రాజ్‌తరుణ్, అమైరా దస్తూర్‌ల ‘రాజుగాడు’ మూవీ రివ్యూ-రేటింగ్

సినిమా : రాజుగాడు
నటీనటులు : రాజ్‌తరుణ్‌, అమైరా దస్తూర్‌, రాజేంద్రప్రసాద్‌, సితార, ప్రవీణ్‌, తదితరులు
స్క్రీన్‌ప్లే – దర్శకత్వం : సంజనా రెడ్డి
నిర్మాత : సుంకర రామబ్రహ్మం
సంగీతం : గోపీ సుందర్‌
సినిమాటోగ్రఫీ : బి.రాజశేఖర్
ఎడిటర్ : ఎం.ఆర్.వర్మ
బ్యానర్ : ఏకే ఎంటర్టైన్‌మెంట్
విడుదల తేదీ : 01-06-2018

యంగ్ హీరోల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళలో రాజ్ తరుణ్ ఒకడు. కెరీర్ స్టార్టింగ్‌లోనే హ్యాట్రిక్ హిట్ కొట్టి.. మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కానీ ఆ తర్వాత కాస్త తడబడ్డాడు. సరైన సబ్జెక్ట్స్ ఎంచుకోక హిట్-ఫ్లాప్స్ మధ్య సతమతమయ్యాడు. చివరగా ‘అంధగాడు’తో ఒకింత మెప్పించినా.. అది పూర్తిగా జనాల్ని సంతృప్తినివ్వలేదు. ఇక ఆ తర్వాత చేసిన ‘రంగుల రాట్నం’ ఫ్లాప్‌గా నిలిచింది. అందుకే.. ఈసారి ఎలాగైనా సత్తా చాటుకోవాలన్న ఉద్దేశంతో ‘రాజుగాడు’గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తనకు తెలియకుండానే దొంగలించే లోపం ఉన్న హీరోగా రాజ్ తరుణ్ నటించిన ఈ మూవీ ప్రోమోలు ఆడియెన్స్‌ని బాగానే ఆకట్టుకోగలిగాయి. మరి.. సినిమా కూడా ఎంటర్టైన్ చేయగలిగిందో లేదో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ :
రాజు(రాజ్‌తరుణ్‌)కి చిన్నప్పటి నుంచి తనకు తెలియకుండానే దొంగతనాలు చేసే జబ్బు ఒకటి ఉంటుంది. దీని బారినుంచి బయటపడేందుకు ఎంతమంది వైద్యులకు చూపించినా ఫలితం ఉండదు. అతను పెద్దవాడయ్యేకొద్దీ ఆ జబ్బు మరింత పెరుగుతూ వుంటుందే తప్ప తగ్గదు. ఇలాంటి జబ్బుతో బాధపడుతున్న రాజు ఓసారి తన్వి (అమైరా దస్తూర్)ని చూసి ప్రేమిస్తాడు. ఆమెని తకూ తన ప్రేమలో పడేస్తాడు.

అయితే.. తనకున్న జబ్బు గురించి తెలిస్తే ఎక్కడ తన్వి దూరమవుతుందనే భయంతో.. ఆ విషయం తెలియకుండా దాస్తాడు. వీళ్ళ ప్రేమ గురించి తెలుసుకున్న పెద్దలు.. పెళ్లి చేయడానికి ఇష్టపడతారు. అయితే.. తన్వి తాత (నాగినీడు)కి దొంగలంటే ఇష్టం ఉండదు. ఊర్లో ఎవరు దొంగతనం చేసినా సరే.. చేతులు నరికేస్తుంటాడు. ఈయన పదిరోజులపాటు తన్వి ఇంట్లో ఉండాల్సి వస్తుంది. తన్వి తాత గురించి తెలిసిన రాజు.. తానో దొంగనని తెలియకుండా ఏం చేశాడు? తనకున్న జబ్బు గురించి తెలియకుండా తన్వి ఇంట్లో వాళ్ళ మనసుల్ని ఎలా గెలుచుకున్నాడు? అనే అంశాలతో సినిమా సాగుతుంది.

విశ్లేషణ :
హీరోలకు లోపం ఉన్న కాన్సెప్ట్ సినిమాలు ఇదివరకే వచ్చాయి. ‘భలేభలే మగాడివోయ్‌’, ‘మహానుభావుడు’ ఆ కోవకి చెందినవే! ఆ రెండు సినిమాల్లో హీరోలకున్న లోపం చుట్టూ వినోదం బాగా పండించి.. ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్నారు. ‘రాజుగాడు’ కూడా అదే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం కాబట్టి.. ఆ రెండు మూవీల్లాగే ఇది కూడా వినోదమే ప్రధానంగా సాగుతుందని అందరూ ఆశించారు. ప్రోమోల్లోనూ అదే హైలైట్ చేయడంతో.. ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చని అనుకుంటారు. కానీ.. ఆశించినంత వినోదాన్ని దర్శకురాలు సంజన పండించలేకపోయింది.

కథను ప్రారంభించిన విధానం, కథలోకి తీసుకెళ్లిన పద్ధతి వినోదాత్మకంగా బాగానే ఉన్నాయి కానీ.. ఆ తర్వాత ఎంటర్టైన్‌మెంట్ డోస్ బాగా తగ్గింది. సినిమా నడిచేకొద్దీ బోర్‌గా తయారవుతుంది. సన్నివేశాల్లో బలం, వినోదం లేకపోవడంతో ప్రేక్షకులు అసహనానికి గురవుతారు. పాత్రల మధ్య సంఘర్షణ కూడా సరిగ్గా కుదరలేదు. సరే.. ఫస్టాఫ్ ఎలాగోలా సాగిపోయిందనుకుంటే, సెకండాఫ్‌ని మరింత సా….గదీశారు. ఎక్కడ వినోదాన్ని పంచకపోగా.. బాగా బోర్ కొట్టించేశారు. ఇలాంటి సినిమాల్లో లాజిక్స్ అంతగా పనిచేయవు. కానీ.. ఇందులో మరీ విడ్డూరంగా లాజిక్స్ లేకుండా సీన్లను చిత్రీకరించిన విధానం చూస్తే బాబోయ్ అనిపించకమానదు.

ఇక కామెడీ కోసం అన్నట్లు కొన్ని ఎపిసోడ్స్‌ని కావాలనే ఇరికించి.. ఆడియెన్స్‌ సహనంతో ఫుట్‌బాల్ ఆడేసుకున్నారు. అసలు కొన్ని సీన్లైతే ఎందుకు పెట్టారో కూడా అంతుచిక్కని విషయం. పోనీ క్లైమాక్స్ అయినా ఆకర్షణీయంగా ఉందా అంటే అదీ లేదు. దాన్ని కూడా పేలవంగా చిత్రీకరించి.. దీంతోనే అడ్జస్ట్ అయిపోండన్నట్లుగా రూపొందించారు. ఓవరాల్‌గా చూస్తే.. ఈ రాజుగాడు బాగా విసిగించేశాడు.

నటీనటుల ప్రతిభ :
మునుపటిలాగా ఈ సినిమాలో రాజ్ తరుణ్ పెద్దగా హుషారుగా కనిపించలేదు. పాత్రలో అంత బలం లేకపోవడం వల్లే మనోడు చాలా డల్‌గా కనిపించినట్లు అనిపిస్తుంది. అమైరా పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఏదో హీరోయిన్ ఉండాలన్నట్లుగా ఆమె పాత్రని పెట్టారంతే! రాజ్‌, అమైరా కెమిస్ట్రీ కూడా ఏం అంతగా పండలేదు. రాజ్‌తరుణ్‌కు తండ్రిగా నటించిన రాజేంద్రప్రసాద్‌ మాత్రం ఎప్పట్లాగే తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. ఇతర నటీనటులు కూడా తమవంతు పూర్తి న్యాయం చేసేందుకు ప్రయత్నించారు.

టెక్నికల్ పెర్ఫార్మెన్స్ :
బి.రాజశేఖర్ కెమెరా పనితనం బాగుంది. ప్రతి విజువల్‌ని కలర్‌ఫుల్‌గా చూపించారు. గోపీసుందర్ అందించిన బాణీలు బాగున్నాయి. నిర్మాణ విలువలు అదిరిపోయాయి. దర్శకురాలు సంజన ఎంచుకున్న స్టోరీలైన్ బాగానే ఉన్నప్పటికీ.. సీన్లలో బలం లేకపోవడం, వినోదం పండించలేకపోవడంతో సినిమా తేలిపోయింది.

చివరగా : చిరాకు తెప్పించిన ‘రాజుగాడు’
రేటింగ్ : 2/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.