ఆక్సిజన్ మూవీ రివ్యూ, రేటింగ్ & అనాలసిస్

చిత్రం : ఆక్సిజన్
దర్శకుడు : ఏఎమ్ జ్యోతికృష్ణ
ప్రొడ్యూసర్: ఎస్. ఐశ్వర్య
మ్యూజిక్ డైరెక్టర్: యువన్ శంకర్ రాజా
నటీనటులు: గోపీచంద్, రాశి ఖన్నా, అను ఇమ్మాన్యుయెల్, జగపతి బాబు

టాలీవుడ్ మ్యాచో మ్యాన్ గోపీచంద్ గత కొంత కాలంగా హిట్ కోసం చేయని ప్రయత్నాలు లేవు. సరైన హిట్‌ కోసం గోపీచంద్ చేసిన అన్ని సినిమాలపై చాలా నమ్మకం పెట్టుకున్నాడు. కానీ అతడి ప్రయత్నం ఏదీ కూడా సక్సెస్ కాలేదు. ఇక గోపీచంద్ రీసెంట్ మూవీ ‘గౌతమ్‌నంద’ కూడా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడటంతో తన లేటెస్ట్ మూవీ ‘ఆక్సిజన్’పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింద. మరి ఈ సినిమా గోపీచంద్ అంచనాలను ఎంతవరకు అందుకుందో రివ్యూలో చూద్దాం.

కథ:
అచ్యుతాపురం ఊరిపెద్దగా ఉన్న రఘుపతి(జగపతి బాబు)కు ఇద్దరు శత్రువులు ఉంటారు. వారి వల్ల తన ఫ్యామిలీకి ముప్పు ఉందని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తాడు. శృతి(రాశి ఖన్నా)కి విదేశీ సంబంధం చూసి పెళ్లి చేస్తే బాగుంటుందని చెప్పి ఓ అమెరికా సంబంధం చూస్తాడు. అలా కృష్ణప్రసాద్‌(గోపీచంద్‌) శృతిని చూడటానికి అమెరికా నుంచి రాజమండ్రి వస్తాడు. అయితే శృతికి ఊరునుంచి వెళ్లడం ఇష్టం లేకా కృష్ణప్రసాద్‌లో లోపాలు చూపిస్తూ.. సంబంధం చెడగొట్టాలని ప్లాన్ చేస్తుంటుంది. కానీ, కృష్ణ చాలా మంచివాడు. కుటుంబానికి బాగా దగ్గరవుతాడు. దాంతో శృతికి కృష్ణప్రసాద్‌కి పెళ్లి చేయాలని ఇంట్లో నిర్ణయిస్తారు. ఈలోగా శత్రువుల నుంచి కుటుంబానికి ముప్పు ఏర్పడుతుంది. ఆ ముప్పు నుంచి కృష్ణప్రసాద్‌ వారిని ఎలా రక్షించాడన్నదే ‘ఆక్సిజన్‌’ స్టోరీ.

విశ్లేషణ:
రొటీన్ కమర్షియల్ ‌ఎంటర్‌టైనర్‌ను తనదైనశైలిలో రూపొందించాడు దర్శకుడు జ్యోతికృష్ణ. ఆక్సిజన్ కథ మనం ఇదివరకే చూసినట్లుగా అనిపిస్తోంది. సినిమా ఫస్ట్ హాఫ్ సరదాగా సాగుతుంది.. ఇంటర్వెల్ ముందొచ్చే ట్విస్టు ఈ సినిమాకి మేజర్ అసెట్. అప్పటి వరకు సాదాసీదాలా సాగిన ఈ సినిమా, ఆ ట్విస్ట్‌తో రావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇక సెకండాఫ్‌లో సోషల్ మెసేజ్‌ను బేస్ చేసుకుని కథను నడిపించాడు దర్శకుడు. పొగతాగడం యువతరాన్ని ఎలా బలిగొంటోందో సెకండాఫ్‌లో చక్కగా చూపించాడు. దానికి తగ్గట్టే ‘ఆక్సీజన్‌’ అన్న టైటిల్‌ని పెట్టారు.

ఫస్ట్‌హాఫ్ ట్విస్టును చూసిన ప్రేక్షకుడు చాలా థ్రిల్ ఫిల్ అవుతాడు. అలాంటి ట్విస్టులు మరో రెండు మూడు ఉంటే బాగుండేది అని అనుకుంటాడు. కేవలం ఇంటర్వెల్ బ్యాంగ్‌ను నమ్ముకుని సినిమా మొత్తాన్ని తీసినట్లు అనిపిస్తోంది. కామెడీ సీన్స్ మరి కొన్ని ఉంటే బాగుండేది. దర్శకుడు రాసుకున్న కథకు, తీసిన విదానానికి ఎక్కడా సంబంధం లేకపోవడంతో సగటు ప్రేక్షకుడు అసహనానికి గురవుతాడు. మొత్తానికి ‘‘పొగతాగడం ఆరోగ్యానికి హానికరం’’ అనే చిన్న పాయింట్‌తో రెండున్నర గంటల సినిమాను తీసేసి హిట్ కొట్టాలని చూస్తున్న గోపీచంద్‌కు మరి ఎలాంటి రిజల్ట్ లభిస్తుందో వేచి చూడాలి.

నటీనటుల పర్ఫార్మెన్స్:
గోపీచంద్ ఈ సినిమాలో రెండు పాత్రల్లో తనదైన యాక్టింగ్‌తో మెప్పించాడు. ఫస్టాఫ్‌లో చాలా బుద్ధిమంతుడిగా.. సెకండాఫ్‌లో యాక్షన్ హీరోగా ఇరగదీశాడు. ఎమోషనల్ సీన్స్‌లో కూడా గోపీచంద్ యాక్టింగ్ అదరహో అనిపిస్తుంది. ఇక హీరోయిన్లు రాశి ఖన్నా, అను ఇమ్మాన్యుయెల్ ఇద్దరూ ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్. వీరిద్దరు తమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. యాక్టింగ్‌తో పాటు అందాల ఆరబోతలోనూ ఇద్దరూ ఇద్దరే. ఇక జగపతి బాబు కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. మిగతా నటీనటులు వారి పాత్రలకు పూర్తి న్యాయం చేసారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు జ్యోతికృష్ణ రాసుకున్న స్క్రిప్ట్ చాలా బాగుంది. కానీ అతడు దానిని ఎలివేట్ చేయడంలో అనుకున్న స్థాయిలో అతడు సక్సెస్ కాలేకపోయాడు. కేవలం ఇంటర్వెల్ బ్యాంగ్‌ను నమ్ముకుని సినిమాను హిట్ చేయాలని చూసిన జ్యోతికృష్ణకు ‘ఆక్సిజన్’ ఓ మంచి చిత్రంగా మిగలడం మాత్రం ఖాయం. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

చివరిగా: ఆక్సిజన్ – గోపీచంద్‌ ఊపిరి పీల్చుకున్నాడు!

నేటిసినిమా రేటింగ్: 3/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.