మహేష్‌బాబు, మురుగదాస్‌ల ‘స్పైడర్’ రివ్యూ, రేటింగ్ & అనాలసిస్

spyder telugu movie review rating

సినిమా : స్పైడ‌ర్‌
నటీనటులు : మహేష్‌బాబు, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్‌జే సూర్య, ప్రియదర్శి తదితరులు
దర్శకత్వం: ఏఆర్.మురుగదాస్
నిర్మాతలు: ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు
బ్యాన‌ర్‌: ఎన్వీఆర్ సినిమా
ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్
మ్యూజిక్‌: హరీష్‌ జయరాజ్
రిలీజ్ డేట్‌: 27-09-2017

ప్రిన్స్ మహేష్‌బాబు, మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘స్పైడర్’ చిత్రం ప్రేక్షకులకు ముందుకొచ్చేసింది. ఎస్‌జే సూర్య విలన్‌గా, రకుల్ ప్రీత్ కథానాయికగా నటించిన ఈ చిత్రం.. ‘బాహుబలి’ తర్వాత ఇండియన్ మార్కెట్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందింది. టైటిల్ దగ్గరనుంచి అంచనాలు పెంచుకుంటూ వస్తున్న ఈ చిత్రం.. సెన్సార్ సభ్యుల నుంచి పాజిటివ్ రిపోర్ట్ అందుకోవడంతో దీనికి మరింత క్రేజ్ వచ్చిపడింది. ఇక మహేష్-మురుగ క్రేజీ కాంబో కావడంతో.. ఈ చిత్రంపై మరిన్ని ఆశలు రేకెత్తాయి. మరి.. ఇన్ని అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం వాటిని అందుకోవడంలో సక్సెస్ అయ్యిందా? లేదా? రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం..

కథ :
ఇంటిలిజెన్స్ బ్యూరో ఆఫీస్‌లో గూఢాచారి (స్పై ఆఫీసర్) అయిన శివ (మహేష్‌బాబు) సొసైటీలో జరిగే అన్యాయాల్ని, అక్రమాల్ని అంతమొందిస్తుంటాడు. టెక్నాలజీ ఆధారంగా సమస్యల్లో వున్న వారిని రక్షిస్తుంటాడు. ఒకరోజు శివకి ఓ ఫోన్ కాల్ వస్తుంది. దాని కారణంగా అతని జీవితంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉన్నట్లుండి సిటీలో రెండు వరుస హత్యలు జరుగుతాయి. ఆ హత్యలపై విచారణ ప్రారంభించిన శివకి కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి.

ఇంతకీ హత్యకు గురైన ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? వారిని ఎవరు, ఎందుకు చంపారు? ఈ హ‌త్య‌ల‌కు, భైర‌వుడు (ఎస్‌జె సూర్య‌)కు ఉన్న సంబంధం ఏంటి? అతనెందుకు సమాజాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుంటాడు? సొసైటీని అంతమొందించాలని అతను వేసిన ఎత్తుగడల్ని శివ ఎలా ఎదుర్కొన్నాడు? ఇంతకీ రకుల్ ప్రీత్ ఎవరు? ఆమె శివ జీవితంలో ఎలా, ఎందుకు వస్తుంది? ఆమెకి, శివకి వున్న లింక్ ఏంటి? అనే అంశాలతో ఈ సినిమా సాగుతుంది.

విశ్లేష‌ణ ‌:
సొసైటీని నాశనం చేయాలని కంకణం కట్టుకున్న విలన్, అతని ప్లాన్స్‌ని అడ్డుపడే హీరో మధ్య సాగే యాక్షన్ థ్రిల్లరే ఈ సినిమా. ఇదేమీ కొత్త కథ కాదు. ఆల్రెడీ ఈ స్టోరీలైన్‌తో ఎన్నో చిత్రాలు వచ్చాయి. కాకపోతే.. మురుగ తనదైన శైలిలో తెరకెక్కించి, మ్యాజిక్ చేశాడు. క్రిస్పీ స్ర్కీన్‌ప్లేతో సినిమాని నడిపించి.. ఆడియెన్స్‌ని కట్టిపడేశాడు.

ఫస్టాఫ్ విషయానికొస్తే.. హీరో, గుఢాచారిగా అతను చేసే పనుల్ని రివీల్ చేస్తూ మొదట్లో కాసేపు సాగుతుంది. పబ్లిక్ సమస్యల్ని సీక్రెట్‌గా వినే క్రమంలో రకుల్ ప్రీత్ ఫోన్ కాల్ వస్తుంది. అలా ఆ ఇద్దరిమధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారుతుంది. ఓవైపు దుర్మార్గుల్ని అరికట్టే హీరో ఎపిసోడ్స్‌తో, మరోవైపు హీరో-హీరోయిన్ రొమాంటిక్ ట్రాక్స్‌తో నడుస్తున్న టైంలో.. ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌తో కథ టర్న్ తీసుకుంటుంది. విలన్ ఎంట్రీతో వేగం పుంజుకుంటుంది. ఒక మైండ్‌బ్లోయింగ్ ఎపిసోడ్, ట్విస్ట్‌తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. ఇక సెకండాఫ్ మొత్తం థ్రిల్లింగ్‌గా, ఉత్కంఠ భరితమైన యాక్షన్ ఎపిసోడ్స్‌తో నడుస్తుంది. హీరో-విలన్ మధ్య సాగే దొంగా-పోలీస్ ఆట బాగుంది. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా.. క్లైమాక్స్‌లో వచ్చే రోలర్ కోస్టర్ ఫైట్ సీన్‌ పూనకాలు తెప్పిస్తుంది.

ఓవరాల్‌గా చూస్తే.. ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఈ చిత్రానికి మేజర్ హైలైట్. హీరో ఎలివేషన్ సీన్లు పెద్దగా ఏమీ లేవు. హీరో ఎంట్రీయే చాలా నార్మల్‌గా వుంది. హీరో-హీరోయిన్ మధ్య సాగే రొమాంటిక్ ట్రాక్ ఫర్వాలేదంతే. సినిమా ఎక్కువగా ఫ్లాట్ నరేషన్‌తో నడిచింది. ఈ చిత్రానికి సెకండాఫే హైలైట్. హాలీవుడ్ రేంజ్‌లో వుండే యాక్షన్ సీన్స్, థ్రిల్ చేసే సీన్స్‌తో ఆసక్తికరంగా వుంది. ఎమోషన్ కూడా బాగానే పండింది. ఇక మురుగ‌దాస్ మార్క్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి.

న‌టీన‌టుల పెర్పామెన్స్:
ప్రిన్స్ మహేష్‌బాబు ఎప్పట్లాగే తనదైన స్టైలిష్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. గూఢాచారిగా తన లుక్స్, మేనరిజమ్స్‌తో కట్టిపడేశాడు. ఇన్వెస్టిగేషన్ సీన్స్‌లలో అతని పెర్ఫార్మెన్స్ అద్భుతం. ఎమోషనల్ సీన్స్‌ని కూడా బాగానే పండించాడు. భైరవుడిగా ఎస్‌జే సూర్య అదరగొట్టేశాడు. విలనిజాన్ని కొత్తగా ఆవిష్కరించి.. ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాడు. మనసుల్ని చంపడంలో వున్న ఆనందం పొందే క్యారెక్టర్‌లో మెప్పించాడు. ఇక హీరోయిన్ రకుల్ ప్రీత్‌కి పెద్దగా స్కోప్ లేకపోయినా.. ఉన్నంతలో బాగానే నటించింది. ఇందులో మరో విలన్‌గా నటించిన భరత్ కాసేపే వెండితెరమీద కనిపించాడు. మ‌హేష్‌ ఫ్రెండ్‌గా నటించిన ప్రియ‌ద‌ర్శి, ఇతర క్యారెక్ట‌ర్లు తమతమ పాత్రల్లో బాగానే నటించారు.

టెక్నిక‌ల్ పెర్ఫార్మెన్స్:
సంతోష్ శివ‌న్ సినిమాటోగ్ర‌ఫీ ఈ చిత్రానికే పెద్ద ఎస్సెట్‌. తన కెమెరాపనితనంతో ఓ హాలీవుడ్ చిత్రాన్ని మనకు చూపించాడు. అంత అద్భుతంగా తన ప్రతిభ చాటి చెప్పాడాయన. హరీస్ జయరాజ్ పాటలు అస్సలు ఆకట్టుకోలేకపోయినా.. ఆర్‌ఆర్ మాత్రం ఇరగదీసేశాడు. ముఖ్యంగా.. సెకండాఫ్‌లో కుమ్మేశాడు. శ్రీక‌ర ప్ర‌సాద్ ఎడిటింగ్ చాలా బాగుంది. తక్కువ రన్‌టైం వుండటం ఈ చిత్రానికి మరో మేజర్ ప్లస్ పాయింట్. రన్‌టైం తక్కువ వుండటం వల్లే సినిమా స్పీడ్‌గా సాగిపోతుంది. నిర్మాణ విలువ‌లకు ఎక్కడా వంకపెట్టడానికి లేదు. ఇక మురుగదాస్ గురించి మాట్లాడుకుంటే.. అతని ప్రతిభ ఏంటో అందరికీ తెలుసు. ప్రతిసారి కొత్త సోషల్ పాయింట్‌తో స్ర్కీన్‌ప్లే మ్యాజిక్‌తో ఆకట్టుకుంటాడు. అయితే.. ‘స్పైడర్’ కోసం అతను ఎంచుకున్న స్టోరీలైన్ గత సినిమాలతో పోల్చుకుంటే చాలా వీక్‌గా అనిపిస్తుంది. అయినప్పటికీ.. త‌న‌దైన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ప్రేక్ష‌కుడిని మెప్పించేందుకు ప్ర‌య‌త్నించాడు.

ప్ల‌స్ పాయింట్స్ :
* మ‌హేష్ స్టైలీష్ యాక్టింగ్‌, ఎస్‌జే సూర్య విలనిజం
* తక్కువ రన్‌టైం
* బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
* సెకండాఫ్‌
* మురుగ‌దాస్ మార్క్ థ్రిల్ సీన్లు
* వీఎఫ్‌ఎక్స్

మైన‌స్ పాయింట్స్ :
* వీక్ స్టోరీలైన్, ఫ్లాట్ నరేషన్
* పాటలు
* లెస్ ఎంటర్‌టైన్‌మెంట్
* ఫస్టాఫ్‌లో కొంత పార్ట్

చివరగా : మెస్మరైజ్ చేసే యాక్షన్ థ్రిల్లర్
రేటింగ్‌: 3/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.