రామ్‌చరణ్, సుకుమార్‌ల ‘రంగస్థలం’ మూవీ రివ్యూ-రేటింగ్

సినిమా : రంగస్థలం
నటీనటులు : రామ్ చరణ్, సమంత, జగపతి బాబు, ఆది పినిశెట్టి, అనసూయ, పూజిత, ప్రకాష్ రాజ్ తదితరులు
రచన – దర్శకత్వం : సుకుమార్
నిర్మాతలు : నవీన్ యేర్నేని, వై.రవి శంకర్, మోహన్ చెరుకురి
సంగీతం : దేవిశ్రీప్రసాద్
ఎడిటర్ : నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ : రత్నవేలు
బ్యానర్ : మైత్రీ మూవీ మేకర్స్
రిలీజ్ డేట్ : 30-03-2018

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రంగస్థలం’ చిత్రం ఎట్టకేలకు ఈ శుక్రవారం (30-03-2018) విడుదల అయ్యింది. రామ్ చరణ్ చెవిటోడలా నటించడం.. సుకుమార్‌లాంటి క్రియేటివ్ డైరెక్షన్‌లో రూపొందడం.. 1980 విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కడంతో.. ఈ చిత్రంపై తారాస్థాయి అంచనాలు నెలకొన్నాయి. మరి.. వాటిని అందుకోవడంలో ఈ చిత్రం సక్సెస్ అయ్యిందా? లేదా? రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం పదండి…

కథ :
రంగస్థలం అనే ఊరిలో చిట్టిబాబు (రామ్ చరణ్) డీజిల్ ఇంజన్ ద్వారా పొలాలకు నీళ్ళు పెడుతూ హాయిగా జీవిస్తుంటాడు. చెడిటోడు అయినా.. ఆ లోటుని పట్టించుకోకుండా సరదాగా లైఫ్‌ని లీడ్ చేస్తుంటాడు. అదే ఊరిలో ఉంటున్న రామలక్ష్మి (సమంత)ని ప్రేమిస్తాడు చిట్టిబాబు.

ఇదిలావుండగా.. ఆ ఊరి ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి (జగపతిబాబు) పరమ దుర్మార్గుడు. 30 ఏళ్ళు ఎదురులేకుండా ప్రెసిడెంట్‌గిరి చెలాయిస్తున్న ఈయన.. ప్రజల్ని పీడిస్తుంటాడు. ప్రభుత్వ సొసైటీని సొంత ఆస్తిలాగా భావిస్తూ.. అధిక వడ్డీలకి అప్పులిస్తూ.. జనాల్ని హింసిస్తుంటాడు. ఇతని ఆగడాల్ని అరికట్టాలని.. చిట్టిబాబు అన్న కుమార్‌బాబు (ఆది) సర్పంచ్ ఎన్నికల్లో జగపతికి పోటీగా ఎన్నికల్లో నిలబడతాడు.

అది నచ్చని జగపతి.. కుమార్‌ని పోటీ నుంచి తప్పించేందుకు ఓ పన్నాగం రచిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? జగపతి ప్లాన్ ఫలించిందా? చిట్టిబాబు తన అన్నయ్యని కాపాడుకోగలిగాడా? చివరికి ఏమవుతుంది? అనే అంశాల చుట్టే ఈ సినిమా కథ.

విశ్లేషణ :
ఈ సినిమా కథ కొత్తదేమీ కాదు. ఈ స్టోరీలైన్‌తో ఇప్పటికే వందలకొద్ది సినిమాలొచ్చాయి. ప్రజల్ని పీడించే ప్రెసిడెంట్.. హీరో అతనికి ఎదురు తిరగడం.. ఎన్నికల నేపథ్యంలో గొడవలు జరగడం.. చివరికి హీరో నెగ్గడం.. అనే రొటీన్ అంశాల చుట్టే ఈ కథ నడుస్తుంది. కానీ.. ఈ రొటీన్‌కి భిన్నంగా గ్రామీణ నేపథ్యాన్ని ఎంచుకోవడమే సుకుమార్ క్రియేటివిటీకి అద్దం పడుతుంది. ప్రేక్షకుల్ని 38 ఏళ్ళకి అంటే 1980కి తీసుకెళ్ళి.. మంచి గ్రామీణ కథతో ఎంగేజ్ చేయగలిగాడు. కథలో ఫ్రెష్‌నెస్ తీసుకొచ్చి.. ఆకట్టుకోగలిగాడు.

ఫస్టాఫ్ విషయానికొస్తే.. మొదటి నుంచి ఇంటర్వెల్ దాకా సినిమాని బ్రహ్మాండంగా నడిపించాడు సుక్కు. ఆ గ్రామీణ అందాలు, కామెడీ ఎపిసోడ్స్, చరణ్-సమంతల ఫ్రెష్ రొమాంటిక్ ట్రాక్, పాటలు.. అన్నీ బాగా కుదిరాయి. చరణ్ తన వినికిడి లోపంతో ఆద్యంతం ఆకట్టుకున్నాడు. ఆ లోపం చుట్టూ సుక్కు రాసుకున్న ఎపిసోడ్స్ ఆసక్తికరంగా వున్నాయి. గ్రామీణ అందాల్ని భలే చూపించారు. అంతేకాదు.. కళ్ళకు కట్టినట్లుగా 1980 ఫార్మాట్ చుట్టే సినిమాని నడిపించి.. వావ్ అనిపించారు. ఆ విషయంలో సుక్కు, మేకర్స్‌కి 100 మార్కులు పడతాయి. ఈ గ్రామీణ నేపథ్యం ఆడియెన్స్‌ని బాగా ఆకట్టుకుంది. అసలే ఏమాత్రం టైం తెలియకుండా ఫస్టాఫ్ అయిపోతుంది. ఇంటర్వెల్ వద్ద వచ్చే ఎపిసోడ్.. సెకండాఫ్‌పై ఆసక్తి పెంచుతుంది.

ఇక సెకండాఫ్ విషయానికొస్తే.. సుక్కు లెక్కల గాడి తప్పింది. ఫస్టాఫ్‌లాగా సెకండాఫ్‌ని ఎంగేజింగ్‌గా తీర్చదిద్దలేకపోయాడు. ఎమోషనల్ సీన్స్‌తో సా…గదీశాడు. కొన్నిచోట్ల బాగా బోర్ కొట్టించేస్తుంది. కథనం ఏమాత్రం పుంజుకోగా.. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. ‘జిగేల్ రాణి’ పాటతో కథ ఆసక్తికరంగా టర్న్ తీసుకుంటుంది. కథ వేగం పెరుగుతుంది. ఇక క్లైమాక్స్ ఎపిసోడ్ అదిరిపోయింది. ఎప్పట్లాగే సుక్కు తనదైన మార్క్ స్టైల్‌లో ఒక మంచి ట్విస్ట్‌తో ముగించాడు. ఈ ఎపిసోడ్ ఖచ్చితంగా ఆడియెన్స్‌ని కట్టిపడేస్తుంది. కానీ.. ఫస్టాఫ్‌లాగా సెకండాఫ్ పూర్తిగా ఎంగేజ్ చేయలేదు. ఎంటర్టైన్‌మెంట్ డోస్ తగ్గింది. మొదట్లో సా…గే బోరింగ్ ఎపిసోడ్స్‌ని పక్కనపెడితే.. ఆ తర్వాత మూవీ బాగుంది.

సుకుమార్ ఎంచుకున్న కథ రొటీన్ అయినా.. తన మార్క్ స్టైల్‌లో ప్రేక్షకుల అంచనాలకి తగ్గట్టు తీర్చదిద్దగలిగాడు. కానీ.. సెకండాఫ్‌లో ఆ సాగతీత లేకుండా వుండుంటే.. మూవీ మరింత క్రిస్పీగా వుండేది. క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా తమిళ సినిమాల స్టైల్‌లో వుంది. అన్నట్లు చెప్పడం మరిచితిని.. ప్రమోషన్స్‌లో బాగా డప్పు కొట్టుకున్నట్లుగా అనసూయ చేసిన రంగమ్మత్త పాత్ర ఇందులో బిగ్ సర్‌ప్రైజ్. ఆమె క్యారెక్టర్ అందరినీ ఆకట్టుకోవడం పక్కా!

నటీనటుల పెర్ఫార్మెన్స్ :
అవును.. సమంత చెప్పినట్లుగా రామ్ చరణ్ ఈ సినిమాకి ముందు, ఈ మూవీకి తర్వాత అన్నట్లుగా తన నటవిశ్వరూపం ప్రదర్శించాడు. తనకు హావభావాలు పలకడానికి రాదు అన్నోళ్ళకి చెంపఛెళ్ళుమనేలా సమాధానం ఇచ్చాడు. ప్రతి సీన్‌కి తగ్గట్టు ఎమోషన్స్‌ని ఫేస్‌పై పలికిస్తూ.. ఔరా అనిపించాడు. చెవిటోడిలా చిట్టిబాబు పాత్రకి 100 శాతం న్యాయం చేశాడు. ఇతరుల్ని ఊహించుకోవడం సంగతేమో గానీ.. చరణ్ మాత్రం ఈ పాత్రలో జీవించేశాడు. తన కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రామలక్ష్మి పాత్రలో సమంత కూడా అదరగొట్టేసింది. ఒక పల్లెటూరి అమ్మాయి ఎలా వుంటుందో.. అచ్చం అలాగే కనువిందు చేస్తూ సమంత బాగా చేసింది.

జగపతిబాబు ఎప్పట్లాగే మరోసారి విలనిజం పండించాడు. చూస్తున్న ప్రేక్షకులకు అసహ్యం కలిగేలా ఆ పాత్రలో క్రూరత్వం చూపించాడు జగపతి. ఆది పినిశెట్టి సెటిల్డ్ పాత్రలో బాగా చేశాడు. అనసూయ ఈ మూవీకి స్పెషల్ ప్యాకేజ్ వంటిది. ఇది ఆమె కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయే రోల్ అని చెప్పుకోవచ్చు. మిగతా నటీనటులు కూడా తమ బెస్ట్ ఇవ్వడానికి బాగా ప్రయత్నించారు. ఎవ్వరినీ వంక పెట్టడానికి వీలు లేకుండా బెస్ట్ ఔట్‌పుట్ ఇచ్చారు.

టెక్నికల్ పెర్ఫార్మెన్స్ :
రత్నవేలు సినిమాటోగ్రఫీ ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్ళింది. ఆనాటి గ్రామీణ నేపథ్యాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు. అతని కెమెరా పనితనానికి హ్యాట్సాఫ్ చెప్పకుండా వుండలేం. దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికే సూపర్‌హిట్ అయ్యాయి. బ్యాక్‌గ్రౌండ్ కూడా అదరగొట్టేశాడు. పాటల రచయిత చంద్రబోస్ మంచి సాహిత్యం అందించారు. సెకండాఫ్‌లో ఎడిటింగ్‌పై శ్రద్ధా పెట్టాల్సింది. సా..గతీత సీన్లపై కోత వేయాల్సింది. ఆర్ట్ వర్క్ అదిరింది. ఆరోజుల్ని తలపించేలా కేర్ తీసుకోగలిగారు.

మైత్రీ మూవీస్ వాళ్ళు ఎప్పటిలాగే డబ్బు మంచి నీళ్ళలాగా ఖర్చు పెట్టేసారు. అయితే.. పెట్టిన ప్రతి పైసా తెరమీద కనిపిస్తుంది. ఇక సుకుమార్ గురించి మాట్లాడితే.. ఎంచుకున్న స్టోరీ పరమ రొటీన్ అయినా 80 నాటి పల్లెటూరి నేపథ్యం చుట్టూ తీర్చదిద్దడమే సూపర్ అనిపించింది. కానీ.. సెకండాఫ్‌గా జాగ్రత్త తీసుకుని వుండుంటే ఇంకా బాగుండేది.

చివరగా : ‘రంగస్థలం’.. సుక్కు‘మార్క్’ సినిమా!
రేటింగ్ : 3.25/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.