‘సప్తగిరి ఎల్.ఎల్.బి’ మూవీ రివ్యూ-రేటింగ్

saptagiri-llb-review-rating

సినిమా : సప్తగిరి ఎల్.ఎల్.బి
నటీనటులు : సప్తగిరి, కషిష్ వోహ్రా, సాయికుమార్, తదితరులు
డైరెక్టర్ : చరణ్ లక్కాకుల
నిర్మాత : డా కె.రవి కిరానే
సంగీతం : బుల్గానిన్
సినిమాటోగ్రఫీ : సారంగం
ఎడిటింగ్ : గౌతంరాజు
రిలీజ్ డేట్ : 07-12-2017

కమెడియన్ నుంచి హీరోగా మారిన సప్తగిరి గతేడాది ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’తో ప్రేక్షకుల ముందుకొచ్చి.. హీరోగా తన సత్తా చాటుకున్నాడు. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా.. సప్తగిరికి మాత్రం కథానాయకుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఈ కమెడియన్ కమ్ హీరోగా మరో ప్రయత్నం చేశాడు. బాలీవుడ్‌లో మంచి విజయం సాధించిన ‘జాలీ ఎల్‌ఎల్‌బి’ని తెలుగులో ‘సప్తగిరి ఎల్.ఎల్.బి’గా రీమేక్ చేశాడు. ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం.. హిందీలోలాగే ఇక్కడి ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా? రెండో చిత్రంతో సప్తగిరి మంచి విజయం సాధించాడా? ప్రేక్షకుల్ని సంతృప్తి పరచడంలో సక్సెస్ అయ్యాడా? లేదా? అనేది రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం పదండి..

కథ :
చిత్తూరులో ఎల్‌ఎల్‌బి పూర్తి చేసిన సప్తగిరి.. మంచి లాయర్‌గా ఎదగాలని, బాగా డబ్బులు సంపాదించి తన మరదల్ని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌కి షిఫ్ట్ అవుతాడు. అక్కడ సెషన్స్ కోర్టులో ప్రాక్టీస్ కేసులకోసం ఎదురుచూస్తుంటాడు. మొదట్లో చెత్తచెత్త కేసులు హ్యాండిల్ చేస్తూ.. జడ్జిలను విసిగిస్తుంటాడు. ఇలా సాగుతున్న క్రమంలో సప్తగిరికి ఓ ఊహించని పరిణామం ఎదురవుతుంది. దాంతో అతను ప్రముఖ లాయర్ రాజ్‌పాల్ (సాయి కుమార్) వాదించి, తీర్పు రాబట్టిన ఒక ‘హిట్ అండ్ రన్’ కేసుపై పిల్ వేసి దాన్ని మళ్ళీ రీ-ఓపెన్ చేయిస్తాడు.

అసలు సప్తగిరి ఎందుకు ఆ కేసుని రీ-ఓపెన్ చేయిస్తాడు? దాని కథేంటి? ఏవో చిన్నాచితకా కేసులు వాదించుకునే సప్తగిరి అంత పెద్ద కేసు జోలికి ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? ఆ కేసు విషయంలో లాయర్ రాజ్‌పాల్‌ను సప్తగిరి ఎలా ఎదుర్కొన్నాడు? చివరికి ఆ కేసు గెలుస్తాడా? లేదా? అనే అంశాలతో సాగేదే ఈ సినిమా.

విశ్లేషణ :
బాలీవుడ్‌లో మంచి విజయం సాధించిన ‘జాలీ ఎల్‌ఎల్‌బి’ని సప్తగిరి తెలుగులో రీమేక్ చేయబోతున్నాడని తెలియగానే.. అతను మంచి నిర్ణయమే తీసుకున్నాడని అంతా అనుకున్నారు. తన కెరీర్‌కి లిఫ్ట్ ఇచ్చే సబ్జెక్ట్‌నే ఎంచుకున్నాడని, కంటెంట్‌లో కూడా బలం ఉంది కాబట్టి ఈసారి సప్తగిరి కుమ్మేయడం ఖాయమనుకున్నారు. కానీ.. ఆశించిన స్థాయిలో పూర్తిగా మెప్పించలేకపోయాడు. కమర్షియల్‌గా ఆకట్టుకోవాలనే ఆతృతతో కామెడీ, యాక్షన్ అంటూ అత్యుత్సాహం ప్రదర్శించాడు.

అసలు ఫస్టాఫ్ మొత్తం ఆసక్తి రేకెత్తించే అంశాలేమీ పెట్టకుండా.. నవ్వీనవ్వించని కామెడీతోనే బండి లాగించేశాడు. కామెడీ హీరో కావడంతో కంపల్సరీ కామెడీ ఉండాలనే ఉద్దేశంతో అనవసరంగా సీన్లు జోడించాడు. ఆసక్తికరమైన కథనం లేకపోవడంతో చాలావరకు విసుగొస్తుంది. సీన్లు కావాలనే ఇరికించారని స్పష్టంగా అర్థమైపోతుంది. ఏమాత్రం ఎంగేజింగ్‌గా లేకుండా వెకిలి కామెడీతో సినిమా సాగిపోతుంది. మధ్యలో వచ్చే పాటలు ‘ఎందుకురా నాయనా’ అని తలబాదుకునేలా ఉంటాయి. అయితే.. సాయికుమార్ ఎంట్రీ సినిమా కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. అక్కడి నుంచి కథ కాస్త ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కాస్త ఆసక్తి రేకెత్తిస్తుంది.

ఇక సెకండాఫ్ విషయానికొస్తే.. ఇకనైనా సినిమా ఇంట్రెస్టింగ్‌గా, హీరో-సాయికుమార్‌ల మధ్య మైండ్‌గేమ్‌తో స్టోరీ సాగుతుందేమోననుకుంటే.. నిరాశే మిగిలింది. ప్రీ-క్లైమాక్స్ సినిమా మొత్తం సాదాసీదాగా నడుస్తుంది. ప్రీ-క్లైమాక్స్ నుంచి కథ బాగుంది. క్లైమాక్స్ అయితే సినిమాకి ప్రాణంగా నిలిచింది. అక్కడ సప్తగిరి చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. రొమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. ఓవరాల్‌గా చూస్తే.. ఇంటర్వెల్ ట్విస్ట్, ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఈ చిత్రానికి హైలైట్. మిగతాదంతా పాత చింతకాయపచ్చడే!

నటీనటుల ప్రతిభ :
సప్తగిరి హీరోగా నటన బాగానే పండించాడు కానీ.. అనవసరమైన కామెడీతో అక్కడక్కడ చాలా ఓవర్ చేశాడు. ఫైట్ సీన్లలో కూడా తేలిపోయాడు. ఆ అత్యుత్సాహం లేకపోయి ఉంటే చాలా బాగుండేది. డ్యాన్సులో మాత్రం తన ప్రతిభ చాటి, ఆకట్టుకున్నాడు. చివర్లో అతని డైలాగ్ డెలివరీ అదిరింది. ఇక సాయికుమార్ తన విలక్షణ నటనతో కట్టిపడేశాడు. రాజ్‌పాల్ క్యారెక్టర్‌లో ఒదిగిపోయి, సీరియస్ లాయర్‌గా అదరగొట్టేశాడు. జడ్జిగా శివ ప్రసాద్ నటన ఆకట్టుకుంది. హీరోయిన్ కషిష్ వోహ్రా తేలిపోయింది. మిగతా నటీనటులు మామూలే!

సాంకేతిక ప్రతిభ :
సారంగం సినిమాటోగ్రఫీ బాగుంది.. గౌతమ్ రాజు ఎడిటింగ్ కూడా పర్వాలేదు. బుల్గానిన్ అందించిన పాటలు అంతగా ఆకట్టుకోలేదు కానీ.. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం అదరగొట్టేశాడు. డా కె.రవి కిరానే నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు చరణ్ లక్కాకుల గురించి మాట్లాడితే.. అతను ఎంచుకున్న పాయింట్ బాగానే ఉంది కానీ, దాని చుట్టూ ఆసక్తికరమైన కథనాన్ని రాసుకోలేకపోయాడు. ఏదో ఉండాలని సీన్లు ఇరికించాడు కానీ, తన మార్క్ క్రియేటివిటీ చూపించలేదు. ఒక్క క్లైమాక్స్‌లో తప్ప.. మిగతా సినిమాపై పెద్దగా పనితనం చూపలేదు. దీంతో.. సినిమా తేలిపోయింది.

చివరగా : సప్తగిరి.. ఫినిషింగ్ టచ్ ఒక్కటే అదిరింది!
రేటింగ్ : 2.75/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.