రవితేజ, రాశిఖన్నా, సీరత్ కపూర్‌ల ‘టచ్ చేసి చూడు’ మూవీ రివ్యూ-రేటింగ్

సినిమా : ట‌చ్ చేసి చూడు
న‌టీన‌టులు : ర‌వితేజ‌, రాశీఖ‌న్నా, సీర‌త్ క‌పూర్‌, వెన్నెల కిషోర్‌, తదితరులు
కథ : వక్కంతం వంశీ
దర్శకత్వం : విక్రమ్ సిరికొండ
నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ
సంగీతం : జామ్ 8, మణిశర్మ (నేపథ్యం సంగీతం)
సినిమాటోగ్రఫీ : చోటా.కె.నాయుడు
ఎడిటింగ్ : గౌతం రాజు
బ్యానర్ : లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్ : 02-02-2018

‘రాజా ది గ్రేట్’తో కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ.. ఇప్పుడు ‘టచ్ చేసి చూడు’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కొత్త దర్శకుడు విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. ప్రోమోలతో మంచి క్రేజ్ సాధించింది. ప్రమోషన్ కార్యక్రమాలు పెద్దగా చేయకపోయినప్పటికీ.. రవితేజ మాస్ క్రేజ్‌తో ఈ మూవీపై మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి.. వాటిని అందుకోవడంలో ఇది సక్సెస్ అయ్యిందా? లేదా? రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం పదండి..

కథ :
కార్తికేయ(రవితేజ)కు తన కుటుంబం అంటే ప్రాణం. పాండిచ్చేరిలో ఒక పరిశ్రమ ఏర్పాటు చేసుకుని.. ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతుంటాడు. కట్ చేస్తే.. ఒకరోజు కార్తికేయ చెల్లెలు ఓ యువకుడి హత్యను కళ్ళారా చూస్తుంది. ఆ హత్యకు తాను సాక్ష్యం చెబుతానని ఆమె చెప్పడంతో.. నిందితుడి ఆచూకీ తెలుసుకునేందుకు కార్తికేయ ప్రయత్నిస్తాడు. అయితే.. ఆ హత్య చేసిన ఇర్ఫాన్‌లాలా (ఫ్రెడ్డీ దారువాలా)నే కార్తికేయకి ఎదురుపడతాడు.

ట్విస్ట్ ఏంటంటే.. ఇర్ఫాన్‌లాలాను కార్తికేయ అంతకుముందే చంపేసినట్లు పోలీసు రికార్డుల్లో ఉంటుంది. అలాంటిది.. స్వయంగా తన ముందు అతగాడు ప్రత్యక్షమవ్వడంతో కార్తికేయ కూడా షాక్‌కి గురవుతాడు. ఇక అప్పటినుంచి కార్తికేయ ఆ ఇర్ఫాన్‌లాలాను వేటాడటం మొదలుపెడతాడు. ఇంతకీ ఇర్ఫాన్‌లాలా ఎవరు? అతనికి, కార్తికేయకి వున్న లింక్ ఏంటి? అసలు కార్తికేయ గతం ఏంటి? కార్తికేయ లైఫ్‌లోకి పుష్ప(రాశీఖన్నా), దివ్య(సీరత్‌కపూర్‌) ఎలా వచ్చారు? అనే అంశాలతో ఈ మూవీ సాగుతుంది.

విశ్లేషణ :
ఈ సినిమా స్టోరీ కొత్తదేం కాదు. రెండు హత్యలకు కారణమైన విలన్‌ని మట్టుబెట్టడమే ఈ సినిమా కథ. ఇలాంటి స్టోరీలతో ఇప్పటికే బోలెడన్ని సినిమాలొచ్చాయి. కథనమూ ప్రత్యేకంగా వుందా అంటే అదీ లేదు. కాకపోతే రవితేజ సినిమాలో ఏవైతే వుండాలో.. ఆ కొలతలతో దర్శకుడు సిరికొండ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కామెడీ, ఫ్యామిలీ, ఎమోషన్స్, మాస్.. ఇలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌ని సరిగ్గా జోడించి మూవీని రూపొందించాడు. మరీ బోరింగ్‌గా లేకుండా ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయడంలో ఒకింత సక్సెస్ సాధించాడు.

ఫస్టాఫ్ విషయానికొస్తే.. ఇదంతా సరదా సన్నివేశాలతోనే నడుస్తుంది. రవితేజ మార్క్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, హీరోయిన్లతో రొమాన్స్ వంటి ఎపిసోడ్స్‌తో ఫన్నీగా సాగుతుంది. ముఖ్యంగా.. రాశీఖన్నా పెళ్లి చూపుల నేపథ్యంలో వచ్చే సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. కథ ఏంటో చెప్పకుండా ఈ సీన్లతోనే ఇంటర్వెల్ వరకు నడిపించేశారు. ఇంటర్వెల్ వద్ద వచ్చే ట్విస్ట్‌తో కథ ఆసక్తికరమైన టర్న్ తీసుకుంటుంది. అక్కడినుంచే అసలు స్టోరీ మొదలవుతుంది. రవితేజ ఎవరు? అతని గతం ఏంటి? విలన్‌ని అతను ఎలా మట్టుబెట్టాడు? అనే అంశాల చుట్టూ సినిమా సాగుతుంది.

సెకండాఫ్ మొత్తం సీరియస్‌గానే సాగడంతో.. ఫస్టాఫ్‌లో ఉన్నంత కామెడీ ఇక్కడ కొరవడింది. మాస్ సీన్లు అదిరిపోయాయి. కానీ.. పతాకా సన్నివేశాలు మాత్రం సాదాసీదాగా అనిపిస్తాయి. విలన్ పాత్ర కూడా బలంగా లేకపోవడం మరో మైనస్. వీటన్నింటినీ పక్కనపెడితే.. ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు.

నటీనటుల ప్రతిభ :
రవితేజ ఎప్పట్లాగే తన విశ్వరూపం చూపించాడు. కామెడీ, యాక్షన్‌ సన్నివేశాల్లో తన మార్కును చూపిస్తూ అదరగొట్టేశాడు. ముఖ్యంగా.. పోలీస్ పాత్రలో దుమ్ముదులిపేశాడు. ఆ తరహా పాత్రలు తనకు కొట్టి పిండేనని మరోసారి రుజువుచేశాడు. రాశీఖన్నా బాగానే నటించింది. రవితేజతో పోటీపడి నవ్వించేందుకు ప్రయత్నించింది. సీరత్‌ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. వెన్నెల కిషోర్‌, సత్యం రాజేశ్‌, జీవా తదితరులు తమ పాత్ర పరిధిమేరకు నవ్వించారు. విలనిజం ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేది. మిగతావారంతా మామూలే!

సాంకేతిక ప్రతిభ :
చోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు కానీ.. మణిశర్మ నేపథ్య సంగీతం మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. విక్రమ్‌ సిరికొండకు ఇదే తొలి చిత్రమైనప్పటికీ.. రవితేజ శైలిలో సినిమాని చక్కగా చూపించాడు. కథనంలో మాత్రమే కొత్తదనం లేదు.

చివరగా : రవితేజని ఒక్కసారి ‘టచ్’ చేసి చూడాల్సిందే!
రేటింగ్ : 3/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.