నితిన్, రాశీఖన్నాల ‘శ్రీనివాస కళ్యాణం’ మూవీ రివ్యూ-రేటింగ్

చిత్రం : శ్రీనివాస కళ్యాణం
నటీనటులు : నితిన్, రాశి ఖన్నా, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, నందిత శ్వేత, పూనమ్ కౌర్, తదితరులు
రచన – దర్శకత్వం : సతీశ్ వేగేశ్న
నిర్మాతలు : రాజు – శిరీష్
సంగీతం : మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫీ : సమీర్ రెడ్డి
ఎడిటింగ్ : మధు
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
రిలీజ్ డేట్ : 09-08-18

‘శతమానం భవతి’ చిత్రంతో సంక్రాంతి పండగ విశిష్టతను చాటిచెప్పిన సతీష్ వేగేశ్న… ఈసారి హిందూ సంప్రదాయంలో పెళ్ళి గొప్పతనాన్ని తెలియజేస్తూ ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాని తెరకెక్కించాడు. నితిన్, రాశీఖన్నా జంటగా దిల్‌రాజు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంపై మొదటినుంచే మంచి అంచనాలున్నాయి. ఇక ప్రోమోలు చాలా ఆసక్తికరంగా వుండటంతో దీనికి మరింత క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా.. ఇది ఫ్యామిలీ ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించగలిగింది. మరి.. ఆ అంచనాలకి తగ్గట్టు ఈ చిత్రం మెప్పించిందా? లేదా? పదండి తెలుసుకుందాం!

కథ :
శ్రీనివాస రాజు అలియాస్ వాసు (నితిన్) ఒక ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగిన యువకుడు. ఇతనికి సంప్రదాయాలంటే ఎంతో గౌరవం. చండీగఢ్‌లో ఉద్యోగం చేస్తున్న వాసుకి అనుకోకుండా శ్రీదేవి (రాశీఖన్నా) పరిచయం అవుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. తమ ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు చెప్పి, పెళ్ళికి అంగీకరిస్తారు.

అయితే.. శ్రీదేవి తండ్రి ఆర్కే (ప్రకాష్‌రాజ్)కి సంప్రదాయాలంటే అస్సలు పడదు. అతను కేవలం బిజినెస్‌కే ఎక్కువ విలువ ఇస్తాడు. తన కూతురు ప్రేమను కాదనలేక వాసుతో పెళ్ళికి అంగీకరిస్తాడు కానీ.. కొన్ని షరుతులు పెడతాడు. అదే టైంలో వాసు కూడా ఆర్కేకి ఓ షరతు పెడతాడు? మరి ఈ షరతులేంటి? వాసు-శ్రీల పెళ్ళి సాఫీగానే సాగిందా, లేదా? అనేదే ఈ సినిమా కథ.

విశ్లేషణ :
దర్శకుడు సతీష్ వేగేశ్న ఎంచుకున్న పాయింట్ చాలా మంచిది. మానవ సంబంధాలు, సంప్రదాయాలు వంటివి పట్టింపులేకుండా ఉరుకులు-పరుగులు పెడుతున్న ప్రస్తుత జనరేషన్‌కి వాటి విలువలు తెలియజేయాలని ఈ మూవీ ద్వారా మంచి ప్రయత్నమే చేశాడు. కాకపోతే ఆ డోస్ మరీ ఎక్కువైపోయింది. ఎమోషన్స్ బాగా పండించాలనే అభిప్రాయంతో మరీ నాటకీయంగా సినిమాని తీర్చిదిద్దాడు. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు ఇందులో చాలానే ఉన్నప్పటికీ.. కొన్ని చోట్ల సంప్రదాయాల గురించి మరీ క్లాస్ పీకినట్లు అనిపించింది. ఒక సమయంలో సీన్స్‌కి కనెక్ట్ అయ్యేలోపే, ఇంకో టైంలో ఆ డోస్ తట్టుకోలేక ప్రేక్షకుడు విరక్తి చెందుతాడు. అక్కడక్కడ ‘బ్రహ్మోత్సవం’ ఛాయలు కూడా ఇందులో కనిపిస్తాయి.

ఫస్టాఫ్ విషయానికొస్తే.. హీరో, హీరోయిన్ పాత్రల పరిచయాలు.. వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్‌లతో స్టార్ట్ అవుతుంది. ఇక లవ్ ట్రాక్, కామెడీ సన్నివేశాలు, అక్కడక్కడ ఎమోషన్స్ పండిస్తూ సరదాగా సాగిపోయింది. ప్రథమార్థంలో బోరింగ్‌గా ఫీలయ్యే అంశాలేవీ లేవు. ప్రేక్షకులకు కావాల్సిన ఎంగేజింగ్ ఎలిమెంట్స్‌తో బాగానే ఎంటర్టైన్ చేయగలిగింది. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని సీన్స్ బాగా పండాయి. ఎక్కడా పెద్దగా సాగదీసినట్లుగా లేదు. ద్వితీయార్థంలోనే అసలు విషయం తేలిపోయింది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ని టార్గెట్ చేస్తూ, పెళ్ళి గొప్పదనం విశ్లేషిస్తూ బాగా సాగదీశారు. అంతర్లీనంగా అర్థమయ్యేలా తీయకుండా.. డైలాగుల రూపంలో బుర్ర తినేశారు. అక్కడక్కడ కామెడీ ట్రాక్ బాగానే వర్కౌట్ అయినా.. ఎమోషనల్ ఎపిసోడ్సే విసిగించేశాయి.

పల్లెటూరి నేపథ్యం, పెళ్ళి వాతావరణం బాగానే ఆకట్టుకున్నా.. బలమైన సీన్లే పడలేదు. మెలోడ్రామా చాలా ఎక్కువైపోయింది. ప్రతి సీన్లోనూ నాటకీయతమే కనిపిస్తుంది. కొన్నిచోట్ల వాటిని భరించడం కష్టమైపోతుంది. పోనీ కొత్తదనం ఏమైనా వుందా అంటే.. పాత కథే, ఫ్లాట్ నరేషనే కావడంతో మరో పెద్ద మైనస్. అయితే.. ఇది ఫ్యామిలీ ఆడియెన్స్‌కి ఎక్కుతుంది. సెకండాఫ్‌లో నాటకీయతను పెద్దగా పట్టించుకోకుంటే.. ఈ సినిమాని ఓసారి చూడొచ్చు.

నటీనటుల ప్రతిభ :
నితిన్ ఈసారి ఎలాంటి హడావుడి చేయకుండా శ్రీనివాస రాజుగా డీసెంట్ పాత్రలో కనిపించాడు. అతడి లుక్, నటన బాగానే వున్నాయి. ఈ పాత్రలో అతను మంచి ఇంప్రెషనే కలిగించాడు. రాశీఖన్నా నటనలో ప్రత్యేకత ఏమీ లేకపోయినా.. ఆమె అందంగా కనిపించింది. ఇక ప్రకాష్‌రాజ్ మరోసారి తన పాత్రకి జీవం పోశాడు. రాజేంద్రప్రసాద్ పర్వాలేదనిపించారు. జయసుధ ఎప్పట్లాగే మెప్పించింది. ఇతర పాత్రలకి పెద్దగా స్కోప్ ఇవ్వకపోయినా.. తమతమ పాత్ర పరిధి బాగానే నటించారు.

టెక్నికల్ పెర్ఫార్మెన్స్ :
సినిమాలో చెప్పుకోదగిన అంశాల్లో సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఒకటి. ప్రతి విజువల్‌ని ఆద్యంతం కలర్‌ఫుల్‌గా చూపించాడు. ముఖ్యంగా.. పల్లెటూరి అందాల్ని అద్భుతంగా ప్రెజెంట్ చేశాడు. మిక్కి.జే.మేయర్ ఈసారి తన ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ఒక డ్యుయెట్, పెళ్ళి పాటలు మాత్రమే బాగున్నాయి. నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. ఇక దర్శకుడు సతీశ్ ఎంచుకున్న పాయింట్ బాగానే వున్నా.. దాన్ని సరిగ్గా కన్వే చేయలేకపోయాడు. ఎమోషన్స్ పండించాలనే అభిప్రాయంతో డోస్ బాగా పెంచి, వినోదం ఇవ్వలేకపోయాడు.

చివరగా : కుటుంబ ప్రేక్షకులకు మెచ్చే ‘కళ్యాణం’
రేటింగ్ : 2.75/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.