సూర్య, కీర్తి సురేష్‌ల ‘గ్యాంగ్’ రివ్యూ, రేటింగ్

సినిమా : గ్యాంగ్‌
న‌టీన‌టులు : సూర్య, కీర్తిసురేశ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, త‌దిత‌రులు
దర్శకత్వం : విఘ్నేష్ శివ‌న్‌
నిర్మాత‌లు : కె.ఇ.జ్ఞాన‌వేల్ రాజా, వంశీ, ప్రమోద్‌
సంగీతం : అనిరుధ్‌
సినిమాటోగ్రఫీ : దినేశ్‌ కృష్ణన్‌
ఎడిటర్ : శ్రీకర్‌ ప్రసాద్‌
సంస్థ : స్టూడియో గ్రీన్
సమర్పణ : యు.వి.క్రియేషన్స్
రిలీజ్ డేట్ : 12-01-2017

తమిళ స్టార్ హీరో సూర్య తెలుగులోనూ స్టార్ హీరో రేంజులో తనకంటూ ప్రత్యేక మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. అందుకే.. అతని సినిమాలు రిలీజైనప్పుడు తమిళంకి సమానంగా ఇక్కడ కూడా మంచి అంచనాలే నెలకొంటాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చిన ‘గ్యాంగ్’ మూవీపై కూడా అలాంటి క్రేజే నెలకొంది. హిందీలో విజ‌య‌వంత‌మైన ‘స్పెష‌ల్ 26’ స్ఫూర్తితో దర్శకుడు విఘ్నేష్ శివ‌న్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కీర్తిసురేష్ కథానాయికగా నటించిన ఈ మూవీ కోసం తొలిసారి సూర్య తెలుగులో డ‌బ్బింగ్ చెప్పడం విశేషం. డిఫరెంట్ ప్రోమోలతో, ప్రమోషన్స్‌తో జనాల్ని ఆకట్టుకోవడంతో ఈ చిత్రానికి భారీ క్రేజ్ వచ్చిపడింది. మరి.. ఈ చిత్రం వాటిని అందుకోగలిగిందా? లేదా? రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం పదండి..

కథ :
ఉన్నత విద్యనభ్యసించిన ఉత్తమ్ దాస్ (సూర్య) సీబీఐ ఆఫీసర్‌ అవ్వాలని ఎప్పటినుంచో కలలు కంటుంటాడు. కానీ.. తండ్రి సీబీఐలో ఓ క్లర్క్‌ కావడంతో ఇంటర్వ్యూలో ఉత్తమ్‌కి దారుణమైన అవమానం జరుగుతుంది. ఉద్యోగం కూడా రాదు. మరోవైపు.. ఉత్తమ్ స్నేహితుడు పోలీస్ కావాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే.. లంచం ఇస్తేనే ఉద్యోగం అని చెప్పడంతో దారిలేక అతను ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ సంఘటన తర్వాత చలించిపోయిన ఉత్తమ్.. వ్యవస్థలో నిజాయితీ లేదని గుర్తిస్తాడు. తన స్నేహితుడికి జరిగిన దుస్థితి మరెవరికి జరగకూడదని ఓ మాస్టర్ ప్లాన్ వేస్తాడు.

తనే అనధికారికంగా సీబీఐ అధికారి అవతారం ఎత్తి.. తనలాగే కష్టాల్లో ఉన్నవారితో కలిసి ఒక గ్యాంగ్‌ని ఏర్పాటు చేస్తాడు. సీబీఐ పేరు చెప్పి అక్రమంగా సంపాదించిన వారి దగ్గర నుంచి డబ్బులు కొట్టేయడమే ఆ గ్యాంగ్ పని. కొన్నాళ్లు వీరి వ్యవహారం గుట్టుగానే సాగుతుంది కానీ.. చివరికి వీరి బండారం బయటపడుతుంది. వీరిని పట్టుకునేందుకు నిజమైన సిబిఐ అధికారులు రంగంలోకి దిగుతారు. ఆ తర్వాత ఏమైంది? ‘గ్యాంగ్’ని సిబిఐ పట్టుకోగలిగిందా? వారికి దొరక్కుండా గ్యాంగ్ ఎలాంటి ఎత్తుగడలు వేసింది? అనే అంశాలతో ఈ సినిమా సాగుతుంది.

విశ్లేషణ :
సమాజంలో చదువుకు తగ్గ ఉద్యోగం దొరకడం లేదు. లంచం ఇస్తే గానీ జాబ్ దొరకదు. ఉన్న ప్రభుత్వ అధికారులు తమ బాధ్యత మరిచి, అవినీతికి పాల్పడుతున్నారు. ఇలాంటి వ్యవస్థపై హీరో చేసే యుద్ధమే ఈ సినిమా. దీన్ని వెండితెరపై విఘ్నేష్ శివన్ చాలా అద్భుతంగా, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా నీటుగా తీర్చిదిద్దాడు. సినిమా చూస్తున్నంతసేపు ఆ తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠతో చివరికి వరకు నడుస్తుంది. 1987 నేపథ్యంలో స్టోరీ పక్కదారి పట్టకుండా వినోదాన్ని పంచుతూ సరదాగా, ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని మలిచాడు విఘ్నేష్.

ఫస్టాఫ్ గురించి మాట్లాడితే.. తొలుత సినిమాల పాత్రల నేపథ్యంతో నడుస్తుంది. నకిలీ సీబీఐ గ్యాంగ్‌ ఏర్పడ్డాక సినిమా చాలా ఆసక్తికరంగా మారుతుంది. తాము నకిలీ సీబీఐ గ్యాంగ్ అని ఏమాత్రం అనుమానం రాకుండా అక్రమార్కుల సొమ్మును కాజేసే సంఘటనలు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఆ సీన్లలో వినోదాన్ని కూడా జోడించి, సరదాగా తీర్చిదిద్దాడు విఘ్నేష్. అనంతరం ‘గ్యాంగ్‌’ ఎందుకు కట్టాల్సి వచ్చిందో చెబుతూ వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్, అక్కడొచ్చే సీన్లు మనసుల్ని హత్తుకుంటాయి. ఇంటర్వెల్ సమయంలో ఈ గ్యాంగ్ ఆచూకి సీబీఐ అధికారులకు తెలుస్తుంది. ఇదే ఇక్కడ అసలు సిసలైన ట్విస్ట్. అది సెకండాఫ్‌పై మరిన్ని అంచనాల్ని పెంచుతుంది. అందుకు తగినట్లే ద్వితీయార్థం చాలా ఇంట్రెస్టింగ్‌గా నడుస్తుంది.

గ్యాంగ్ ఆచూకీ తెలుసుకున్న సీబీఐ అధికారులు వారికి పట్టుకోవడానికి ఒకదానికిమించి మరొకటి స్కెచ్చులు వేస్తే.. గ్యాంగ్‌ కూడా సీబీఐ అధికారులకు ధీటుగా ఎత్తుకుపైఎత్తులు వేస్తూ తప్పించుకుంటూ ఉంటుంది. ఇక పతాక సన్నివేశాలైతే మరో ఎత్తు. అక్కడొచ్చే మలుపులు, సందేశం రొమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. ఈ సినిమా ముగింపు కూడా ఎవ్వరూ ఊహించలేని రీతిలో ఉంటుంది. అక్కడ ఆడియెన్స్ ఖంగుతినాల్సిందే.

మైనస్ పాయింట్స్ ఏంటంటే.. సినిమాలో సీరియస్‌నెస్ లోపించింది. ఇంటర్వెల్ తరువాత కూడా సినిమా కాస్త నిధానంగానే సాగినట్లు అనిపిస్తుంది. పైగా.. సెకండాఫ్‌లో చాలావరకు తమిళ నేపథ్యమే కనిపిస్తుంది. అనిరుధ్ అందించిన పాటలు ఒకటి రెండు తప్పా మిగతావి పెద్దగా ఆకట్టుకోలేదు.

నటీనటుల ప్రతిభ :
ఈ చిత్రానికి సూర్య నటనే ప్రధాన బలం. ఓ మధ్యతరగతి యువకుడిగా, గ్యాంగ్‌కు లీడర్‌గా చక్కటి అభినయం కనబరిచాడు. సీబీఐ ఆఫీసర్‌ ఝాన్సీరాణిగా మారిన బుజ్జమ్మ పాత్రలో రమ్యకృష్ణ ఆకట్టుకుంది. అలాగే.. సీబీఐ బాస్‌ శివశంకర్‌ పాత్రలో సీనియర్‌ నటుడు కార్తిక్‌ కట్టిపడేశాడు. కీర్తిసురేశ్‌ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఆమె కేవలం పాటలకు, కొన్ని సీన్లకే పరిమితం అయ్యింది. మిగిలిన పాత్రలన్నీ పరిధి మేరకు సందడి చేస్తాయి.

టెక్నికల్ ప్రతిభ :
దినేష్ కృష్ణన్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో చిత్రీకరించిన సీన్లు బాగా వచ్చాయి. 1987 నేపథ్యానికి తగ్గట్టుగా అనిరుధ్ చక్కటి సంగీతం అందించాడు. ఎడిటింగ్ వర్క్ బాగుంది. స్టూడియో గ్రీన్ నిర్మాణ విలువలు బాగున్నాయి. విఘ్నేష్‌ శివన్‌ ‘స్పెషల్‌ 26‌’ స్ఫూర్తితో కథ రాసుకున్నా.. దక్షిణాదికి తగ్గట్టు మార్పులు చేశాడు. ఆసక్తికరమైన సీన్లలోనూ వినోదం యాడ్ చేసిన తీరు ఆకట్టుకుంది.

చిరవగా : ప్రేక్షకుల హృదయాల్ని దోచుకున్న ‘గ్యాంగ్’
రేటింగ్ : 3/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.