస్తుంది.

ఫ్లాష్‌బ్యాక్ ఇలా సాగితే.. వర్తమానంలో సాగే కథ కూడా ప్రత్యేకతగా ఉండదు. కేవలం అరగంట మాత్రమే ఉండే ఈ ఎపిసోడ్‌కంటే.. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే కొన్ని సీన్లే ఎంగేజ్ చేస్తాయి. అలాగే.. ఎల్టీటీఈ వ్యవస్థాపకుడు ప్రభాకరన్ స్ఫూర్తితో తీర్చిదిద్దిన పీటర్ పాత్ర కూడా నిరాశ పరిచింది. ఆవేశంతో ఊగిపోయే డైలాగ్స్‌తోనే నడిపించేశారు కానీ.. ఆ పాత్రతో జనాల్ని కనెక్ట్ చేయలేకపోయారు. ఆరంభం నుంచి చివరిదాకా ఆ పాత్ర ‘అతి’గా ప్రవర్తిస్తూ ఉంటుంది. శ్రీలంక ఎపిసోడ్ చివర్లో కొంచెం ఎమోషన్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకున్నాయి. ఓవరాల్‌గా చూస్తే.. పూర్తిగా సంతృప్తి పరచలేకపోయింది. దీన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

నటీనటుల ప్రతిభ :
సూర్య, ప్రభాకరన్ స్ఫూర్తితో తీర్చిదిద్దిన పీటర్ పాత్రల్లో మంచుమనోజ్ బాగా వేరియేషన్స్ చూపించాడు. వీర లెవెల్లో డైలాగ్స్ చెప్తూ.. ఎనర్జిటిక్‌గా క్యారెక్టర్స్‌ని పండించాడు. కొన్నిచోట్ల రొమాలు నిక్కబొడుచుకునేలా వీరత్వం చాటిచెప్పాడు. అతని కెరీర్‌లో ది బెస్ట్ లెవెల్లో పెర్ఫార్మెన్స్ ప్రదర్శించాడు. హీరోయిన్ అనీషా ఆంబ్రోస్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదు. విక్టర్ అనే కీలక పాత్ర చేసిన దర్శకుడు అజయ్ నూతక్కి పరిణతితో నటించి మెప్పించాడు. అతడికి జోడీగా నటించిన జెన్నిఫర్ కూడా ఆకట్టుకుంటుంది. అలాగే.. పడవ ప్రయాణికుల్లో ఒకడిగా కుమరన్ పాత్రలో కనిపించిన నటుడు బాగా చేశాడు. పోసాని కృష్ణ మురళి తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటులు మామూలే!

సాంకేతిక పనితీరు :
రామరాజు సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని చోట్ల అతని పనితనం గుర్తించొచ్చు. శివ నందిగాం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేశాడు. ఎమోషనల్ సీన్స్ వద్ద టచ్ చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఫర్వాలేదు. ఎడిటింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ అజయ్ నూతక్కి గురించి మాట్లాడుకుంటే.. ఉద్దేశం మంచిదే అయినా దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. ఏ విషయంలోనూ సరైన మీటర్ పాటించలేదు.. లోతుగా సమస్యని చూపించలేదు. దీంతో.. ఈ చిత్రం ఇబ్బందికరంగా అనిపిస్తుంది.

చివరగా : అతి మిగిలింది.. అసలు పోయింది!
రేటింగ్ : 2.75/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.